న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్షన్ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుందామంటే ఇకపై కుదరదు. విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించనున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఇలాంటి వాటిపై కేసుల వారీగా విచారణ చేపట్టాల్సిందిగా దర్యాప్తు సంస్థలకు పంపిస్తామని పేర్కొంది. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో భాగంగా అఫిడవిట్లలో తప్పుడు సమాచారంపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
అఫిడవిట్ల బాగోతంపై ప్రజలు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 125ఏ కింద న్యాయస్థానాలకు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇకపై నేరుగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయొచ్చు. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిరూపణ అయితే సదరు అభ్యర్థులకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా.. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ విధించవచ్చని ఈసీ రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ శిక్ష సరిపోదని ఈసీ చెబుతోంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కనీసం రెండేళ్లు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణ చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదన న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment