హనుమాన్‌జంక్షన్(కృష్ణాజిల్లా): విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీశ్‌కుమార్‌ను మావో అగ్రనేత గణపతి పేరుతో బెదిరింపులకు పాల్పడిన నకిలీ మావోయిస్టును హనుమాన్‌జంక్షన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ జె.సీతారామస్వామి వివరాలు వెల్లడించారు. వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాసరెడ్డి(31)ని మీడియాకు చూపారు.
డీఎస్పీ వెల్లడించిన వివరాలు.. మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో సతీశ్‌కుమార్‌కు ఇటీవల వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. పార్టీ ప్లీనరీ కోసం చందాలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి రెండు బ్యాంక్ ఖాతా నంబర్లు ఇచ్చాడు. దీనిపై సతీశ్‌కుమార్ ఈనెల 22న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.రమణ, ఎస్సై ఐ.వి.నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని జమ్మికుంట, వీణవంక ప్రాంతాల నుంచి ఫోన్‌కాల్స్ వెళ్తున్నట్లు గుర్తించారు.
అక్కడి నుంచి సీఐ నేతృత్వంలో పోలీసు బృందం జమ్మికుంటకు చేరుకుంది. నిందితుడి ఫోన్‌కాల్స్ జాబితా, బ్యాంక్ ఖాతా నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. జమ్మికుంట ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌లో అకౌంటు రిటైర్డ్ పోస్టుమాస్టర్ పేరిట ఉండడంతో జంక్షన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కనపర్తికి చెందిన శ్రీనివాసరెడ్డి కొన్నిరోజుల కిందట తన ఖాతా నంబరు అడిగితే ఇచ్చినట్లు రిటైర్డ్ పొస్టుమాస్టర్ తెలిపాడు.
శ్రీనివాసరెడ్డి ఉపయోగించే సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలు తన పేరిట లేకుండా జాగ్రత్త పడ్డాడు. స్నేహితులు, బంధువులు డబ్బులు పంపుతారని చెప్పి ఇరుగుపొరుగు వాళ్ల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని ఈ తరహా బెదిరింపు వసూళ్లకు వాడుకుంటున్నట్లు విచారణలో తేలింది. జిల్లా పోలీసుల సహకారంతో శ్రీనివాసరెడ్డిని జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
నకిలీ మావోయిస్టు అరెస్టు
Published Fri, Aug 29 2014 2:29 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement