Fake affidavit
-
బీఈడీలో బ్లాక్ టీచింగ్.. చీటింగ్!
కర్నూలు సిటీ: ఛాత్రోపాధ్యాయుల బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్)లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై వేటు పడకుండా కర్నూలు డీఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)కోర్సు అభ్యసించే ఛాత్రోపాధ్యాయులను థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ సమయంలో బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్)కు పంపిస్తారు. ఇందుకు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇంటర్న్‌షిప్‌కు స్కూళ్లను కేటాయించాలని కోరుతారు. బీఈడీ కాలేజీల యాజమాన్యాలు సైతం ఈ మేరకు డీఈఓకు విన్నవించుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని కొన్ని బీఈడీ కాలేజీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 2020–22 బ్యాచ్‌కి చెందిన ఛాత్రోపాధ్యాయులు బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్) చేసినట్లు చూపించాయి. పలు ఫిర్యాదులు రావడంతో ఎన్ని కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇచ్చారో వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో డీఈఓకు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ లేఖ రాశారు. ఈ లేఖకు ఈ ఏడాది మార్చి 2వ తేదిన స్పందిస్తూ.. 11 కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేశారనే ఆరోపణలు వచ్చిన హెచ్‌ఎంలపై డీఈఓ చర్యలు తీసుకోకుండా 20 రోజుల్లోనే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు డీఈఓ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. అనుమతులకు అక్రమ వసూళ్లు! రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 2020–22 విద్యా సంవత్సరానికి కర్నూలు జిల్లాలో 22, నంద్యాల జిల్లాలో 20 బీఈడీ కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లాలో 11 కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, మరో 11 కాలేజీలకు ఇవ్వలేదని ఆర్యూ అధికారులకు డీఈఓ తెలిపారు. ఆ తరువాత కొద్ది రోజులకే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్లాక్ టీచింగ్ కోసం అనుమతులు ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి రూ.15 వేల నుంచి రూ. 25 వేల వరకు కర్నూలులో బుధవారపేటలోని ఓ హోటల్లో బేరం కుదుర్చుకుని వసూలు చేసినట్లు తెలుస్తోంది. మామూళ్లు వసూలు చేయడంలో డీఈఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తాన్ని వాటాలుగా పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేసిన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోకుండా కాలేజీల యాజమాన్యాలు డీఈఓపై ఒత్తిడి చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. చర్యలు తీసుకుంటాం 2020–22 విద్యా సంవత్సరానికి 22 కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇవ్వాలని రాయలసీమ యూనివర్సిటీ అధికారులు కోరారు. ఇందులో 11 కాలేజీలకు మాత్రమే మొదట ఇచ్చాం. మార్చి నెలలో 11 కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదని యూనివర్సిటీ అధికారులకు తెలిపిన మాట వాస్తవమే. అయితే యూనివర్సిటీ అధికారులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటే కొన్నింటికి అనుమతులు ఇచ్చాం. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేసిన హెచ్‌ఎంలపై విచారించి చర్యలు తీసుకుంటాం. – రంగారెడ్డి, డీఈఓ -
అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే..
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుందామంటే ఇకపై కుదరదు. విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించనున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఇలాంటి వాటిపై కేసుల వారీగా విచారణ చేపట్టాల్సిందిగా దర్యాప్తు సంస్థలకు పంపిస్తామని పేర్కొంది. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో భాగంగా అఫిడవిట్లలో తప్పుడు సమాచారంపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అఫిడవిట్ల బాగోతంపై ప్రజలు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 125ఏ కింద న్యాయస్థానాలకు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇకపై నేరుగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయొచ్చు. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిరూపణ అయితే సదరు అభ్యర్థులకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా.. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ విధించవచ్చని ఈసీ రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ శిక్ష సరిపోదని ఈసీ చెబుతోంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కనీసం రెండేళ్లు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణ చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదన న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. -
నరేంద్రమోడీ పేరుతో నకిలీ అఫిడవిట్
బీహార్ అనగానే నకిలీ పాస్ పోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు పుట్టినిల్లుగా చటుక్కున గుర్తుకు వస్తుంది. 1990లో ఎల్టీటీఈ చీఫ్ వి.ప్రభాకర్, 2009లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరిట బీహార్ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేశారు. అయితే ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వంతు వచ్చింది. ముజఫర్‌పూర్‌లోని బెర్హంపూర్‌లో తన తాత్కాలిక నివాసానికి విద్యుత్ కనెక్షన్ కావాలని స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు మోడీ పేరిట దరఖాస్తు అందింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఎంటి, ఇక్కడ విద్యుత్ కనెక్షన్ కావలంటూ వచ్చిన దరఖాస్తును అధికారులు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని పరిశీలించారు. దాంతో ఆ దరఖాస్తుతోపాటు అందిన అఫిడవిట్ నకిలీదని వారు గుర్తించారు. దీంతో విద్యుత్ కనెక్షన్ జారీని అధికారులు రద్దు చేశారు. అయితే ఆ దరఖాస్తులో మాత్రం గుజరాత్‌లోని మోడీ సొంత ఇంటి చిరునామా ఉందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. నరేంద్రమోడీ తండ్రి పేరు దామోదర దాస్ ముల్ చంద్ మోడీ, తల్లీ హీరాబెన్ పేరులు దరఖాస్తులో ఉన్నాయని అధికారులు చెప్పడం గమనార్హం.