family responsibilites
-
కళ్లల్లో కారం కొడితే గంజాయి మానరు.. కొట్టాలా? తిట్టాలా? ఎలా నచ్చజెప్పాలా?
చెడు అలవాటుకు బానిసైన తొమ్మిదో క్లాసు అబ్బాయినిస్తంభానికి కట్టేసి కంట్లో కారం పెట్టింది తల్లి. పాత రోజుల్లో తల్లిదండ్రులు ఇంతకుమించిన కఠిన శిక్షలే వేశారు. తాళ్లతో కట్టి బావుల్లో వదిలి భయపెట్టారు. భయంతో పరివర్తన వస్తుందా? ప్రేమతో వస్తుందా? నచ్చచెప్పడంతోనా? పెడత్రోవ పట్టిన వ్యసనాల బారిన పడిన పిల్లలను దారికి తెచ్చేది ఎలా? మన దేశంలో పిల్లలు ఇల్లు విడిచి పారిపోవడానికి ప్రధాన కారణం ఇద్దరు. – దండించే తల్లిదండ్రులు – దండించే స్కూల్ టీచర్లు. ∙∙ పిల్లల లోకం చాలా చిన్నది. వారి ఊహల్లో భయాలు చాలా పెద్దవి. ‘రేపు హోమ్‌వర్క్ చేసుకుని రాకపోతే డొక్క చింపుతా’ అనే వార్నింగ్ ఆ సంగతి మర్చిపోయి నిద్ర లేచిన పిల్లాడికి తీవ్ర భయం రేపుతుంది. స్కూల్‌కి వెళ్లనంటే ‘వీపు పగులుతుంది’ అనే తల్లిదండ్రులు సిద్ధం. అటు స్కూల్లో.. ఇటు ఇంట్లో దండన భాష తప్ప మరో భాష వినపడదు. పిల్లాడేం చేస్తాడు? పారిపోతాడు. ‘నాలుగు దెబ్బలేయండి సార్. దారికొస్తాడు’ అని తల్లిదండ్రులు స్కూల్లోకొచ్చి చెబుతారు. అంటే పిల్లాడికి స్కూల్లో రక్షణ లేదని అర్థమవుతుంది. ‘మీ పిల్లాడు మా మాట వినడం లేదు. నాలుగు తగిలించి దారిలో పెట్టండి’ అని తల్లిదండ్రుల్ని స్కూలుకు పిలిచి వార్నింగ్ ఇస్తాడు హెడ్మాస్టర్. అంటే.. ఇంట్లో కూడా కోటింగే. పిల్లాడు ఏం చేయాలి. పారిపోతాడు. కోదాడలో జరిగిన తాజా ఘటన ఇప్పుడు చర్చ లేవదీసింది. అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డాడు. తల్లి, తండ్రి ఎంత మందలించినా గంజాయి మానలేదు కానీ చదువు మానేశాడు. కొంతకాలం ఇంటిలోనుంచి ఎటో వెళ్లిపోయాడు. మొన్న గంజాయి తాగి ఇంటికొచ్చిన కొడుకును చూసి తల్లి రగిలిపోయింది. స్తంభానికి కట్టి కళ్లల్లో కారం కొట్టింది. ఆ మంటకు పిల్లవాడు ఆర్తనాదాలు చేశాడు. అందరూ అది వీడియో తీశారు. దానిని వైరల్ చేశారు. ‘మమకారం’ అని టైటిల్స్ పెట్టారు. ఆ పిల్లాడు రేపటి నుంచి ఎలా ఈ ‘చెడ్డపేరు’ను తట్టుకుంటూ వీధుల్లో తిరగాలో ఎవరూ ఆలోచించలేదు. ఆ దండించాలనుకున్న తల్లి ఆ పిల్లాడి ప్రైవసీని కాపాడాలి అనుకోలేదు. ఆ తల్లి మంచి పని చేసిందని కొంతమంది తక్షణం స్పందించారు. కాని లోతుగా ఆలోచిస్తే ఇలాంటి శిక్షలు ఏ మాత్రం మేలు చేయవు. హాని తప్ప. ∙∙ ఎంత చిత్రమో చూడండి. గతంలో సంతానం ఎక్కువగా ఉండేది. ఏ పిల్లాడు ఏం చేస్తున్నాడో పెద్దగా పట్టేది కాదు. లేదా బతుకు బాదరబందీలో మునిగి ఉండేవారు. కొందరు పిల్లలు స్కూల్ ఎగ్గొట్టడం, ఈతకు వెళ్లడం, సిగరెట్ల కాల్చడం, పేకాట, సినిమాలు... ఈ వ్యసనాలకు మరిగేవారు. ఎప్పుడో తెలిసేది. తండ్రి జుట్టు పట్టుకుని వచ్చి ఇంట్లో పడేసి బెల్టుతో తన్నేవాడు. తల్లి చీపురు తిరగేసేది. చేతులూ కాళ్లూ కట్టేసి ఎండలో పడేసేవారు. తాడు కట్టి బావిలో వదిలేవారు. ఊహించని శిక్షలు వేసి రికార్డులకెక్కిన తల్లిదండ్రులు ఉన్నారు. కాని చిన్నపిల్లలు వాళ్లు. వాళ్లకు ఎప్పుడూ అర్థమయ్యేది ప్రేమ భాషే. భయం అదుపు చేస్తుంది. ప్రేమ పరివర్తన తెస్తుంది. ఈ చిన్న విషయాన్ని నేటికీ చాలామంది తల్లిదండ్రులు, గురువులు తెలుసుకోరు. ∙∙ వ్యసనాలకు అలవాటు పడే వీలు తల్లిదండ్రులే కల్పిస్తారు. ఏది ఎంత వరకు అనుమతించారో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పరు. సెల్‌ఫోన్, గేమ్స్, ఫ్రెండ్స్‌తో చాటింగ్.. తమ జోలికి రావడం లేదు కదా అని వదిలేస్తారు. తీరా వారు అడిక్ట్ అయ్యాక దండనకు దిగుతారు. దాని బదులు వారి కోసం సమయం వెచ్చించాలి అనుకోరు. పిల్లల స్నేహితులు ఎవరు? వారు స్కూల్‌కు వెళుతున్నారా? స్కూల్ అయ్యాక ఎవరితో తిరుగుతున్నారు, ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నారు తల్లిదండ్రులకు తెలియదు. ఏదో ప్రమాదం ఇంటి మీదకు వస్తే తప్ప. ఇవాళ పదో క్లాసులోనే స్మోకింగ్, ఆల్కహాల్ వరకూ వెళుతున్న పిల్లలు ఉన్నారు. పోర్నోగ్రఫీ బారిన పడుతున్నారు. ప్రేమ వ్యసనం ఒకటి ఎలాగూ ఉంది. కన్నదే ఒకరిద్దరు అయినప్పుడు వారికి తగినంత ఖర్చుకు ఇవ్వాలి కదా గారం చేయాలి కదా అని అనుకోవడం కూడా ప్రమాదంగా మారింది. ఏదీ తక్కువ వద్దు. ఏదీ ఎక్కువ వద్దు. అతి ప్రేమ... అతి కోపం ఏదీ వద్దు. పిల్లలతో చేసే ఎడతెగని సంభాషణే పిల్లల్ని, తల్లిదండ్రులని కాపాడుతుంది. పిల్లలు చాలామంచి రిసీవర్స్. వారు వ్యసనాలను ఎంత తొందరగా రిసీవ్ చేసుకుంటారో పరివర్తనను కూడా అంతే తొందరగా చేసుకుంటారు. వారితో సంభాషించాలి అంతే. కళ్లల్లో కారం కొట్టడం ద్వారా గంజాయి మానరు. అది తక్కువ మార్కులు వస్తున్నందుకు విధించిన దండన అయితే గనుక మార్కులూ రావు. నిపుణుల సహాయం తీసుకోవాలి. కౌన్సిలర్లు ఈ వ్యసనాల నుంచి ఎలా బయటపడాలో చెబుతారు. ట్యూషన్లు పెడితే మార్కులు ఎలా రావాలో వారు చెబుతారు. అంతే తప్ప మనం దండించడం వల్ల, కడుపు మాడ్చడం వల్ల, నలుగురి మధ్యలో అవమానించడం వల్ల ఫలితం ఉండదు. పిల్లలు ఇలా అయ్యారు అని దండించే ముందు వాళ్లు ఎందుకు అలా అయ్యారు ఎవరి పాత్ర ఎంత? వారిని సంస్కరించడంలో ఎవరి భాగస్వామ్యం ఎంత? అనేది పరిశీలించుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. ఇంట్లో పదహారు ఓటీటీలు మనమే పెట్టించి ‘ఎప్పుడూ టీవీ చూస్తుంటావేమిరా’ అని కారం డబ్బా అందుకుంటే ఆ కారం కొట్టాల్సింది ఎవరి కంట్లో. ప్రేమ, సంభాషణ... సమస్య, అవగాహన ఇవే తల్లిదండ్రులను, పిల్లలను కాపాడుతాయి. ఈ విషయాన్నే ఇప్పుడు వైరల్ చేయాల్సింది. -
ఎత్తిన బాటిల్ దించకుండా తాగేవాడిని: అమీర్ ఖాన్
Aamir Khan Given Up Alcohol Says He Down The Entire Bottle At Times: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మార్చి 14న 57వ ఏట అడుగుపెట్టాడు. 1988లో 18 ఏళ్ల వయసులో ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తన కుటుంబం, ఆధ్యాత్మికత, మతం వంటి తదితర అంశాలపై మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో తనకున్న మద్యం అలవాటు గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్ ఖాన్ 'నేను ఇంతకుముందు అప్పుడప్పుడు డ్రింక్ చేసేవాడిని. కొంతమంది రెండు పెగ్గులు తీసుకుంటారు. కానీ రెగ్యూలర్‌గా తాగుతారు. నేను అలాంటి వాళ్లలో ఒకరిని కాదు. నేను అకెషనల్గా అప్పుడప్పుడు మాత్రమే తాగేవాడిని. కాకపోతో తాగడానికి కూర్చున్నప్పుడు బాటిల్ మొత్తం పూర్తి చేసేవాడిని. అది కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీరు మత్తులో ఉన్నప్పుడు ఏవైనా రిగ్రీట్ ఫీల్ అయ్యేటువంటి పనులు చేశారా అని ఆలోచించుకోవాలి. నేనైతే అలా ఏం చేయలేదు. కానీ మనం సొంత నియంత్రణను కోల్పోవడమనేది నాకు నచ్చలేదు. అందుకే ఇకపై నేను తాగను.' అని అమీర్ ఖాన్ తెలిపాడు. చదవండి: సినిమా చూసి ఏడ్చేసిన స్టార్ హీరో, టీ షర్ట్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ.. అలాగే తన కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి కూడా అమీర్ చెప్పుకొచ్చాడు. 'ఎక్కడో నాకు అనిపించింది. నేను సరిగా నా బాధ్యతలను నిర్వర్తించలేదని. నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా మొదటి భార్య రీనా, తన తల్లిదండ్రులు, రెండో భార్య కిరణ్, తన తల్లిదండ్రులు, నా పిల్లలు వీళ్లందరూ నాకు చాలా సన్నిహితులు. నేను చిత్ర పరిశ్రమలో చేరినప్పుడు నాకు 18 ఏళ్లు. నేను చాలా నేర్చుకుని, చాలా చేయాలనుకున్నాను. ఈరోజు నాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు నేను కోరుకున్న విధంగా చేయలేకపోయాను. వారికి తగిన సమయం ఇవ్వలేకపోయానని నాకు అనిపించింది.' అని అమీర్ పేర్కొన్నాడు. -
ఎడారిలో నాలుగేళ్లు
ధర్పల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రానికి చెందిన దామోదర్ జనార్దన్ కుటుంబ పోషణ కోసం కిరాణ షాపు నడుపుకునే వాడు. ఎలాంటి లాభాలు రాకపోగా అప్పులు పెరిగి పోయాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలి. పిల్లలకు మంచి విద్య అందించాలి. ఇందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లడమే మార్గమని భావించాడు. ఇందుకోసం లక్ష రూపాయలు అప్పు చేసి ఏజెంట్ చేతిలో పెట్టా డు. అయితే సౌదీకెళ్లిన తర్వాత తెలిసింది తాను మోసపోయానని. అక్కడ పడిన వెతలు జనార్దన్ మాటల్లోనే..