రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి: నరేంద్ర మోడీ
ఝాన్సీ (యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థలు సంప్రదించాయంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ నిఘా సంస్థలతో సంప్రదింపులు జరిపిన అల్లర్ల బాధితుల పేర్లను రాహుల్ వెల్లడించాలని లేదా ముస్లింలను బహిరంగంగా కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. శుక్రవారం యూపీలోని ఝాన్సీలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మీ పార్టీ పాలనలోని ఢిల్లీకి పొరుగునున్న యూపీలో ఐఎస్‌ఐ యువతను స్వేచ్ఛగా ఎలా ప్రభావితం చేయగలుగుతోంది? ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నట్లు? ఐఎస్‌ఐ ఏం చేస్తోందో కేవలం వార్తలను వెల్లడించే వార్తాసంస్థలా ప్రవర్తిస్తారా? దీన్ని అడ్డుకునేం దుకు చర్యలు తీసుకోరా?’’ అని కాంగ్రెస్‌ను, యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఖజానాకు కాపలాదారుగా ఉంటా: యూపీఏ ప్రభుత్వ పాలన కుంభకోణాలమయంగా మారిందని మోడీ దుయ్యబట్టారు. అవినీతిపై కాంగ్రెస్ నోరుమెదపడంలేదని, ధరల పెరుగుదలను నియంత్రించేందుకు, మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రయత్నించట్లేదని విమర్శించారు. దీనిపై యూపీఏ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ‘‘అందుకే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి. దేశాన్ని ఆ పార్టీ 60 ఏళ్లు ఏలేందుకు అవకాశం ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో 60 నెలలు మేము (బీజేపీ) దేశాన్ని ఏలే అవకాశం ఇవ్వండి. నేను ప్రధానిగా కాకుండా ఢిల్లీలో ప్రజల కాపలాదారుగా (చౌకీదార్) పనిచేయాలనుకుంటున్నా. దేశ ఖజానాపై ఎవరూ కన్నేయకుండా, ప్రజాధనాన్ని ఎవరూ లూటీ చేయకుండా కాపలాదారుగా కూర్చుంటానని హామీ ఇస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.
బుందేల్‌ఖండ్‌కు ప్యాకేజీ ఎస్పీకి దానమే
ఉత్తరప్రదేశ్‌లో వెనకబడిన ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌కు రాహుల్‌గాంధీ సూచన మేరకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వాస్తవానికి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి దానమని మోడీ వ్యాఖ్యానించారు. ‘‘వ్యతిరేకుల నోరునొక్కేందుకు ప్యాకేజీలు ఇవ్వడంలో కాంగ్రెస్ నేతలు సిద్ధహస్తులు. కేంద్రం ఈ ప్యాకేజీ మీ (ప్రజలు) కోసం ఇవ్వలేదు. యూపీ నేతలు నోరెత్తకుండా ఉండేందుకే ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్యాకేజీని పంచుకున్నాయి’’ అని మోడీ ఆరోపించారు.
దుమ్మెత్తిపోసిన విపక్షాలు: రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీతోపాటు ఇతర విపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి. రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని దుయ్యబట్టాయి. ముస్లింలకు ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, సీపీఐ డిమాండ్ చేశాయి. ఈ వ్యాఖ్యలు ముస్లింల దేశభక్తిని శంకించేలా, వారిపై ఇతర వర్గాల ప్రజల్లో ద్వేషం పెంచేవిగా ఉన్నాయని విమర్శించాయి.
రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర హోంమంత్రి షిండే సమర్థిస్తారో లేక తప్పుబడతారో చెప్పాలని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఏ అధికార హోదాలో ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇటువంటి వివరాలను ఆయనకు వెల్లడించారని బీజేపీ మరో ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. దేశంలోని ముస్లింలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని ఎస్పీ నేత ఆజం ఖాన్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన చెప్పకుంటే ఆయన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా క్షమాపణ చెప్పాలన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలతో ముస్లింలను అవమానపరిచారని జేడీయూ విమర్శించింది. రాహుల్ వ్యాఖ్యలు ముస్లింలపై ఇతర వర్గాల్లో ద్వేషం కలిగించేవిగా ఉన్నాయని సీపీఐ నేత అతుల్ అంజన్ ఆరోపించారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని ప్రముఖ షియా మతపెద్ద మౌలానా సైఫ్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. ముజఫర్‌నగర్ బాధితులను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోందన్న నిఘా సమాచారమేదీ తమకు ఇంటెలిజెన్స్ నుంచి అందలేదని ఉత్తరప్రదేశ్ హోంకార్యదర్శి తెలిపారు.
సిక్కుల ఊచకోతపై కోపం రాలేదా?
తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తనను కోపానికి గురిచేసిందన్న రాహుల్ వ్యాఖ్యలపై మోడీ తన ప్రసంగంలో పలు సందేహాలు లేవనెత్తారు. ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేతలు వేలాది మంది సిక్కులను సజీవదహనం చేయడం... ఈ కేసుల్లో ఒక్కరికీ శిక్ష పడకపోవడం కోపం తెప్పించిందో లేదో చెప్పాలని ప్రశ్నించారు. ‘ఇందిర హత్యపై కాంగ్రెస్ నేతలంతా ఆగ్రహానికి గురవడం నిజమేనా? ఆ కోపంలో నీ పార్టీ నేతలు వేలాది మంది సిక్కులను సజీవదహనం చేయడం, అయి నా ఒక్కరికీ శిక్ష పడకపోవడం నిజమేనా? నీ నానమ్మ మృతిపై నువ్వు ఆగ్రహానికి గురికావడాన్ని అర్థంచేసుకుంటా. కానీ వేలాదిమంది సిక్కుల మృతి పై నువ్వు బాధపడ్డావా? దీనిపై నీకు కోపం వచ్చిందా’ అని మోడీ ప్రశ్నించారు. తాను కూడా హత్యకు గురవ్వచ్చన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ కలకాలం చల్లగా ఉండేలా చూడమని బీజేపీ ప్రార్థిస్తుందని చెబుతూ.. ఉద్వేగభరితమైన అంశాలను ప్రస్తావించడం ద్వారా రాహుల్ ప్రజల ఉద్వేగాలను దోచుకునే యత్నం చేస్తున్నారన్నారు.
రాహుల్‌కు ముప్పు శాశ్వతం: షిండే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణానికి ముప్పు శాశ్వతమని...అందువల్ల ఆయన భద్రత కోసం ఎస్పీజీ సిబ్బందిని మోహరించడంతోపాటు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తన తండ్రి రాజీవ్‌గాంధీలాగానే తాను కూడా హత్యకు గురి కావచ్చంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు షిండే ఈ విధంగా బదులిచ్చారు.