బీహార్ అనగానే నకిలీ పాస్ పోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్లు పుట్టినిల్లుగా చటుక్కున గుర్తుకు వస్తుంది. 1990లో ఎల్టీటీఈ చీఫ్ వి.ప్రభాకర్, 2009లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరిట బీహార్ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేశారు. అయితే ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వంతు వచ్చింది. ముజఫర్పూర్లోని బెర్హంపూర్లో తన తాత్కాలిక నివాసానికి విద్యుత్ కనెక్షన్ కావాలని స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు మోడీ పేరిట దరఖాస్తు అందింది.
గుజరాత్ ముఖ్యమంత్రి ఎంటి, ఇక్కడ విద్యుత్ కనెక్షన్ కావలంటూ వచ్చిన దరఖాస్తును అధికారులు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని పరిశీలించారు. దాంతో ఆ దరఖాస్తుతోపాటు అందిన అఫిడవిట్ నకిలీదని వారు గుర్తించారు. దీంతో విద్యుత్ కనెక్షన్ జారీని అధికారులు రద్దు చేశారు. అయితే ఆ దరఖాస్తులో మాత్రం గుజరాత్లోని మోడీ సొంత ఇంటి చిరునామా ఉందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. నరేంద్రమోడీ తండ్రి పేరు దామోదర దాస్ ముల్ చంద్ మోడీ, తల్లీ హీరాబెన్ పేరులు దరఖాస్తులో ఉన్నాయని అధికారులు చెప్పడం గమనార్హం.