Fake alcohol Case
-
జిల్లాలో జోరుగా నకిలీ మద్యం దందా
► ఆసిఫాబాద్‌కు చెందిన రాజేష్ మూడు రోజుల కిందట గుండి రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్వార్టర్ మద్యం తీసుకున్నాడు. ఇంటికెళ్లి బాటిల్ మూత తీయగానే స్పిరిట్ వాసన గుప్పుమంది. తాజాగా తయారైన మద్యం అనుకుని గ్లాసులో పోసుకుని తాగగా.. నిజంగా స్పిరిట్ తాగిన భావన. నిత్యం తాగే బ్రాండ్ ఇలా ఉందేమని.. మరుసటి రోజు బ్రాందీ షాపుకెళ్లి ఫిర్యాదు చేశాడు. సాయంత్రానికి షాపు లైసెన్సుదారుడు రాజేష్‌కి ఫోన్ చేసి ‘ఏ బ్రాండు తీసుకున్నావు? స్పిరిట్ వాసన వచ్చిందా? నేను చెక్ చేస్తాను.. ఎవరితో చెప్పకు’ అని కోరాడు. ► శ్రీధర్ అనే మరో వ్యక్తి రెండు రోజుల కిందట ఖరీదైన విస్కీ బ్రాండు మద్యం బాటిళ్లు కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి పార్టీలో మద్యం బాటిళ్లను ఓపెన్ చేసి గ్లాసుల్లో పెగ్‌లు పోయగా.. వాటిని తాగిన స్నేహితులందరూ ఇది నకిలీ మద్యం.. స్పిరిట్ వాసన వస్తోందని అనడంతో శ్రీధర్ కంగుతిన్నాడు. ఆసిఫాబాద్‌లోని చిర్రకుంట వెళ్లే రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణంలో శ్రీధర్ ఈ బాటిళ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. జిల్లావ్యాప్తంగా ఈ రకం మద్యం విక్రయించని వైన్స్ లేదంటే అతిశయోక్తి కాదు. నిబంధనలకు విరుద్ధంగా అనేక మద్యం షాపుల్లోనూ లభి స్తోంది. నవంబర్ తర్వాత పాత వైన్స్ షాపుల స్థానంలో కొత్తవి రానుండడంతో పాత షాపుల య జమానులు కొందరు నకిలీ మద్యం దందాను ప్రో త్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉ న్నతాధికారులు, ఆబ్కారీ ఉన్నతాధికారులకు మా మూళ్లు ఇస్తున్నామనే భావనతో.. చివరి రోజుల్లోనైనా కొంత లాభాలు దక్కించుకునేందుకు లైసెన్సుదారులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో తనిఖీలు గాలికొదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్‌నగర్ అడ్డాగా.. జిల్లాలో 32 మద్యం దుకాణాలు, 3 బార్లు ఉన్నా యి. ఏటా రూ.250 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. వీటికి అనుసంధానంగా మండల కేంద్రాల్లో ప దుల సంఖ్యలో బెల్టు షాపులు ఉండగా.. జిల్లావ్యాప్తంగా వాటి సంఖ్య 800 వరకు ఉంటుంది. నవంబర్‌తో ప్రస్తుత మద్యం షాపులకు గడువు పూర్తవుతోంది. డిసెంబర్ నుంచి కొత్తగా మద్యం దుకా ణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్న లైసెన్సుదారులు ఏర్పాటు చేయనున్నారు. ఇదే అదనుగా ప్రస్తుతం ఉన్న లైసెన్సుదారులు తమ మద్యం దు కాణాల్లో నకిలీ మద్యం విక్రయాలకు తెరలేపినట్లు సమాచారం. ముఖ్యంగా కాగజ్‌నగర్ అడ్డాగా నకిలీ మద్యం తయారవుతోంది. అసలు బాటిళ్ల మా దిరిగా ఉండే నకిలీ బ్రాండ్లను షాపుల్లో ఉంచి మందుబాబులకు అంటగడుతూ రూ.లక్షలు అర్జిస్తున్నారు. ఒకప్పుడు చీప్ లిక్కర్లలో కల్తీ జరిగేది. కానీ ప్రస్తుతం ఖరీదైన బ్రాండ్లనూ నకిలీగా తయారు చేయడం విశేషం. ఇదే విషయమై జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారి జ్యోతికిరణ్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. జోరుగా దందా.. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ గడువు ఈ ఏడాది నవంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఇటీవలే కొత్త దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్న మద్యం లైసెన్సుదారులు అక్రమార్జనకు అడ్డదారులు వెతుక్కున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బీరు, ఇతర ప్రీమియం మద్యం బాటిళ్లపై ధర పెంచి విక్రయించి సొమ్ము చేసుకున్న సంగతి విధితమే. ఇప్పుడంతకు మించి అర్జించాలంటే నకిలీ మద్యం ఒక్కటే మార్గమని భావించి అసలు బ్రాండ్ల స్థానంలో నకిలీ మద్యం బ్రాండ్ బాటిళ్లను ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో కేవలం కొన్ని దుకాణాల్లో మాత్రం నకిలీ మద్యం విక్రయాలు జరగడం లేదని తెలుస్తోంది. స్థానికుల్లో చాలా మంది మంచిర్యాల, పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లి మద్యం బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారంటే జిల్లాలో నకిలీ మద్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. చాటుగా కాకుండా ఏకంగా మద్యం దుకాణాల్లోనే నకిలీ మద్యం బాటిళ్లను ఉంచి విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. -
