famed
-
ప్రముఖ కార్టూనిస్ట్ కన్నుమూత, సీఎం సంతాపం
తిరువనంతపురం : ప్రముఖ కార్టూనిస్ట్, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సీజే ఏసుదాసన్ (83) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ పోస్ట్ కరోనా సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు రేపు జరగ నున్నాయని, ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం కలమస్సేరి, మున్సిపల్ టౌన్ హాల్లో ఉంచుతామని తెలిపారు. ఏసుదాసన్ అకాలమరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. కార్టూన్ల రంగం ప్రతిభావంతుడైన ఆర్టిస్టును కోల్పోయిందంటూ నివాళులర్పించారు. ఏసుదాసన్ తన కార్టూన్ల ద్వారా, ఒక కాలంలోని రాజకీయ పరిణామాలను ప్రతిబింబించడమే కాకుండా, ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం పరిచేవారని, ఆయన పనిని పరిశీలించే ఎవరైనా కేరళ రాజకీయ చరిత్రను చూడొచ్చని సీఎం అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, వీడీ సతీసన్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. ఇంకా సీనియర్ కార్టూనిస్టులు, పలువురు జర్నలిస్టులు కూడా ఏసుదాసన్ మృతికి సంతాపం తెలిపారు. కేరళ కార్టూన్ అకాడమీకి ఏసుదాసన్ తొలి చైర్మన్ మృతికి కొచ్చిలోని సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ సంతాపం ప్రకటించింది. ఏసుదాసన్ ఎంతో సౌమ్యమైన వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని గౌరవించేవారని ఢిల్లీలోని ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్నాథ్ పేర్కొన్నారు. కాగా రాజకీయ కార్టూన్లకు ప్రసిద్ధి చెందిన ఏసుదాసన్ అనేకసార్లు కేరళ ప్రభుత్వ ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డును అందుకున్నారు. స్వదేశాభిమాని అవార్డు, బీఎం గఫూర్ అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పీకే మంత్రి స్మారక పురస్కారం, ఎన్ వి పైలీ అవార్డులను స్వీకరించారు. 1938లో అలప్పు జిల్లాలోని భారైకావులో జన్మించిన ఏసుదాసన్ మలయాళ మనోరమకు కార్టూనిస్ట్గా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఏసుదాసన్కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు -
నోట్ల రద్దుతో 'రసగుల్ల' మల్లగుల్లాలు
కోలకత్తా: బెంగాల్ అంటే స్వీట్లకు పెట్టింది పేరు. కానీ డీమానిటేజేషన్ ప్రభావంతో బెంగాల్ తీపి వంటకాలు చేదెక్కుతున్నాయి. ప్రధానంగా బెంగాలీ స్వీట్ గా పేరొందిన రసగుల్లా అమ్మకాలపై వేటు పడింది. రూ.500 నుంచి రూ .1,000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ కేంద్ర నిర్ణయం తమ స్వీట్ల అమ్మకాలపై భారీగా పడిందని పశ్చిమ బెంగాల్ స్వీట్ వర్తకం దారులు వాపోతున్నారు. ముఖ్యంగా కార్తీక పూజ సందర్భంగా ఏడాదికి సరిపడా ఆదాయం వచ్చే స్వీట్ల అమ్మకాలు భారీగా పడిపోవడం తమ వ్యాపారాన్ని దెబ్బతీసిందన్నారు. స్థానిక వర్తకులు సమాచారం ప్రకారం ఇక్కడ ఏడాదికి లక్షకోట్ల రూపాయల స్వీట్ల వ్యాపారం జరుగుతుంది. పెద్ద నోట్ల రద్దుతో రోజుకి నాలుగు నుంచి పదివేలరూపాయల వరకు అమ్మకాలు పడిపోయాయని హౌరాకు చెందిన గంధేశ్వరీ స్వీట్స్ యజమాని ప్రదీప్ హాల్దర్ చెప్పారు. అలాగే రసగుల్లాను పరిచయం చేసిన ధిమాన్ దాస్ కంపెనీ కూడా ప్రస్తుతం తయారీని నిలిపివేసే స్థితికి వచ్చింది. ఎపుడూ భారీ డిమాండ్ ఉండే తమ రసగుల్లా , సందేష్ లకు ప్రస్తుతం డిమాండ్ 30శాతం పడిపోయందని కంపెనీ యజమాని కేసీ దాస్ తెలిపారు. దీంతో పురాతన స్వీట్ షాప్ లోఉత్పత్తిని ఒక రోజు నిలిపివేసినట్టు చెప్పారు. ముఖ్యంగా డెబిట్ కార్డు ఆప్షన్ లేని వీధి వ్యాపారులు భారీగా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు చక్కెర లాంటి ఇతర ముడి పదార్థాలు అందించే విక్రయదారులు పాత నోట్లను అంగీకరించమని తెగేసి చెప్పడం మరింత ఆందోళనకరంగా పరిణమించిందని తెలిపారు. ఇటు పాత నోట్ల చలామణిలేక, అటు కొత్త నోట్లు అందుబాటులోకి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అయితే కొంతమంది నమ్మకస్తులైన కస్టమర్లకు తరువాత చెల్లించే పద్ధతిలో స్వీట్లను విక్రయిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రూ.100 ల స్వీట్స్ కోసం రూ. 2 వేల నోటు ఇవ్వడంతో చిల్లర కష్టాలు తప్పడంలేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే .. తమ వ్యాపార నిర్వహణ ఎలాగో అర్థం కావడంలేదన్నారు. కొత్త నోట్ల కొరతతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని వ్యాపారులు చెప్పారు. అయితే క్రెడిట్ కార్డు అమ్మకాలు బాగా పెరిగినా.. అందరికీ డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపుల అవకాశం లేకపోవడంతో ముఖ్యంగా వీధి వ్యాపారులు బాగా నష్టపోతున్నట్టు చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ మనీ' ని రాష్ట్రంలోని స్వీట్ వ్యాపారులు కొంతమంది ప్రశంసిస్తున్నారు. కొంతకాలం తమకు ఈ కష్టలు తప్పవు అంటూ సరిపెట్టుకోవడం విశేషం.