బీఈడీలో బ్లాక్‌ టీచింగ్‌.. చీటింగ్‌! | Fake Internship letters issued by authorities in Kurnool | Sakshi
Sakshi News home page

బీఈడీలో బ్లాక్‌ టీచింగ్‌.. చీటింగ్‌!

Published Thu, Jun 29 2023 1:42 AM | Last Updated on Thu, Jun 29 2023 1:26 PM

జిల్లా విద్యాశాఖ కార్యాలయం  - Sakshi

జిల్లా విద్యాశాఖ కార్యాలయం

కర్నూలు సిటీ: ఛాత్రోపాధ్యాయుల బ్లాక్‌ టీచింగ్‌(ఇంటర్న్‌షిప్‌)లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై వేటు పడకుండా కర్నూలు డీఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ)కోర్సు అభ్యసించే ఛాత్రోపాధ్యాయులను థర్డ్‌, ఫోర్త్‌ సెమిస్టర్‌ సమయంలో బ్లాక్‌ టీచింగ్‌(ఇంటర్న్‌షిప్‌)కు పంపిస్తారు. ఇందుకు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇంటర్న్‌షిప్‌కు స్కూళ్లను కేటాయించాలని కోరుతారు. బీఈడీ కాలేజీల యాజమాన్యాలు సైతం ఈ మేరకు డీఈఓకు విన్నవించుకోవాల్సి ఉంటుంది.

అయితే జిల్లాలోని కొన్ని బీఈడీ కాలేజీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 2020–22 బ్యాచ్‌కి చెందిన ఛాత్రోపాధ్యాయులు బ్లాక్‌ టీచింగ్‌(ఇంటర్న్‌షిప్‌) చేసినట్లు చూపించాయి. పలు ఫిర్యాదులు రావడంతో ఎన్ని కాలేజీలకు బ్లాక్‌ టీచింగ్‌కి అనుమతులు ఇచ్చారో వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో డీఈఓకు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ లేఖ రాశారు.

ఈ లేఖకు ఈ ఏడాది మార్చి 2వ తేదిన స్పందిస్తూ.. 11 కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్‌ టీచింగ్‌ చేసినట్లు సర్టిఫై చేశారనే ఆరోపణలు వచ్చిన హెచ్‌ఎంలపై డీఈఓ చర్యలు తీసుకోకుండా 20 రోజుల్లోనే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు డీఈఓ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం.

అనుమతులకు అక్రమ వసూళ్లు!

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 2020–22 విద్యా సంవత్సరానికి కర్నూలు జిల్లాలో 22, నంద్యాల జిల్లాలో 20 బీఈడీ కాలేజీలకు బ్లాక్‌ టీచింగ్‌కి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లాలో 11 కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, మరో 11 కాలేజీలకు ఇవ్వలేదని ఆర్‌యూ అధికారులకు డీఈఓ తెలిపారు. ఆ తరువాత కొద్ది రోజులకే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం.

ఇదిలా ఉండగా 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్లాక్‌ టీచింగ్‌ కోసం అనుమతులు ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి రూ.15 వేల నుంచి రూ. 25 వేల వరకు కర్నూలులో బుధవారపేటలోని ఓ హోటల్‌లో బేరం కుదుర్చుకుని వసూలు చేసినట్లు తెలుస్తోంది. మామూళ్లు వసూలు చేయడంలో డీఈఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

వసూలు చేసిన మొత్తాన్ని వాటాలుగా పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్‌ టీచింగ్‌ చేసినట్లు సర్టిఫై చేసిన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోకుండా కాలేజీల యాజమాన్యాలు డీఈఓపై ఒత్తిడి చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం

2020–22 విద్యా సంవత్సరానికి 22 కాలేజీలకు బ్లాక్‌ టీచింగ్‌కి అనుమతులు ఇవ్వాలని రాయలసీమ యూనివర్సిటీ అధికారులు కోరారు. ఇందులో 11 కాలేజీలకు మాత్రమే మొదట ఇచ్చాం. మార్చి నెలలో 11 కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదని యూనివర్సిటీ అధికారులకు తెలిపిన మాట వాస్తవమే. అయితే యూనివర్సిటీ అధికారులు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటే కొన్నింటికి అనుమతులు ఇచ్చాం. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్‌ టీచింగ్‌ చేసినట్లు సర్టిఫై చేసిన హెచ్‌ఎంలపై విచారించి చర్యలు తీసుకుంటాం.

– రంగారెడ్డి, డీఈఓ

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement