కల్తీ కిక్కు | Fake alcohol Case | Sakshi
Sakshi News home page

కల్తీ కిక్కు

Published Sat, May 5 2018 1:53 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Fake alcohol Case - Sakshi

సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం : సురేష్‌... పద్దెనిమిదేళ్లు వయసు లేదు. కానీ మద్యానికి బానిసయ్యాడు. భామిని మండలంలో పసుకుడి గ్రామానికి చెందిన అతన్ని గత నెలలో కుటుంబసభ్యులు మందలించారు. ఇటు మద్యం మానలేక, అటు కుటుంబానికి ముఖం చూపించలేక మనస్తాపంతో క్రిమిసంహారక మందు తాగేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అపస్మారకస్థితికి చేరుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. 

ఇలా అతనొక్కడే కాదు మద్యానికి బానిసై ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకుంటున్న సామాన్యులు లక్షల్లోనే ఉన్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వారి బలహీనతే అక్రమార్కులకు వరంగా మారింది. మద్యం తాగడమే ఆరోగ్యానికి ప్రమాదం అంటే... ఆ మద్యాన్ని చీప్‌లిక్కర్, నీళ్లతో కల్తీ చేసేసి మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. నిరోధించాల్సిన ఎక్సైజ్‌ శాఖ ఆలస్యంగా మేల్కొని దాడులు చేస్తున్నా... కల్తీ మద్యానికి అడ్డుకట్ట పడట్లేదు.

కారకులైనవారికి అరెస్టు చేస్తున్నా చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని కొద్దిరోజుల్లోనే బయటకు వచ్చేస్తున్నారు. మళ్లీ యథావిధిగా కల్తీ మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ కల్తీ మద్యానికి బెల్ట్‌షాప్‌లే కేంద్రాలనుకుంటే ఇప్పుడా ఆ వ్యవహారానికి లైసెన్స్‌డ్‌ వైన్‌షాపులూ అతీతం కాదనే విషయం తేలిపోయింది. గత నాలుగు నెలల్లోనే 13 షాపుల్లో ఈ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటే పరిస్థితి ఊహించవచ్చు. 

వీధివీధినా కల్తీ మద్యం...

చాపకింద నీరులా కల్తీ మద్యం పట్టణాల్లో, గ్రామాల్లో విస్తరించింది. దీనికి లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలే కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడి నుంచి బెల్ట్‌షాపులకు నిరాటంకంగా పంపిణీ అవుతున్నాయి. ఈ కల్తీ వ్యవహారం కాసుల వర్షం కురిపిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా ముఠాలు తయారయ్యాయి. ఇవి మూడు గ్రూపులుగా పనిచేస్తున్నాయి. బ్రాండెడ్‌ మద్యం ఖాళీ సీసాలు, సీసా మూతలు, లేబుళ్లు హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో తయారుచేయించి జిల్లాకు గుట్టుచప్పుడు గాకుండా తరలించడం కొన్ని ముఠాల పని.

శ్రీకాకుళం, వీరఘట్టం, కోటబొమ్మాళి తదితర ప్రాంతాల్లో భారీగా అవి బయటపడిన సంగతి తెలిసిందే. ఇక రెండో రకం ముఠాల పని చీప్‌లిక్కర్‌ సేకరణ. ఇది బాటిల్‌ రూ.50 ఉంటుంది. ఇక బ్రాండెడ్‌ మిక్సింగ్‌ మూడో తరహా ముఠాల పని. మందుబాబులకు ఏమాత్రం అనుమానం రాకుండా బ్రాండెడ్‌ బాటిళ్లలోకి చీప్‌ లిక్కర్‌ మిక్సింగ్‌ చేయడంలో ప్రావీణ్యం సంపాదించిన ముఠాసభ్యులు ఉన్నారంటే ఆశ్చర్యమే మరి. 

దీపం ఉన్నప్పుడే....

ఎక్సైజ్‌ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, టాస్క్‌ఫో ర్స్, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌తో పాటు బోర్డర్‌ మొబైల్‌ పార్టీలు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నా కల్తీ మద్యం వరదకు అడ్డుకట్ట పడట్లేదు. జిల్లాలో ఏదొక చోట వెలుగుచూస్తూనే ఉంది. జిల్లాలో 239 మద్యం దుకాణాలు, 17 బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు ఉన్నాయి. వీటిద్వారా మద్యం అమ్మకాలు నెలకు సగటున రూ.60 కోట్ల వరకూ జరుగుతున్నాయి.

మరోవైపు దుకాణానికి నెలనెలా రూ.50 వేల చొప్పున అధికార పార్టీలో ఓ కీలక నాయకుడి అనుచరులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో వైన్‌షాపుల నిర్వాహకులు కొందరు బ్రాండెడ్‌ మిక్సింగ్‌కు తెగిస్తున్నారు.  