61కి చేరుకున్న నకిలీ మద్యం మృతులు
హరిద్వార్/సహరాన్పూర్: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ మద్యం కారణంగా చనిపోయిన వారి సంఖ్య శనివారంనాటికి 61కు చేరుకుంది. గురువారం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా బాలూపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ జిల్లాకు చెందిన వారు హాజరయ్యారు. ఆ సందర్భంగా అందరికీ మద్యం సరఫరా చేశారు. అది తాగిన చాలామంది మరుసటి రోజుకల్లా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతోపాటు చనిపోయారు. -
కల్తీ కిక్కు
సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం : సురేష్... పద్దెనిమిదేళ్లు వయసు లేదు. కానీ మద్యానికి బానిసయ్యాడు. భామిని మండలంలో పసుకుడి గ్రామానికి చెందిన అతన్ని గత నెలలో కుటుంబసభ్యులు మందలించారు. ఇటు మద్యం మానలేక, అటు కుటుంబానికి ముఖం చూపించలేక మనస్తాపంతో క్రిమిసంహారక మందు తాగేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అపస్మారకస్థితికి చేరుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. ఇలా అతనొక్కడే కాదు మద్యానికి బానిసై ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకుంటున్న సామాన్యులు లక్షల్లోనే ఉన్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వారి బలహీనతే అక్రమార్కులకు వరంగా మారింది. మద్యం తాగడమే ఆరోగ్యానికి ప్రమాదం అంటే... ఆ మద్యాన్ని చీప్‌లిక్కర్, నీళ్లతో కల్తీ చేసేసి మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. నిరోధించాల్సిన ఎక్సైజ్ శాఖ ఆలస్యంగా మేల్కొని దాడులు చేస్తున్నా... కల్తీ మద్యానికి అడ్డుకట్ట పడట్లేదు. కారకులైనవారికి అరెస్టు చేస్తున్నా చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని కొద్దిరోజుల్లోనే బయటకు వచ్చేస్తున్నారు. మళ్లీ యథావిధిగా కల్తీ మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ కల్తీ మద్యానికి బెల్ట్షాప్లే కేంద్రాలనుకుంటే ఇప్పుడా ఆ వ్యవహారానికి లైసెన్స్డ్ వైన్షాపులూ అతీతం కాదనే విషయం తేలిపోయింది. గత నాలుగు నెలల్లోనే 13 షాపుల్లో ఈ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటే పరిస్థితి ఊహించవచ్చు. వీధివీధినా కల్తీ మద్యం... చాపకింద నీరులా కల్తీ మద్యం పట్టణాల్లో, గ్రామాల్లో విస్తరించింది. దీనికి లైసెన్స్డ్ మద్యం దుకాణాలే కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడి నుంచి బెల్ట్‌షాపులకు నిరాటంకంగా పంపిణీ అవుతున్నాయి. ఈ కల్తీ వ్యవహారం కాసుల వర్షం కురిపిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా ముఠాలు తయారయ్యాయి. ఇవి మూడు గ్రూపులుగా పనిచేస్తున్నాయి. బ్రాండెడ్ మద్యం ఖాళీ సీసాలు, సీసా మూతలు, లేబుళ్లు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తయారుచేయించి జిల్లాకు గుట్టుచప్పుడు గాకుండా తరలించడం కొన్ని ముఠాల పని. శ్రీకాకుళం, వీరఘట్టం, కోటబొమ్మాళి తదితర ప్రాంతాల్లో భారీగా అవి బయటపడిన సంగతి తెలిసిందే. ఇక రెండో రకం ముఠాల పని చీప్‌లిక్కర్ సేకరణ. ఇది బాటిల్ రూ.50 ఉంటుంది. ఇక బ్రాండెడ్ మిక్సింగ్ మూడో తరహా ముఠాల పని. మందుబాబులకు ఏమాత్రం అనుమానం రాకుండా బ్రాండెడ్ బాటిళ్లలోకి చీప్ లిక్కర్ మిక్సింగ్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించిన ముఠాసభ్యులు ఉన్నారంటే ఆశ్చర్యమే మరి. దీపం ఉన్నప్పుడే.... ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం, టాస్క్ఫో ర్స్, స్టేట్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు బోర్డర్ మొబైల్ పార్టీలు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నా కల్తీ మద్యం వరదకు అడ్డుకట్ట పడట్లేదు. జిల్లాలో ఏదొక చోట వెలుగుచూస్తూనే ఉంది. జిల్లాలో 239 మద్యం దుకాణాలు, 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిద్వారా మద్యం అమ్మకాలు నెలకు సగటున రూ.60 కోట్ల వరకూ జరుగుతున్నాయి. మరోవైపు దుకాణానికి నెలనెలా రూ.50 వేల చొప్పున అధికార పార్టీలో ఓ కీలక నాయకుడి అనుచరులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో వైన్‌షాపుల నిర్వాహకులు కొందరు బ్రాండెడ్ మిక్సింగ్‌కు తెగిస్తున్నారు. యాప్‌తోనైనా ఆగేనా? వాస్తవానికి కల్తీ మద్యం వ్యవహారాలను అరికట్టేందుకు ఎక్సైజ్ సిబ్బంది తరచుగా వైన్‌షాపుల్లో, గ్రామాల్లోనూ అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాలి. వైన్‌షాపుల్లో మద్యం శాంపిళ్లు తీసి ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించాలి. మరోవైపు నకిలీమూతల తయారీదారులు, పంపిణీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడే మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్సైజ్ శాఖలో ఇటీవల వరకూ అలాంటి దూకుడు కనిపించలేదు. అక్రమార్కులకు, మద్యం సిండికేట్లకు అధికార పార్టీ నాయకుల అండదండలు, భారీ ఎత్తున మామూళ్ల వ్యవహారాలే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 3వ తేదీన సాక్షాత్తూ జిల్లా ఎక్సైజ్ శాఖ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఇంట్లోనే ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.4.50 లక్షల భారీ మొత్తం బయటపడటం దీనికొక తార్కాణంగా చెప్పవచ్చు. బెల్ట్‌షాపులు, కల్తీ మద్యం వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కె.వెంకటేశ్వరరావు ‘ఎస్వోపీ’ యాప్‌ను ప్రారంభించారు. ఏడు దశల్లో 90 అంశాలతో కూడిన ఈ యాప్‌లో ప్రజలను భాగస్వామ్యం చేయడం, అధికారుల తీరుతెన్నులను పర్యవేక్షించడం, కేసుల పురోగతి పరిశీలన, నిందితులపై నిఘా తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ యాప్ ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి మరి! కల్తీ మద్యం వరదకు నిదర్శనాలు... 28.01.2018: వీరఘట్టంలో జనాతా వైన్స్ పేరుతో నిర్వహిస్తోన్న దుకాణంలో కల్తీ మద్యం వెలుగుచూసింది. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలను పోలిన నకిలీ మూతలను హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తయారీ చేయించి తీసుకొచ్చినట్లు ఆధారాలు దొరికాయి. 01.02.2018: ఆమదాలవలస పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో బెల్ట్‌షాప్‌పై టాస్క్‌ఫోర్స్ అధి కారులు చేశారు. అక్కడ దొరికిన మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్ నంబర్లు ఆధారంగా ఆరా తీశా రు. ఆ సరుకు సమీపంలోని రవితేజ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి వచ్చినట్లు తేలింది. అం తేకాదు ల్యాబ్‌లో తనిఖీ చేయిస్తే కల్తీ మద్యం అని రూఢి అయ్యింది. దీంతో ఎకై్సజ్, టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ షాప్‌ను సీజ్ చేశారు. 24.03.2018: సంతకవిటిలోని తేజశ్విని వైన్‌షాపుపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు జరిపిన దాడిలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. బ్రాండెడ్ మద్యం సీసాల మూతలు తొలగించి కొంత మద్యం బయటకు తీసేసి, ఆ మేరకు చీప్‌లిక్కర్, నీరు మిక్సింగ్ చేసేస్తున్నారు. ఆ సీసాలకు నకిలీమూతలతో సీల్ వేసేస్తున్నారు. 07.04.2018: శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం గ్రామంలో ఓ వైన్‌షాప్ కేంద్రంగా బ్రాండ్ మిక్సింగ్ యూనిట్నే నడుపుతున్న వ్యవహారం వెలు గుచూసింది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం నగరంలోనే గాకుండా గార, నరసన్నపేట, పోలాకి, జలుమూరు తదితర 20 మండలాలకు ఇక్కడి నుంచే కల్తీ సరుకు సరఫరా అవుతుందంటే పరిస్థితి ఊహించవచ్చు. ఈ కేసులో 14 మందిని అరెస్టు చేసి న ఎక్సైజ్ అధికారులు ఆరు బైక్‌లు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద కల్తీ మద్యం 832 సీసాలు, అలాగే 176 బ్రాండెడ్ ఖాళీ బాటిళ్లు దొరికాయి. 03.05.2018: మందస మండలంలో హరిపురం–బాలిగాం జంక్షన్లో ఉన్న తనీష్ వైన్‌షాప్‌లో భారీగా కల్తీ మద్యం బయటపడింది. ముగ్గురు నింది తులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. -
‘నెట్’వర్క్ లేదు..!
