Fake Maoists
-
యూ ట్యూబ్ చూసి.. నేరాలకు దిగి
సాక్షి, జనగామ: శాస్త్ర సాంకేతిక రంగాల విస్తృత అభివృద్ధి కారణంగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. కంప్యూటర్, సెల్‌ఫోన్, ఇంటర్నెట్ కారణంగా విశ్వవ్యాప్తంగా ఉన్న విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అరచేతిలోనే సమస్త సమాచారం దర్శనమిస్తోంది. అనేక విషయాలను కళ్ల ముందరనే నిలుపుతున్నాయి. తెలియని విషయాలను తెలుసుకోవడానికి నిత్యసాధనంగా మారాయి. సకల సమస్త సమాచార గని మారిన మాట వాస్తవమే అయినప్పటికీ కొందరిలో మాత్రం నేర ప్రవృత్తికి బీజం వేస్తున్నాయి. తమకు కావాలి్సన సమాచారాన్ని అందిస్తుండడంతో నేరస్తులుగా మారిపోతున్నారు. యూట్యూబ్‌లో లభ్యమయ్యే సమాచారాన్ని సాధనంగా ఎంచుకొని తప్పుడు పనులకు వినియోగిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోయి నిందితులుగా మారుతున్నారు. ఈ ఏడాది జవరిలో ఒక ఘటన జరగగా తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారుతోంది. నాటు తుపాకీతో దారి దోపిడీ.. ఈ ఏడాది ప్రారంభంలో నాటు తుపాకీతో కొందరు దారిదోపిడీకి పాల్పడడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజున రాత్రి జిల్లాలోని కొడకండ్ల మండలంలో దారి దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామంలో వైన్స్ షాపు నిర్వహకులు రాత్రి బైక్‌పై ఇంటికి పోతుండగా కొడకండ్ల క్రాస్ రోడ్డు సమీపంలోని రామన్నగూడెం సమీపంలో దారి కాచిన వ్యక్తులు గాలిలోకి కాల్పులు జరిపారు. వారి వద్ద నుంచి రూ.6.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. ఈ ఘటనకు పాల్పడిన ఇస్లావత్ శంకర్, నారబోయిన మల్లేశ్, గంగాపురం స్వామి, పిట్టల శ్రీనివాస్‌లు యూట్యూబ్‌లో చూసి నాటు తుపాకులను తయారు చేశారు. అంతేకాకుండా తూటాలను సైతం తయారు చేసి దోపిడీకి పాల్పడి పోలీసులకు చిక్కారు. మావోయిస్టులుగా అవతారం ఎత్తి.. యూట్యూబ్‌లో వచ్చే మాజీ మావోయిస్టుల ఇంటర్వూ్యలను చూసి జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మావోయిస్టులుగా అవతారమెత్తి పోలీసులకు చిక్కారు. జనగామకు చెందిన మోరె భాస్కర్, నిమ్మల ప్రభాకర్ తరచూ ఓ యూట్యూబ్ చానెల్లో ప్రసారమయ్యే మాజీ మావోయిస్టు నేతల ఇంటర్వూ్యలను చూస్తూ పలువురు వ్యాపారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. చండ్ర పుల్లారెడ్డి గ్రూపు పేరుతో డబ్బుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడడంతో ఈ నెల 14వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్ ప్రభావంతో నేరాలు.. యూట్యూబ్ ప్రభావంతో కొందరు నేరాలకు దిగుతున్నారు. జిల్లాలో జరిగిన రెండు ఘటనలను పరిశీలిస్తే యూట్యూబ్‌లో లభించిన సమాచారం ఆధారంగానే దారి దోపిడీ, బెదిరింపులకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. యూట్యూబ్‌లోని సమాచారాన్ని నిందితులు తప్పుడు పనులకు వినియోగిస్తున్నట్లు ఈ రెండు ఘటనలను బట్టి తెలుస్తోంది. నేర ప్రవృత్తిపై యూట్యూబ్, ఇంటర్నెట్ ప్రభావం చూపుతుంది. విస్తరిస్తున్న నకిలీ నక్సల్స్ కార్యకలాపాలు.. పెరిగిన నిఘా వ్యవస్థ కారణంగా కొంతకాలం నుంచి ప్రశాంత వాతావరణ నెలకొన్నది. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు తప్పుడు పద్ధతులను అనుసరిస్తున్నారు. దొరికిపోతామనే భయం ఏమాత్రం లేకుండా యథేచ్ఛగా దందాలకు పాల్పడుతున్నారు. ఈ సంవత్సరంలోనే నకిలీ నక్సల్స్ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మళ్లీ నకిలీ నక్సలైట్ల కార్యకలాపాలు మొదలైనట్లుగా భావిస్తున్నారు. నకిలీల కారణంగా ఇంకా ఇబ్బందులు వస్తాయోననే భయం వెంటాడుతోంది. -