‘గల్ఫ్ దేశానికి వెళ్తే బతుకు బాగుపడుతుందనుకున్నాను. మంచి జీతం వస్తుందని ఆశపడ్డాను. నెలనెలా ఇంటికి పైసలు పంపి పిల్లలను బాగా చదివించాలనుకున్నాను. సౌదీ వెళ్లేందుకు నిర్ణయించుకుని ఏజెంటును కలిశాను. అతను కంపెనీ వీసా ఇప్పిస్తానని, కపిల్ ఇంట్లో వాచ్‌మన్ ఉద్యోమని చెప్పాడు. మంచి జీతం ఉంటుందన్నాడు. అయితే లక్ష రూపాయలు ఖర్చవుతాయన్నాడు. తెలిసిన వారినల్లా అడిగి లక్ష రూపాయలు జమచేసి ఏజెంట్ చేతిలో పెట్టాను. ఇది నాలుగేళ్ల కిందటి మాట. నేను సౌదీలోని దోఆద్మీకి వెళ్లగా అక్కడి నుంచి అరబ్బులు తీసుకెళ్లి ఎడారిలో విడిచిపెట్టారు. ఒంటెలను మేపాలని చెప్పి వెళ్లి పోయారు. వారానికి ఓసారి వచ్చి ఎండిన రొట్టెలు వేసి వెళ్లేవారు. చేసిన పనికి జీతం ఇచ్చేవారు కాదు. కోసుల దూరం నడిచి తొలుత ఇంటికి ఫోన్ చేసి కష్టాలు చెప్పుకొనే వాడిని. ఎంత చెప్పినా వారేం చేస్తారు. ఇటు భార్య పిల్లలు, అటు నేను ఏడుస్తూనే కాలం వెళ్లదీశాం. మూడేళ్ల తర్వాత మరో ఎడారి ప్రాంతానికి అరబ్బులు తీసుకెళ్లారు. అక్కడ ఫోన్ కూడా లేకపోయింది. దీంతో ఏడాది పాటు భార్యాపిల్లలకు ఫోన్ చేయలేకపోయాను. నా జాడ తెలియక నా తల్లిదండ్రులు గంగవ్వ, రాజన్న, భార్య సావిత్రి ఇద్దరు పిల్లలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒక దశలో వారు మంచం పట్టారు. ఈ పరిస్థితుల్లో కంపెనీ వీసా లేని వారు స్వదేశాలకు వెళ్లి పోవాలని సౌదీ ప్రభుత్వం నితాఖత్ జారీ చేసింది. దీంతో నాకు విముక్తి లభించినట్లయ్యింది. అప్పటి వరకు చేసిన పనికి జీతం కూడా అరబ్బులు ఇవ్వ లేదు. వారిని ప్రశ్నించే ధైర్యం నాకు లేదు. స్వదేశానికి రావాలంటే సౌదీకి చెందిన రెండు వేల రియాళ్లు చెల్లించాలి. ఇంటికి చేరేందుకు డబ్బులు లేక అల్లాడి పోయాను. సౌదీలోనే ఓ కంపెనీలో పనిచేసే తెలుగు వారిని డబ్బులు అప్పుగా ఇవ్వాలని వేడుకొన్నాను. అప్పు ఇచ్చేందుకు వారు ఒక షరతు పెట్టారు. వారి ఊళ్లో ఉన్న బంధువులకు డబ్బులు చెల్లించాక నాకు అప్పు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని నా భార్యకు ఫోన్లో చెప్పగా.. ఆమె * 30 వేలు అప్పుచేసి సౌదీలో నాకు అప్పు ఇచ్చే వారి ఇంట్లో ఇచ్చింది. అప్పుడు అక్కడి వారిచ్చిన డబ్బులతో టికెట్ కొనుక్కుని ఈనెల 18న ఇంటి కి చేరాను. నేను సౌదీకి వెళ్లికి కూడగట్టుకున్నది కష్టాలు, కన్నీళ్లే! కుటుంబానికి అప్పు భారం మిగిల్చాను. ప్రస్తుతం కుటుంబాన్ని మోయలేని స్థితిలో ఉన్నాను. ప్రభుత్వం సాయమందించాలి’ అని వేడుకున్నాడు జనార్దన్. బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించాను కుటుంబ పెద్ద దిక్కు సౌదీకి వెళ్లి ఏమి డబ్బులు పంపలేక పోయాడు. కుటుంబాన్ని పోషించేందుకు రాత్రి, పగలు బీడీలు చుట్టాను. అత్తమామతో పాటు ఇద్దరు పిల్లల్ని పోషించాల్సిన భారం నా మీదే పడింది. పూట తప్పించి పూట తింటూ కష్టపడ్డాను. ఇప్పుడు నా భర్త వచ్చిన ఆనందం ఎంతో ఉంది. ఇటు చేసిన అప్పులు తీరేది ఎలా అని దిగాలు కూడా ఉంది. ప్రభుత్వం మా కుటుంబానికి సాయం అందించాలి. -సావిత్రి, గల్ఫ్ బాధితుని భార్య, ధర్పల్లి