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రధాన నిందితుడిగా ఉన్న ‘అప్పు’ గత ఏడాది నకిలీ మద్యం కేసులో సీఐడీ పోలీసులకు చిక్కాడు. అతడే ఎర్రచందనం స్మగ్లింగ్‌లోనూ నిందితుడు అనే విషయం వారికి తెలియదు. తీరా అప్పు నకిలీ మద్యం కేసులో బెయిల్‌పై బయటపడేందుకు ప్రయత్నిస్తుండగా నిఘా విభాగం.. అతడు ‘ఎర్ర‘ కేసుల్లోనూ నిందితుడని తేల్చడంతో ఆ కేసుల్లోనూ అప్పును అరెస్టు చేశారు. లేదంటే అతడు జైలు నుంచి బయటకు వెళ్లి తన నేర చరిత్రను కొనసాగించే వాడే. ఇలాంటి సమాచార మార్పిడి లోపాన్ని నివారించేందుకు దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ టెక్నాలజీ నెట్వర్క్ అండ్ సిస్టం)ను కేంద్రం 2011 లో ఏర్పాటు చేసింది. మొదటి దశలో భాగంగా హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేసింది. ఈ విధానాన్ని 2013 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా అన్ని స్టేషన్లకు కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని అందజేశారు. అయితే ప్రభుత్వాల అలసత్వంతో నేటికీ ఈ విధానం కార్యరూపం దాల్చలేదు. దీంతో సమాచార మార్పిడి వ్యవస్థ సరిగ్గా లేక పోలీసుల ముందే నేరస్తులు దర్జాగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీటీఎన్‌ఎస్‌ను వెంటనే అమలు చేసేందుకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం కోసం బుధవారం (నేడు) అన్ని రాష్ట్రాల సీఎస్, డీజీలతో సమీక్ష నిర్వహించనున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటల్ టెక్నాలజీని వేగవంతమైన నేర పరిశోధనకు ఉపయోగించుకోవాలని ప్రధాని భావిస్తున్నారు. సీసీటీఎన్ఎస్ పనితీరు ఇలా.. ఒక నేరం కింద పట్టుబడిన వ్యక్తికి సంబంధించి ప్రాథమిక సమాచారంతో పాటు వారి వేలిముద్రలు తదితర వాటిని పోలీసులు నమోదు చేస్తారు. వాటిని సీసీటీఎన్ఎస్కు అనుసంధానం చేస్తారు. దీంతో అతని సమాచారం దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లకు చేరుతుంది. ఇక ఆ వ్యక్తి ఇతర ప్రాంతాల్లో మరో నేరం చేస్తూ పట్టుబడితే వేలిముద్రల ఆధారంగా అతడి గత చరిత్ర బయటపడుతుంది. అడ్డంకిగా మారుతున్న నెట్వర్క్.. సీసీటీఎన్ఎస్ అమలుకు నెట్వర్కింగ్ అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికీ కొన్ని పోలీస్స్టేషన్లలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. సిబ్బంది కూడా లేరు... ఉన్న చోట శిక్షణ ఇవ్వడం లేదు. వీటన్నింటిని అధిగమించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీసీటీఎన్ఎస్ వ్యవస్థ అమలు ముందుకు సాగడం లేదు.