లొంగుబాటు నాటకంలో.. బలిపశువులు!
వీరంతా జార్ఖండ్ యువకులు. నిరుపేద గిరిజన కుటంబాలకు చెందినవారు. ఇందులో ఎవరికీ ఎలాంటి నేరచరిత్ర లేదు. చట్టాన్ని ఉల్లంఘించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. వీరిది విచిత్రమైన కన్నీటి గాధ. నాలుగేళ్ల క్రితం ‘మావోయిస్టుల లొంగుబాటు’ పేరిట జరిగిన సరికొత్త నాటకానికి బలైనవారు. ఇప్పటికీ ఉద్యోగం సద్యోగం లేక అలమటిస్తున్న అభాగ్యులు, అన్నార్తులు. 2011లో అప్పటి జార్ఖండ్ డీజీపీ జీఎస్ రాథ్ ముందు వీరు మావోయిస్టులుగా లొంగిపోయారు. నిజానికి వీళ్లకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు. అయినా ఎందుకు లొంగిపోయారంటే... ఇలా లొంగిపోయిన వారికి సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలిస్తామంటూ పోలీసు అధికారులతో సంబంధాలున్న దళారులు వీరిని నమ్మించారు. ఉద్యోగం పేరిట ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు.
ఉద్యోగానికి ఆశపడి ఇలా 514 మంది గిరిజన యువకులు కోట్లాది రూపాయలు ఎదురిచ్చి మావోయిస్టులుగా లొంగిపోయారు. అటు ఆశించిన ఉద్యోగం రాలేదు. ఇటు డబ్బులు వెనక్కి రాలేదు. పైగా మావోయిస్టుల పేరిట ఒక్కొక్కరు 8 నెలల నుంచి ఏడాది వరకు జైలు జీవితం గడిపారు. విడుదలయ్యాక.. ఉద్యోగం కోసం చేసిన అప్పులు తీర్చలేక, ఇంటాబయట ఛీత్కారాలు ఎదుర్కొంటూ బతుకుతున్నారు. ‘మావోయిస్టుల లొంగుబాటు’ పేరిట రక్తికట్టిన నాటకానికి అప్పట్లో విశేష ప్రచారమిచ్చి మీడియా కూడా నాటకంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ నాటకంలో పాత్రధారులైన సీఆర్‌పీఎఫ్, జార్ఖండ్ పోలీసు అధికారుల్లో కొంతమంది పదవీ విరమణ చేయగా, కొందరు అధికారులు వివిధ విభాగాల్లో ఉన్నత పదవులను అధిష్ఠించారు. ఆ తర్వాత కుంభకోణం వెలుగులోకి వచ్చాక వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు జార్ఖండ్ పోలీసులు ఈ కుంభకోణంలో దళారులుగా వ్యవహరించిన ఒకప్పటి సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, మాజీ సైనిక గూఢాచారి అయిన రవి బోద్రాపై, అతనికి సహకరించిన స్థానిక కోచింగ్ సెంటర్ యజమాని దినేష్ ప్రజాపతిపై 2012లోనే కేసు పెట్టారు. ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా 2014, మార్చిలో నిందితుడు రవి బోద్రా, ఈ లొంగుబాటు నాటకంలో తన పాత్ర తక్కువని, సీఆర్‌పీఎఫ్, పోలీసు ఆన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ స్కామ్‌కు పాల్పడ్డానని వాంగ్మూలం ఇచ్చారు. అయినా కేసు ముందుకు కదలలేదు.
నకిలీ మావోయిస్టులుగా లొంగిపోయిన 514 మంది గిరిజన యువకులకు, తుపాకులు, రైఫిళ్లు, బాంబులు ఎవరు సరఫరా చేశారో కూడా వెలికి తీయలేక పోయారు. స్కామ్ జరిగిన ఏడాది తర్వాత అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. సీబీఐ దర్యాప్తును కోరుతూ పౌర హక్కుల సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ కుమార్ రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దానికీ అతీగతీ లేదు. అప్పటి జార్ఖండ్ డీజీపీ జీఎస్ రాథ్‌ను ఇప్పుడు మీడియా ప్రశ్నించగా, తాను రిటైరయ్యానని, తనకేమీ గుర్తులేదని సమాధానం ఇచ్చారు. రాథ్ స్థానంలో డీజీపీగా వచ్చిన డీకే పాండే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు చీఫ్‌గా కొనసాగుతున్నారు. కేసు పురోగతి గురించి ఆయన్ని ప్రశ్నించినా మౌనమే సమాధానం.
కేసు సంగతి తమకనవసరమని, నిందితులకు శిక్ష పడిందా, లేదా అన్నది కూడా అక్కరలేదని, అనవసరంగా జైలు శిక్ష పడినందుకు కూడా తాము పరిహారం కోరడం లేదని, అప్పుచేసి ఉద్యోగాల కోసం తాము చెల్లించిన తమ మొత్తాలను తమకిప్పిస్తే చాలని బాధిత గిరిజన యువకులు వాపోతున్నారు.