The failure of the government
-
అబ్బబ్బో.. ఏం సెప్తిరి!
సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘పదేళ్లలో పీఏబీఆర్ కుడికాల్వకు నీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే చెరువులను నీటితో నింపుతున్నాం. కుడికాల్వ పరిధిలోని చెరువులన్నిటికీ నీటిని సరఫరా చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం’ - ఈ నెల 24న మంత్రి పరిటాల సునీత వ్యాఖ్య. మంత్రి మాటలు చూస్తే.. పదేళ్లలో పీఏబీఆర్ కుడికాల్వకు నీరు సరఫరా కాలేదని, చెరువులను నీటితో నింపలేదని, కొత్తగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నీటి విడుదలకు శ్రీకారం చుట్టిందని అర్థమవుతుంది. అయితే వాస్తవ పరిస్థితి ‘నేతి బీరలో నెయ్యి’ చందమని స్పష్టమవుతోంది. పీఏబీఆర్ డ్యాం నుండి కుడికాల్వకు నీటి విడుదల కొన్నేళ్లుగా కొనసాగుతోంది. టీబీ డ్యాంలో నీటి లభ్యత 212 టీఎంసీలు ఉంటే హెచ్చెల్సీ ద్వారా 32 టీఎంసీలు జిల్లాకు కేటాయించారు. అయితే డ్యాంలో పూడికవల్ల నీటి లభ్యత 144 టీఎంసీల (నీటి నిల్వ 100.854 టీఎంసీలు)కు పడిపోయింది. దీంతో జిల్లాకు దామాషా పద్దతిలో 22.5 టీఎంసీలు కేటాయిస్తున్నారు. హెచ్చెల్సీ ద్వారా పీఏబీఆర్ డ్యాంకు ఏటా సగటున 2టీఎంసీల నీరు మాత్రమే అందుతోంది. ఇందులో ఒక టీఎంసీ నీటిని ఏటా కుడి కాల్వకు విడుదల చేస్తున్నారు. ఈ నీటితో ఏటా 5 నుంచి 19 చెరువులను(నీటి సరఫరానుబట్టి) నింపుతున్నారు. 1980 నుంచి ఈ తంతు కొనసాగుతోంది. 20 ఏళ్లలో నాలుగేళ్లు మాత్రమే కుడికాల్వకు నీరు విడుదల చేయలేదు. అదీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే. ఇది మినహా ఏటా కుడికాల్వతో పాటు చెరువులకు నీళ్లు అందుతున్నాయి. కానీ మంత్రి సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మాత్రం పదేళ్ల తర్వాత ఇప్పుడే కొత్తగా కుడి కాల్వకు నీళ్లు విడుదల చేశామని చెప్పడం గమనార్హం. చెరువుల కోసం ప్రత్యేక జీవో జారీ చేసిన వైఎస్ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికి తోడు కోటా మేరకు హెచ్చెల్సీ నీరు జిల్లాకు అందడంలో ఏటా జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్యను నివారించేందుకు కేసీకెనాల్ నుంచి 10 టీఎంసీల నీటిని పీఏబీఆర్ డ్యాంకు మళ్లిస్తూ 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవో జారీ చేశారు. ఇందులో 4.5 టీఎంసీలతో 49 చెరువులకు, తక్కిన వాటిని తాగునీటికి వినియోగించాలని సూచించారు. ఈ జీవో తర్వాత 2008, 09లో ఆశించిన మేరకు పీఏబీఆర్‌కు నీటి కేటాయింపులు జరిగాయి. వైఎస్ మృతి తర్వాత నీటి విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ నీటిని రప్పించేందుకు ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రయత్నించడం లేదు. ప్రస్తుతం హంద్రీ-నీవా నీరే దిక్కు హంద్రీ-నీవా పథకానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు పథకం నిర్మాణం అసాధ్యమని భావించి, దాన్ని విస్మరించారు. 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత జిల్లాలో తాగు, సాగునీటి సమస్యను నివారించేందుకు హంద్రీ-నీవా నిర్మాణానికి పూనుకున్నారు. చంద్రబాబు అసాధ్యం అన్నదాన్ని వైఎస్ సుసాధ్యం చేశారు. 2012 నుంచి హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు చేరుతున్నాయి. గతేడాది 3.5 టీఎంసీల నీళ్లు జిల్లాకు చేరితే.. 25 చెరువులను 30 శాతం నీటితో నింపారు. ఈ ఏడాది 10 టీఎంసీల నీళ్లు కోటాగా నిర్ణయించారు. ఇప్పటి దాకా 5.5 టీఎంసీల నీళ్లు జిల్లాకు చేరాయి. ఈ నీటిని పీఏబీఆర్‌కు మళ్లించి, వాటిని కుడికాల్వకు విడుదల చేశారు. మంత్రి సునీత, ఎమ్మెల్యే సూరి ధర్మవరం ఛానల్‌కు ఈ నెల 24న విడుదల చేసిన నీరు కూడా హంద్రీ-నీవా ద్వారా చేరిందే. అంటే వైఎస్ నిర్మించిన హంద్రీ-నీవా పుణ్యమా అని ఈ రోజు ధర్మవరం కాలువకు నీళ్లొచ్చాయనేది వాస్తవం. దీన్ని పక్కనపెట్టి తామేదో నీటిని జిల్లాకు రప్పించామని సునీత, సూరి గొప్పులు చెప్పుకోవడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. నిజానికి హంద్రీ-నీవా నీటికి ప్రత్యేకంగా జిల్లాలో 3.45 లక్షల ఆయకట్టు ఉంది. ఈ నీటితో చెరువులను నింపుకునేందుకు హక్కు లేదు. ఈ క్రమంలో తుంగభద్ర నీటితో పాటు కృష్ణా జలాలపై జిల్లాకు ‘హక్కు’ దక్కేలా, మిగులు జలాలను కాకుండా నికర జలాలను ఎత్తిపోసుకునేందుకు అధికార పార్టీ నేతలు పోరాడాలి. ఇది పట్టించుకోకుండా తాము చేయని పనిని చేశామని, మదేళ్లలో కుడికాల్వకు నీటి విడుదల జరగలేదని, ఇప్పుడు తామే నీటిని పారిస్తున్నారని చెప్పుకోవడం శోచనీయం. పదేళ్లలోపీఏబీఆర్ కుడికాల్వకు నీటి విడుదల ఇలా.. సంవత్సరం పరిమాణం (టీఎంసీలలో) 2005-06 2.228 2006-07 2.820 2007-08 2.234 2008-09 1.726 2009-10 1.863 2010-11 2.092 2011-12 0 2012-13 0.5 2013-14 3.5 2014-15 (సరఫరా జరుగుతోంది) -
గింజ కొంటే ఒట్టు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ సీజనులోనూ ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమ్మకాల సీజను ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. మరో పక్షం రోజుల్లో ఈ సీజను కూడా ముగుస్తుంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కేంద్రాల్లో అసలు కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. సుమారు 52 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. ఇన్నాళ్లు ఎన్నికల హడావుడిలో పడిన జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికలు ముగిసాక కూడా కొనుగోళ్లపై ఆశించిన మేరకు దృష్టి సారించడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. అన్నదాత అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న దళారులు ధరలో భారీగా కోత విధించి నిలువు దోపిడీ చేస్తున్నారు. 52 కేంద్రాల్లో కొనుగోళ్లు నిల్ రబీ కొనుగోళ్ల సీజనులో జిల్లాలో సుమారు 77,700 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా కొచ్చింది. ఇందులో 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కనీస మద్దతు ధర గ్రేడ్ -ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.1,345, సాధారణ రకానికి రూ.1,310 చొప్పున ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం 177 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 87 కేంద్రాలు, ఐటీడీఏ ఆధ్వర్యంలో 25 కేంద్రాలు, సహకార సంఘాల (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 61, డీసీఎంఎస్ ద్వారా నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఇప్పటివరకు కేవలం 125 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా 34,260 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగారు. ఏటా జూన్ మొదటి వారం వరకు సీజను ముగుస్తుంది. అంటే ఇంకా కేవలం పక్షం రోజులు మాత్రమే సీజను కొనసాగుతుంది. కానీ 52 కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు షురూ కాలేదంటే అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. జిల్లాలో రబీలో అత్యధికంగా నిర్మల్ వ్యవసాయ డివిజన్లో వరిని ఎక్కువగా సాగు చేస్తారు. సారంగాపూర్, దిలావర్పూర్, లోకేశ్వరం, లక్ష్మణచాంద, ఖనాపూర్, కడెం మండలాల్లో వరి సాగుచేస్తారు. అలాగే జన్నారం, దండేపల్లి, చెన్నూరు, జైపూర్, మంచిర్యాల మండలాల్లో వరి బాగా పండుతుంది. నిర్మల్ డివిజన్లో పంట ఆలస్యంగా చేతికొస్తున్నందునే కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఆనంద్‌రెడ్డి పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు కరువు పలు కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా టార్పాలిన్లు లే కపోవడంతో వర్షం పడితే చాలు అన్నదాతల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కొను గోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. అదేవిధంగా పలు కేం ద్రాల్లో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో లేవు. పైగా మాయిశ్చర్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో కూడా కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.