ఎడారిలో నాలుగేళ్లు | Four years in the desert | Sakshi
Sakshi News home page

ఎడారిలో నాలుగేళ్లు

Published Sat, Aug 24 2013 4:01 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

Four years in the desert

 ధర్పల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రానికి చెందిన దామోదర్ జనార్దన్ కుటుంబ పోషణ కోసం కిరాణ షాపు నడుపుకునే వాడు. ఎలాంటి లాభాలు రాకపోగా అప్పులు పెరిగి పోయాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలి. పిల్లలకు మంచి విద్య అందించాలి. ఇందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లడమే మార్గమని భావించాడు. ఇందుకోసం లక్ష రూపాయలు అప్పు చేసి ఏజెంట్ చేతిలో పెట్టా డు. అయితే సౌదీకెళ్లిన తర్వాత తెలిసింది తాను మోసపోయానని. అక్కడ పడిన వెతలు జనార్దన్ మాటల్లోనే..‘గల్ఫ్ దేశానికి వెళ్తే బతుకు బాగుపడుతుందనుకున్నాను. మంచి జీతం వస్తుందని ఆశపడ్డాను. నెలనెలా ఇంటికి పైసలు పంపి పిల్లలను బాగా చదివించాలనుకున్నాను. సౌదీ వెళ్లేందుకు నిర్ణయించుకుని ఏజెంటును కలిశాను. అతను కంపెనీ వీసా ఇప్పిస్తానని, కపిల్ ఇంట్లో వాచ్‌మన్ ఉద్యోమని చెప్పాడు. మంచి జీతం ఉంటుందన్నాడు. అయితే లక్ష రూపాయలు ఖర్చవుతాయన్నాడు. తెలిసిన వారినల్లా అడిగి లక్ష రూపాయలు జమచేసి ఏజెంట్ చేతిలో పెట్టాను. ఇది నాలుగేళ్ల కిందటి మాట.
 
  నేను సౌదీలోని దోఆద్మీకి వెళ్లగా అక్కడి నుంచి అరబ్బులు తీసుకెళ్లి ఎడారిలో విడిచిపెట్టారు. ఒంటెలను మేపాలని చెప్పి వెళ్లి పోయారు. వారానికి ఓసారి వచ్చి ఎండిన రొట్టెలు వేసి వెళ్లేవారు. చేసిన పనికి జీతం ఇచ్చేవారు కాదు. కోసుల దూరం నడిచి తొలుత ఇంటికి ఫోన్ చేసి కష్టాలు చెప్పుకొనే వాడిని. ఎంత చెప్పినా వారేం చేస్తారు. ఇటు భార్య పిల్లలు, అటు నేను ఏడుస్తూనే కాలం వెళ్లదీశాం. మూడేళ్ల తర్వాత మరో ఎడారి ప్రాంతానికి అరబ్బులు తీసుకెళ్లారు. అక్కడ ఫోన్ కూడా లేకపోయింది. దీంతో ఏడాది పాటు భార్యాపిల్లలకు ఫోన్ చేయలేకపోయాను. నా జాడ తెలియక నా తల్లిదండ్రులు గంగవ్వ, రాజన్న, భార్య సావిత్రి ఇద్దరు పిల్లలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒక దశలో వారు మంచం పట్టారు. ఈ పరిస్థితుల్లో కంపెనీ వీసా లేని వారు స్వదేశాలకు వెళ్లి పోవాలని సౌదీ ప్రభుత్వం నితాఖత్ జారీ చేసింది. దీంతో నాకు విముక్తి లభించినట్లయ్యింది.
 
  అప్పటి వరకు చేసిన పనికి జీతం కూడా అరబ్బులు ఇవ్వ లేదు. వారిని ప్రశ్నించే ధైర్యం నాకు లేదు. స్వదేశానికి రావాలంటే సౌదీకి చెందిన రెండు వేల రియాళ్లు చెల్లించాలి. ఇంటికి చేరేందుకు డబ్బులు లేక అల్లాడి పోయాను. సౌదీలోనే ఓ కంపెనీలో పనిచేసే తెలుగు వారిని డబ్బులు అప్పుగా ఇవ్వాలని వేడుకొన్నాను. అప్పు ఇచ్చేందుకు వారు ఒక షరతు పెట్టారు. వారి ఊళ్లో ఉన్న బంధువులకు డబ్బులు చెల్లించాక నాకు అప్పు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని నా భార్యకు ఫోన్‌లో చెప్పగా.. ఆమె * 30 వేలు అప్పుచేసి సౌదీలో నాకు అప్పు ఇచ్చే వారి ఇంట్లో ఇచ్చింది. అప్పుడు అక్కడి వారిచ్చిన డబ్బులతో టికెట్ కొనుక్కుని ఈనెల 18న ఇంటి కి  చేరాను. నేను సౌదీకి వెళ్లికి కూడగట్టుకున్నది కష్టాలు, కన్నీళ్లే! కుటుంబానికి అప్పు భారం మిగిల్చాను. ప్రస్తుతం కుటుంబాన్ని మోయలేని స్థితిలో ఉన్నాను. ప్రభుత్వం సాయమందించాలి’ అని వేడుకున్నాడు జనార్దన్.
 
 బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించాను
 కుటుంబ పెద్ద దిక్కు సౌదీకి వెళ్లి ఏమి డబ్బులు పంపలేక పోయాడు. కుటుంబాన్ని పోషించేందుకు రాత్రి, పగలు బీడీలు చుట్టాను. అత్తమామతో పాటు ఇద్దరు పిల్లల్ని పోషించాల్సిన భారం నా మీదే పడింది. పూట తప్పించి పూట తింటూ కష్టపడ్డాను. ఇప్పుడు నా భర్త వచ్చిన ఆనందం ఎంతో ఉంది. ఇటు చేసిన అప్పులు తీరేది ఎలా అని దిగాలు కూడా ఉంది. ప్రభుత్వం మా కుటుంబానికి సాయం అందించాలి.
 -సావిత్రి, గల్ఫ్ బాధితుని భార్య, ధర్పల్లి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement