ఫెడ్ నిర్ణయం ఆధారంగా ట్రెండ్
* ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అంచనా
* బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీపైనా దృష్టి
ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ 20,21 తేదీల్లో జరిపే పాలసీ సమీక్షలో వెలువడే నిర్ణయం ఆధారంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అలాగే అవేతేదీల్లో బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ మీటింగ్ కూడా జరుగుతుందని, ఈ కేంద్ర బ్యాంకు ప్రకటిస్తుందని భావిస్తున్న ఉద్దీపన ప్యాకేజీ కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అమెరికా ఫెడ్, బ్యాంక్ జపాన్ల పాలసీ సమావేశాలు మంగళవారం మొదలవుతాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా తెలిపారు.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం తప్ప, ప్రస్తుతానికి భారత్ మార్కెట్‌కు సంబంధించి ఎటువంటి ప్రతికూల అంశాలు లేవని, లిక్విడిటీతో ర్యాలీ కొనసాగవచ్చని అంచనావేస్తున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల అంచనాల్ని, వడ్డీ రేట్ల పెంపు సంకేతాల్ని ఫెడ్ వెలువరిస్తుందని, వాటి ప్రకారం మార్కెట్లో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా వివరించారు. సమీప భవిష్యత్తులో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను అమెరికా ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ల నిర్ణయాలు ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు.
ముడి చమురు, రూపాయిల కదలికలు...
అమెరికా, జపాన్ల కేంద్ర బ్యాంకుల నిర్ణయాలతో పాటు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర, దేశీయంగా డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు కూడా స్టాక్ మార్కెట్ ట్రెండ్‌కు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. ఇటీవల వేగంగా చమురు ధర పతనమవుతోంది. గత శుక్రవారం నెమైక్స్ క్రూడ్ ధర 43 డాలర్ల స్థాయికి పడిపోయింది. వివిధ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతున్న నేపథ్యంలో రూపాయి మారకపు విలువ కూడా 67 స్థాయికి బలహీనపడింది. ఈ రెండు అంశాలు కూడా ఇన్వెస్టర్లకు ముఖ్యమేనని క్యాపిటల్వయో గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ చెప్పారు. ఈ వారం దృష్టి అంతా అమెరికా ఫెడ్ మీటింగ్‌పైనే వుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోది చెప్పారు. ఫెడ్ నిర్ణయ ప్రభావం వచ్చే కొద్దివారాలపాటు మార్కెట్‌పై వుంటుందని కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా అంచనావేశారు.
ఈక్విటీల్లోకి రూ.11వేల కోట్ల ‘ఫండ్స్’
న్యూడిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల రాకతో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్లలో రూ.11,600 కోట్లు పంప్ చేశాయి. గత రెండేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్ తీరులోనే ఇవి ఉన్నాయి. 2015లో ఫండ్స్ పెట్టుబడులు రూ.70వేల కోట్లు కాగా, 2014లో రూ.24వేల కోట్లుగా ఉన్నాయి. సెబీ డేటా ప్రకారం 2016లో ఇప్పటి (జనవరి-సెప్టెంబర్) వరకు ఫండ్ మేనేజర్లు ఈక్విటీల్లో నికరంగా రూ.11,608 కోట్లు, డెట్ మార్కెట్లలో రూ.2.50 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
గత కొన్నేళ్లుగా బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో రాబడులు తగినంత లేకపోవడంతో పెట్టుబడులు ఈక్విటీ వైపు మళ్లుతున్నట్టు బజాజ్ కేపిటల్ గ్రూపు సీఈవో అనిల్ చోప్రా అభిప్రాయపడ్డారు. మ్యూచువల్ ఫండ్స్ పరంగా ఈ ఏడాది మరో రికార్డు కూడా చోటు చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే మ్యూచువల్ ఫండ్స్‌లో 11 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. మొత్తం మీద ఆగస్ట్ ముగింపునాటికి ఎంఎఫ్‌లలో ఇన్వెస్టర్ల ఖాతాలు 3.7 కోట్ల మార్కును అధిగమించాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.5,790 కోట్లు
ఈ సెప్టెంబర్ నెల తొలి పక్షం రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత్ క్యాపిటల్ మార్కెట్లో రూ. 5,790 కోట్లు నికరంగా పెట్టుబడి పెట్టారు. సెప్టెంబర్ 1-16 తేదీల మధ్య వారు ఈక్విటీల్లో రూ. 2,122 కోట్లు, రుణపత్రాల్లో(బాండ్స్) రూ. 3,668 కోట్ల నికర పెట్టుబడులు జరిపినట్లు సెబి గణాంకాలు తెలుపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్లో రూ. 42,972 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరపగా, డెట్ మార్కెట్ నుంచి రూ. 3,680 కోట్లు వెనక్కు తీసుకున్నారు.