యాప్‌తోనైనా ఆగేనా?

వాస్తవానికి కల్తీ మద్యం వ్యవహారాలను అరికట్టేందుకు ఎక్సైజ్‌ సిబ్బంది తరచుగా వైన్‌షాపుల్లో, గ్రామాల్లోనూ అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాలి. వైన్‌షాపుల్లో మద్యం శాంపిళ్లు తీసి ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించాలి. మరోవైపు నకిలీమూతల తయారీదారులు, పంపిణీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడే మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్సైజ్‌ శాఖలో ఇటీవల వరకూ అలాంటి దూకుడు కనిపించలేదు. అక్రమార్కులకు, మద్యం సిండికేట్‌లకు అధికార పార్టీ నాయకుల అండదండలు, భారీ ఎత్తున మామూళ్ల వ్యవహారాలే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది నవంబరు 3వ తేదీన సాక్షాత్తూ జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ ఇంట్లోనే ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.4.50 లక్షల భారీ మొత్తం బయటపడటం దీనికొక తార్కాణంగా చెప్పవచ్చు. బెల్ట్‌షాపులు, కల్తీ మద్యం వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు ‘ఎస్‌వోపీ’ యాప్‌ను ప్రారంభించారు. ఏడు దశల్లో 90 అంశాలతో కూడిన ఈ యాప్‌లో ప్రజలను భాగస్వామ్యం చేయడం, అధికారుల తీరుతెన్నులను పర్యవేక్షించడం, కేసుల పురోగతి పరిశీలన, నిందితులపై నిఘా తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ యాప్‌ ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి మరి! 

కల్తీ మద్యం వరదకు నిదర్శనాలు...

 28.01.2018: వీరఘట్టంలో జనాతా వైన్స్‌ పేరుతో నిర్వహిస్తోన్న దుకాణంలో కల్తీ మద్యం వెలుగుచూసింది. బ్రాండెడ్‌ మద్యం బాటిళ్ల మూతలను పోలిన నకిలీ మూతలను హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తయారీ చేయించి తీసుకొచ్చినట్లు ఆధారాలు దొరికాయి. 

 01.02.2018: ఆమదాలవలస పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో బెల్ట్‌షాప్‌పై టాస్క్‌ఫోర్స్‌ అధి కారులు చేశారు. అక్కడ దొరికిన మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్‌ నంబర్లు ఆధారంగా ఆరా తీశా రు. ఆ సరుకు సమీపంలోని రవితేజ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నుంచి వచ్చినట్లు తేలింది. అం తేకాదు ల్యాబ్‌లో తనిఖీ చేయిస్తే కల్తీ మద్యం అని రూఢి అయ్యింది. దీంతో ఎకై్సజ్, టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు ఆ షాప్‌ను సీజ్‌ చేశారు.

 24.03.2018: సంతకవిటిలోని తేజశ్విని వైన్‌షాపుపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు జరిపిన దాడిలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. బ్రాండెడ్‌ మద్యం సీసాల మూతలు తొలగించి కొంత మద్యం బయటకు తీసేసి, ఆ మేరకు చీప్‌లిక్కర్, నీరు మిక్సింగ్‌ చేసేస్తున్నారు. ఆ సీసాలకు నకిలీమూతలతో సీల్‌ వేసేస్తున్నారు. 

 07.04.2018: శ్రీకాకుళం రూరల్‌ మండలం చాపురం గ్రామంలో ఓ వైన్‌షాప్‌ కేంద్రంగా బ్రాండ్‌ మిక్సింగ్‌ యూనిట్‌నే నడుపుతున్న వ్యవహారం వెలు గుచూసింది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం నగరంలోనే గాకుండా గార, నరసన్నపేట, పోలాకి, జలుమూరు తదితర 20 మండలాలకు ఇక్కడి నుంచే కల్తీ సరుకు సరఫరా అవుతుందంటే పరిస్థితి ఊహించవచ్చు. ఈ కేసులో 14 మందిని అరెస్టు చేసి న ఎక్సైజ్‌ అధికారులు ఆరు బైక్‌లు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వద్ద కల్తీ మద్యం 832 సీసాలు, అలాగే 176 బ్రాండెడ్‌ ఖాళీ బాటిళ్లు దొరికాయి.  03.05.2018: మందస మండలంలో హరిపురం–బాలిగాం జంక్షన్‌లో ఉన్న తనీష్‌ వైన్‌షాప్‌లో భారీగా కల్తీ మద్యం బయటపడింది. ముగ్గురు నింది తులను ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement