సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రధాన నిందితుడిగా ఉన్న ‘అప్పు’ గత ఏడాది నకిలీ మద్యం కేసులో సీఐడీ పోలీసులకు చిక్కాడు. అతడే ఎర్రచందనం స్మగ్లింగ్‌లోనూ నిందితుడు అనే విషయం వారికి తెలియదు. తీరా అప్పు నకిలీ మద్యం కేసులో బెయిల్‌పై బయటపడేందుకు ప్రయత్నిస్తుండగా నిఘా విభాగం.. అతడు ‘ఎర్ర‘ కేసుల్లోనూ నిందితుడని తేల్చడంతో ఆ కేసుల్లోనూ అప్పును అరెస్టు చేశారు. లేదంటే అతడు జైలు నుంచి బయటకు వెళ్లి తన నేర చరిత్రను కొనసాగించే వాడే.
ఇలాంటి సమాచార మార్పిడి లోపాన్ని నివారించేందుకు దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీటీఎన్‌ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ టెక్నాలజీ నెట్‌వర్క్ అండ్ సిస్టం)ను కేంద్రం 2011 లో ఏర్పాటు చేసింది. మొదటి దశలో భాగంగా హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేసింది. ఈ విధానాన్ని 2013 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా అన్ని స్టేషన్లకు కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని అందజేశారు.
అయితే ప్రభుత్వాల అలసత్వంతో నేటికీ ఈ విధానం కార్యరూపం దాల్చలేదు. దీంతో సమాచార మార్పిడి వ్యవస్థ సరిగ్గా లేక పోలీసుల ముందే నేరస్తులు దర్జాగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీటీఎన్‌ఎస్‌ను వెంటనే అమలు చేసేందుకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం కోసం బుధవారం (నేడు) అన్ని రాష్ట్రాల సీఎస్, డీజీలతో సమీక్ష నిర్వహించనున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటల్ టెక్నాలజీని వేగవంతమైన నేర పరిశోధనకు ఉపయోగించుకోవాలని ప్రధాని భావిస్తున్నారు.
సీసీటీఎన్‌ఎస్ పనితీరు ఇలా..
ఒక నేరం కింద పట్టుబడిన వ్యక్తికి సంబంధించి ప్రాథమిక సమాచారంతో పాటు వారి వేలిముద్రలు తదితర వాటిని పోలీసులు నమోదు చేస్తారు. వాటిని సీసీటీఎన్‌ఎస్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో అతని సమాచారం దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లకు చేరుతుంది. ఇక ఆ వ్యక్తి ఇతర ప్రాంతాల్లో మరో నేరం చేస్తూ పట్టుబడితే వేలిముద్రల ఆధారంగా అతడి గత చరిత్ర బయటపడుతుంది.
అడ్డంకిగా మారుతున్న నెట్‌వర్క్..
సీసీటీఎన్‌ఎస్ అమలుకు నెట్‌వర్కింగ్ అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికీ కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఇంటర్‌నెట్ సౌకర్యం లేదు. సిబ్బంది కూడా లేరు... ఉన్న చోట శిక్షణ ఇవ్వడం లేదు. వీటన్నింటిని అధిగమించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థ అమలు ముందుకు సాగడం లేదు.
‘నెట్’వర్క్ లేదు..!
Published Wed, Aug 26 2015 3:57 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement