యూ ట్యూబ్‌ చూసి.. నేరాలకు దిగి | Many Criminals Watch Videos On Youtube To Learn How To Theft | Sakshi
Sakshi News home page

యూ ట్యూబ్‌ చూసి.. నేరాలకు దిగి

Published Tue, Dec 17 2019 10:46 AM | Last Updated on Tue, Dec 17 2019 10:46 AM

Many Criminals Watch Videos On Youtube To Learn How To Theft - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జనగామ:  శాస్త్ర సాంకేతిక రంగాల విస్తృత అభివృద్ధి కారణంగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. కంప్యూటర్, సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ కారణంగా విశ్వవ్యాప్తంగా ఉన్న విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అరచేతిలోనే సమస్త సమాచారం దర్శనమిస్తోంది. అనేక విషయాలను కళ్ల ముందరనే నిలుపుతున్నాయి. తెలియని విషయాలను తెలుసుకోవడానికి నిత్యసాధనంగా మారాయి. సకల సమస్త సమాచార గని మారిన మాట వాస్తవమే అయినప్పటికీ కొందరిలో మాత్రం నేర ప్రవృత్తికి బీజం వేస్తున్నాయి. తమకు కావాలి్సన సమాచారాన్ని అందిస్తుండడంతో నేరస్తులుగా మారిపోతున్నారు. యూట్యూబ్‌లో లభ్యమయ్యే సమాచారాన్ని  సాధనంగా ఎంచుకొని తప్పుడు పనులకు వినియోగిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోయి నిందితులుగా మారుతున్నారు. ఈ ఏడాది జవరిలో ఒక ఘటన జరగగా తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారుతోంది. 

నాటు తుపాకీతో దారి దోపిడీ..
ఈ ఏడాది ప్రారంభంలో నాటు తుపాకీతో కొందరు దారిదోపిడీకి పాల్పడడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజున రాత్రి జిల్లాలోని కొడకండ్ల మండలంలో దారి దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామంలో వైన్స్‌ షాపు నిర్వహకులు రాత్రి బైక్‌పై ఇంటికి పోతుండగా కొడకండ్ల క్రాస్‌ రోడ్డు సమీపంలోని రామన్నగూడెం సమీపంలో దారి కాచిన వ్యక్తులు గాలిలోకి కాల్పులు జరిపారు. వారి వద్ద నుంచి రూ.6.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. ఈ ఘటనకు పాల్పడిన ఇస్లావత్‌ శంకర్, నారబోయిన మల్లేశ్, గంగాపురం స్వామి, పిట్టల శ్రీనివాస్‌లు యూట్యూబ్‌లో చూసి నాటు తుపాకులను తయారు చేశారు. అంతేకాకుండా తూటాలను సైతం తయారు చేసి దోపిడీకి పాల్పడి పోలీసులకు చిక్కారు. 

మావోయిస్టులుగా అవతారం ఎత్తి..
యూట్యూబ్‌లో వచ్చే మాజీ మావోయిస్టుల ఇంటర్వూ్యలను చూసి జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మావోయిస్టులుగా అవతారమెత్తి పోలీసులకు చిక్కారు. జనగామకు చెందిన మోరె భాస్కర్, నిమ్మల ప్రభాకర్‌ తరచూ ఓ యూట్యూబ్‌ చానెల్‌లో ప్రసారమయ్యే మాజీ మావోయిస్టు నేతల ఇంటర్వూ్యలను చూస్తూ పలువురు వ్యాపారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. చండ్ర పుల్లారెడ్డి గ్రూపు పేరుతో డబ్బుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడడంతో ఈ నెల 14వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. 

యూట్యూబ్‌ ప్రభావంతో నేరాలు..
యూట్యూబ్‌ ప్రభావంతో కొందరు నేరాలకు దిగుతున్నారు. జిల్లాలో జరిగిన రెండు ఘటనలను పరిశీలిస్తే యూట్యూబ్‌లో లభించిన సమాచారం ఆధారంగానే దారి దోపిడీ, బెదిరింపులకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. యూట్యూబ్‌లోని సమాచారాన్ని నిందితులు తప్పుడు పనులకు వినియోగిస్తున్నట్లు ఈ రెండు ఘటనలను బట్టి తెలుస్తోంది. నేర ప్రవృత్తిపై యూట్యూబ్, ఇంటర్‌నెట్‌ ప్రభావం చూపుతుంది. 

విస్తరిస్తున్న నకిలీ నక్సల్స్‌ కార్యకలాపాలు..
పెరిగిన నిఘా వ్యవస్థ కారణంగా కొంతకాలం నుంచి ప్రశాంత వాతావరణ నెలకొన్నది. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు తప్పుడు పద్ధతులను అనుసరిస్తున్నారు. దొరికిపోతామనే భయం ఏమాత్రం లేకుండా యథేచ్ఛగా దందాలకు పాల్పడుతున్నారు. ఈ సంవత్సరంలోనే నకిలీ నక్సల్స్‌ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మళ్లీ నకిలీ నక్సలైట్ల కార్యకలాపాలు మొదలైనట్లుగా భావిస్తున్నారు. నకిలీల కారణంగా ఇంకా ఇబ్బందులు వస్తాయోననే భయం వెంటాడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement