పంతులమ్మకు రాష్ట్రపతి పేరు తెలియదు!
పాట్నా: భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అట. బీహార్ గవర్నర్ ఏమో స్మృతీ ఇరానీనట. ఇంత తలతిక్క సమాధానాలు చెప్పింది ఏ నిరక్ష్యరాస్యుడో లేక చంటోడో కాదు. బీహార్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని. కనీస తెలివితేటలు ఉన్నవారెవరైనా ఈ ప్రశ్నలకు వెంటనే ఠకీమని సమాధానం చెబుతారు. కానీ టీచరమ్మకు మాత్రం తెలియకపోవడం విడ్డూరం. రాష్ట్రపతి పేరు కూడా తెలియని ఆ స్కూల్ టీచర్ ఇక పిల్లలకు ఏం చదువు చెబుతుంది?
పాఠశాల తనిఖీకి వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రశ్నలకు టీచర్ చెప్పిన చెప్పిన సమాధానాలివి. అంతే కలెక్టర్‌కు మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. మహిళా టీచర్ విద్యార్హతలు ఏమిటి? ఇంతకీ ఆమె ఏ ప్రామాణికం మీద ఉద్యోగం సంపాదించింది అన్న అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
బీహార్‌లోని గయా జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. మహిళా టీచర్ పేరు కుమారి అనిత. కలెక్టర్ సంజయ్ కుమార్ అగర్వాల్ జనతా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంత పాఠశాలకు వెళ్లారు. అనిత తన ఇంటికి సమీపంలో గల పాఠశాలకు బదిలీ చేయాల్సిందిగా కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్ ఆమెకు జనరల్ నాలెడ్జ్ ఏమాత్రం ఉందో తెలుసుకోవాలని పరీక్షించారు. అనిత మాత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బదులు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పేరు, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని గవర్నర్‌గా చెప్పి అడ్డంగా దొరికిపోయారు. బదిలీ కోసం మొరపెట్టుకుని తన అజ్ఞానంతో ఉద్యోగానికే ఎసరు తెచ్చుకుంది.