ఈ- వ్యర్థాల నిర్వహణపై అవగాహన తప్పనిసరి
ఎఫ్ టాఫ్సీ ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ లుహారుకా
హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ, అవసరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి అని ఎఫ్‌టాఫ్సీ ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ లుహారుకా చెప్పారు. బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ‘సస్టెయినబుల్ వేస్ట్ మేనేజ్మెంట్’ అంశంపై మాట్లాడుతూ... దేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని, తయారీ సంఘాల అంచనాల ప్రకారం పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 25 శాతం చొప్పున పెరుగుతోందని చెప్పారు. ఇది ఇ-వ్యర్థాలు పెరగడానికి కూడా దోహదం చేస్తోందన్నారు. ‘‘ఎలక్ట్రానిక్ వేస్ట్‌లో బంగారం, రాగి, వెండి వంటి లోహాలుంటాయి. వీటిని వెలికి తీసి మళ్లీ ఉత్పత్తి చేయొచ్చు. చాలా కుటుం బాలకు ఈ-వేస్ట్‌ను ఏం చేయాలో తెలీక ఇళ్లలోనే ఉంచుకుంటున్నారు. సరికొత్త పద్ధతులలో ఇ-వ్యర్థాల్ని శుభ్రపరిస్తే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు’’ అని చెప్పారాయన. కార్యక్రమంలో సాంకేతిక నిపుణులు చంద్రశేఖర్, దేవులపల్లి కశ్యప్, శ్యామల, డాక్టర్ లక్ష్మీ మాట్లాడారు.