నకిలీ మావోయిస్టుల అరెస్టు
మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన యు.బలరాం, కృష్ణ, నర్సింహ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బొమ్మ పిస్టళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. -
‘రూ.అర కోటి ఇవ్వకుంటే ఆస్పత్రిని పేల్చేస్తా’
నక్సల్స్ పేరుతో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దమ్మాయిగూడలోని ఆదిత్య ఆస్పత్రి యాజమాన్యానికి గురువారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తాను మావోయిస్టు నేత శ్రీను అని పరిచయం చేసుకున్న ఆవ్యక్తి... వెంటనే రూ.50 లక్షలు ఇవ్వకుంటే ఆస్పత్రి భవనాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీనిపై యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నకిలీ నక్సల్స్ అరెస్ట్
ప్రజా ప్రతిఘటన పేరుతో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న 8మంది నకిలీ నక్సల్స్ ను పోలీసులు అరెస్టుచేశారు. సిద్ధిపేట ప్రాంతంలో వీరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
సూర్యాపేటలో నకిలీ మావోయిస్టులు అరెస్ట్
నల్గొండ: నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇద్దరు నకిలీ మావోయిస్టులను శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తూపాకీతోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సూర్యాపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లొంగుబాటు నాటకంలో.. బలిపశువులు!
వీరంతా జార్ఖండ్ యువకులు. నిరుపేద గిరిజన కుటంబాలకు చెందినవారు. ఇందులో ఎవరికీ ఎలాంటి నేరచరిత్ర లేదు. చట్టాన్ని ఉల్లంఘించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. వీరిది విచిత్రమైన కన్నీటి గాధ. నాలుగేళ్ల క్రితం ‘మావోయిస్టుల లొంగుబాటు’ పేరిట జరిగిన సరికొత్త నాటకానికి బలైనవారు. ఇప్పటికీ ఉద్యోగం సద్యోగం లేక అలమటిస్తున్న అభాగ్యులు, అన్నార్తులు. 2011లో అప్పటి జార్ఖండ్ డీజీపీ జీఎస్ రాథ్ ముందు వీరు మావోయిస్టులుగా లొంగిపోయారు. నిజానికి వీళ్లకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు. అయినా ఎందుకు లొంగిపోయారంటే... ఇలా లొంగిపోయిన వారికి సీఆర్పీఎఫ్లో ఉద్యోగాలిస్తామంటూ పోలీసు అధికారులతో సంబంధాలున్న దళారులు వీరిని నమ్మించారు. ఉద్యోగం పేరిట ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఉద్యోగానికి ఆశపడి ఇలా 514 మంది గిరిజన యువకులు కోట్లాది రూపాయలు ఎదురిచ్చి మావోయిస్టులుగా లొంగిపోయారు. అటు ఆశించిన ఉద్యోగం రాలేదు. ఇటు డబ్బులు వెనక్కి రాలేదు. పైగా మావోయిస్టుల పేరిట ఒక్కొక్కరు 8 నెలల నుంచి ఏడాది వరకు జైలు జీవితం గడిపారు. విడుదలయ్యాక.. ఉద్యోగం కోసం చేసిన అప్పులు తీర్చలేక, ఇంటాబయట ఛీత్కారాలు ఎదుర్కొంటూ బతుకుతున్నారు. ‘మావోయిస్టుల లొంగుబాటు’ పేరిట రక్తికట్టిన నాటకానికి అప్పట్లో విశేష ప్రచారమిచ్చి మీడియా కూడా నాటకంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ నాటకంలో పాత్రధారులైన సీఆర్పీఎఫ్, జార్ఖండ్ పోలీసు అధికారుల్లో కొంతమంది పదవీ విరమణ చేయగా, కొందరు అధికారులు వివిధ విభాగాల్లో ఉన్నత పదవులను అధిష్ఠించారు. ఆ తర్వాత కుంభకోణం వెలుగులోకి వచ్చాక వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు జార్ఖండ్ పోలీసులు ఈ కుంభకోణంలో దళారులుగా వ్యవహరించిన ఒకప్పటి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, మాజీ సైనిక గూఢాచారి అయిన రవి బోద్రాపై, అతనికి సహకరించిన స్థానిక కోచింగ్ సెంటర్ యజమాని దినేష్ ప్రజాపతిపై 2012లోనే కేసు పెట్టారు. ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా 2014, మార్చిలో నిందితుడు రవి బోద్రా, ఈ లొంగుబాటు నాటకంలో తన పాత్ర తక్కువని, సీఆర్పీఎఫ్, పోలీసు ఆన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ స్కామ్‌కు పాల్పడ్డానని వాంగ్మూలం ఇచ్చారు. అయినా కేసు ముందుకు కదలలేదు. నకిలీ మావోయిస్టులుగా లొంగిపోయిన 514 మంది గిరిజన యువకులకు, తుపాకులు, రైఫిళ్లు, బాంబులు ఎవరు సరఫరా చేశారో కూడా వెలికి తీయలేక పోయారు. స్కామ్ జరిగిన ఏడాది తర్వాత అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. సీబీఐ దర్యాప్తును కోరుతూ పౌర హక్కుల సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ కుమార్ రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దానికీ అతీగతీ లేదు. అప్పటి జార్ఖండ్ డీజీపీ జీఎస్ రాథ్‌ను ఇప్పుడు మీడియా ప్రశ్నించగా, తాను రిటైరయ్యానని, తనకేమీ గుర్తులేదని సమాధానం ఇచ్చారు. రాథ్ స్థానంలో డీజీపీగా వచ్చిన డీకే పాండే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు చీఫ్‌గా కొనసాగుతున్నారు. కేసు పురోగతి గురించి ఆయన్ని ప్రశ్నించినా మౌనమే సమాధానం. కేసు సంగతి తమకనవసరమని, నిందితులకు శిక్ష పడిందా, లేదా అన్నది కూడా అక్కరలేదని, అనవసరంగా జైలు శిక్ష పడినందుకు కూడా తాము పరిహారం కోరడం లేదని, అప్పుచేసి ఉద్యోగాల కోసం తాము చెల్లించిన తమ మొత్తాలను తమకిప్పిస్తే చాలని బాధిత గిరిజన యువకులు వాపోతున్నారు. -
నకిలీ మావోయిస్టు అరెస్టు
హనుమాన్‌జంక్షన్(కృష్ణాజిల్లా): విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీశ్‌కుమార్‌ను మావో అగ్రనేత గణపతి పేరుతో బెదిరింపులకు పాల్పడిన నకిలీ మావోయిస్టును హనుమాన్‌జంక్షన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ జె.సీతారామస్వామి వివరాలు వెల్లడించారు. వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాసరెడ్డి(31)ని మీడియాకు చూపారు. డీఎస్పీ వెల్లడించిన వివరాలు.. మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో సతీశ్‌కుమార్‌కు ఇటీవల వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. పార్టీ ప్లీనరీ కోసం చందాలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి రెండు బ్యాంక్ ఖాతా నంబర్లు ఇచ్చాడు. దీనిపై సతీశ్‌కుమార్ ఈనెల 22న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.రమణ, ఎస్సై ఐ.వి.నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని జమ్మికుంట, వీణవంక ప్రాంతాల నుంచి ఫోన్‌కాల్స్ వెళ్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి సీఐ నేతృత్వంలో పోలీసు బృందం జమ్మికుంటకు చేరుకుంది. నిందితుడి ఫోన్‌కాల్స్ జాబితా, బ్యాంక్ ఖాతా నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. జమ్మికుంట ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌లో అకౌంటు రిటైర్డ్ పోస్టుమాస్టర్ పేరిట ఉండడంతో జంక్షన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కనపర్తికి చెందిన శ్రీనివాసరెడ్డి కొన్నిరోజుల కిందట తన ఖాతా నంబరు అడిగితే ఇచ్చినట్లు రిటైర్డ్ పొస్టుమాస్టర్ తెలిపాడు. శ్రీనివాసరెడ్డి ఉపయోగించే సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలు తన పేరిట లేకుండా జాగ్రత్త పడ్డాడు. స్నేహితులు, బంధువులు డబ్బులు పంపుతారని చెప్పి ఇరుగుపొరుగు వాళ్ల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని ఈ తరహా బెదిరింపు వసూళ్లకు వాడుకుంటున్నట్లు విచారణలో తేలింది. జిల్లా పోలీసుల సహకారంతో శ్రీనివాసరెడ్డిని జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.