general store
-
ఆ నిర్ణయమే సవితని విజేతగా నిలబెట్టింది
ఆది లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, విద్యా లక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి... మనకు తెలిసిన అష్ట లక్ష్ములు. వీరి జాబితాలో చేర్చాల్సిన మరో లక్ష్మి కథ ఇది. ఆ లక్ష్మి పేరు శ్రమలక్ష్మి. ఆమె నలభై ఏళ్ల గృహిణి. పేరు సవిత లబాడే. ఊరు నాసిక్. చదివింది ఎనిమిదో తరగతి. ఇద్దరు పిల్లలు. భర్త ఆత్మారామ్ చిన్న రైతు. వాళ్లకున్నది రెండున్నర ఎకరాల పొలం. వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యత మొత్తం భర్త స్వయంగా చూసుకునేవాడు. ఇల్లు చక్కబెట్టుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం తప్ప మరేమీ తెలియని ఇల్లాలామె. విధి వక్రించింది. భర్త గుండెపోటుతో మరణించాడు. అతడు చేసిన అప్పులన్నీ అతడు పోయిన తర్వాత బయటపడ్డాయి. భర్త పోయిన నెల రోజులకే కో ఆపరేటివ్ బ్యాంకుల వాళ్లు తలుపుకొట్టారు. అయోమయం నుంచి తేరుకునే లోపే ఇంటి గోడకు నోటీస్ అంటించారు. ఆ తర్వాత ఏడాది లోపు ఒక్కటొక్కటిగా అప్పుల లెక్కలన్నీ వరుస కట్టాయి. అంతా చూస్తే ఏడు లక్షల రూపాయలు. అప్పుకు వడ్డీ రోజురోజుకూ పెరిగిపోతోంది. భర్త పోయిన దుఃఖం ఒక కంట్లో నీరై కారుతోంది. అతడు చేసిన అప్పులు కన్నీళ్లుగా మరో కంట్లో ఉబికి వస్తున్నాయి. ఆ క్షణంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను నేడు విజేతగా నిలబెట్టింది. బలి తీసుకున్న ద్రాక్ష తీగ సవిత భర్త పొలంలో ద్రాక్షతోటను పెంచేవాడు. ద్రాక్ష సాగు ఎలాగో ఆమెకు ఏ మాత్రం తెలియదు. పైగా భర్తను బలి తీసుకున్న ద్రాక్ష తీగను జీవితంలో తాక కూడదనుకుంది. దాంతో పొలంలో కూరగాయల సాగు చేయడానికి సిద్ధమైంది. అది మంచి లాభాల్నే ఇచ్చింది. నెలకు పదివేలు... ఇద్దరు పిల్లలతో బతకడానికైతే సరిపోతాయి. అయితే అప్పులు తీర్చేదెలా? ఇంకా ఏదో చేయాలి. అప్పుల నుంచి బయటపడితే, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అనుకుంది. తాను ఇష్టంగా ధరించే బంగారు దండను అమ్మేసి పెద్ద అప్పులు తీర్చింది. కూరగాయలతోపాటు సోయాబీన్, గోధుమ పంటలు వేసి బతుకు బండిని లాగుతోంది. ఒక స్నేహితురాలి సలహాతో సవిత మసాలా దినుసుల తయారీకి సిద్ధమైంది. మెషీన్ కొనాలంటే డబ్బు కావాలి. పొలం మీద వచ్చిన డబ్బు కొంత చేతిలో ఉంది. మిగిలిన బంగారం కూడా అమ్మేసి 65 వేలకు మెషీన్ కొన్నది. నిజానికి అది ఒక సాహసమే. అయితే ఆ ప్రయత్నం ఆమెను పరీక్ష పెట్టలేదు. మసాలా పొడుల తయారీ విజయవంతంగా నడిచింది. ఆమె కుటీర పరిశ్రమ 2015 నాటికి నెలకు అరవై వేల సంపాదనకు చేరింది. ఈ లోపు పొలంలో మరో ప్రయోగం... చెరకు పంటకు పని తక్కువ, ఏడాది కి రెండుసార్లు పంట వస్తుంది. కష్టాల కడలిని ఈదుతున్న సవితను చెరకు పంట కూడా అర్థం చేసుకున్నట్లుంది. ఒక సీజన్‌కి యాభై వేల రాబడి తో తీపిని పంచింది. మసాలా పరిశ్రమ పని ఫిబ్రవరి నుంచి జూలై వరకే ఉంటుంది. పొలం మీద రాబడి కూడా సీజన్లోనే వస్తుంది. అలా కాకుండా ప్రతి నెలా డబ్బు కనిపిస్తే తప్ప జీవితం గాడిన పడదనుకుందామె. దాంతో జనరల్ స్టోర్ ప్రారంభించింది. ఇప్పుడు సవిత పంట మీద, మసాలా పొడుల పరిశ్రమ, జనరల్ స్టోర్ అన్నింటి మీద సరాసరిన నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని చూస్తోంది. ఉదయం ఐదింటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పడుతున్న శ్రమకు దక్కుతున్న ప్రతిఫలం అది. ఆమె కొడుకు ఎలక్ట్రానిక్స్‌లో కోర్సు చేస్తున్నాడు. కూతురు పోలీస్ సర్వీస్‌లో చేరడానికి శిక్షణ తీసుకుంటోంది. స్వశక్తితో జీవించాలి ‘‘మసాలా పొడి మెషీన్ నడిపేటప్పుడు కళ్లలో పడుతుంది, ఒంటి మీద పడి చర్మం మండుతుంది. ఆ మంటలకు భయపడి మెషీన్‌ని అమ్మేద్దాం అని కూడా అనిపించింది. నేను ఎదుర్కొన్న బాధలతో పోలిస్తే ఇవి పెద్దవి కాదని మనసు గట్టి చేసుకున్నాను. జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే. ఆడవాళ్లు సున్నితంగా, శ్రమ లేకుండా హాయిగా జీవించేయాలనుకోకూడదు. స్వశక్తితో జీవించాలి. కష్టాలెదురైనప్పుడు నిశ్శబ్దంగా ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్ని కలిగి ఉండాలి’’ అంటోంది సవిత. -
కిరాణా షాపులో మద్యం..
విజయనగరం, బలిజిపేట: నూకలవాడలో కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో కూడా వారికి మద్యం ఎలా వస్తుందని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బొబ్బిలి ఎక్సైజ్ సీఐ విజయకుమార్‌ను వివరణ కోరగా మండలంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగడం లేదని తెలిపారు. -
పట్టుకున్నారు..
కాకినాడ రూరల్:కాకినాడ పట్టణంలోని రాజాజీ వీధిలోని చందా కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5.62 లక్షల విలువైన వంట నూనెలు, పంచదార, వేరుశనగ గుళ్లను సీజ్ చేసినట్టు కాకినాడ పౌరసరఫరాల శాఖ సహాయ అధికారి పీతల సురేష్ శుక్రవారం వివరించారు. వ్యాపారులు ఏ డోర్ నంబర్ పేరుతో గోడౌన్లు రిజిస్టేషన్ చేయించుకున్నారో అదే గోడౌన్లో సరుకు నిల్వ ఉంచుకోవాల్సి ఉండగా.. చందా కిరాణా షాపు యజమాని కాంతిలాల్ చౌదరి ఒక గోడౌన్‌కు అనుమతి తీసుకొని మరో రెండు గోడౌన్లకు అనుమతులు లేకుండా వంటనూనెలు, పంచదార, వేరుశనగ గుళ్లు నిల్వ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ గోడౌన్లకు కనీసం లైసెన్సు కోసం దరఖాస్తు చేయలేదన్నారు. అనుమతులు లేకుండా గోడౌన్లో స్టాకులను అక్రమంగా ఉంచినందుకు నిత్యవసర వస్తువుల చట్టం 1955 సెక్షన్6ఏ ప్రకారం కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టుకు నివేదిక పంపినట్టు తెలిపారు. అనుమతులు లేని గోడౌన్లలో 6785 లీటర్ల వంట నూనెలు, 644 కిలోల పంచదార, 250 కిలోల వేరుశనగ గుళ్లు నిల్వ ఉన్నాయని, వీటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.5,62,336 ఉంటుందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి బహిరంగ మార్కెట్ అధిక ధరలకు విక్రయించేందుకు వీలుగా ఈ అక్రమ నిల్వలు ఉంచినట్టు గుర్తించామని సురేష్ తెలిపారు. సీజ్ చేసిన స్టాకును అశోక జనరల్ స్టోర్స్ యజమాని కాంతిలాల్జైన్కు భద్రత నిమిత్తం అప్పగించినట్టు వివరించారు. వంట నూనెలు, పంచదారకు సంబంధించి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా సక్రమంగా రికార్డులు రాయకపోయినా, అనుమతిలేని గోడౌన్లో నిత్యవసర సరుకులు నిల్వ ఉంచినా సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో కాకినాడ అర్బన్, కరప, కాకినాడ రూరల్ సివిల్ సప్లై అధికారులు ఎం.సూరిబాబు, పి.సుబ్బారావు, ఎ. తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
సిగరెట్ కావాలని వచ్చి గొలుసు చోరీ
కిరాణా దుకాణం యజమానురాలి నుంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు ఇబ్రహీంపట్నం: సిగరేట్ కావాలంటూ బైక్‌పై కిరాణా దుకాణానికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు షాపు యజమానురాలి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుపోయారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సాహెబ్‌గూడకు చెందిన వట్నాల పుష్పలత(35) స్థానికంగా ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం ఇంటిగంట సమయంలో ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై ఆమె దుకాణం వద్దకు వచ్చారు. సిగరెట్ కావాలని అడిగారు. దీంతో పుష్పలత సిగరెట్ ఇచ్చేంతలోపు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలో, తాజాగా సోమవారం సాహెబ్‌గూడలో చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
ఖండకర కార్పాసకూర్పాసం అంటే...?
నవ్వింత: ఈ మధ్య మా రాంబాబుగాడు బనీను మీదే ఉంటున్నాడు. దగ్గర్లోని కూరగాయల షాపు, కిరాణ స్టోరుకు వెళ్లాలన్నా అదే డ్రస్‌కోడు. అందుకే ఓ రోజు తెగించి వాడికి సలహా ఇచ్చా. ‘‘లుంగీ, బనీను మీద ఇంటి ముందుకొచ్చే బండ్ల దగ్గరకు వెళ్లడం అయితే పర్లేదు గానీ... బజారుకు వచ్చేటప్పుడైనా బట్టలు కట్టుకుని రారా’’. ఊహించినట్టే వాడు ఆవేశపడ్డాడు. ‘‘బనీను గొప్పదనం నీకు తెలియట్లేదురా. కొంతమంది బనీను లేకుంటే అసలు చొక్కా వేసుకోనే వేసుకోరు. ఒకవేళ అలా వేసుకోవాల్సి వచ్చినా వాళ్లు సంతృప్తిగా ఉండలేరు. మత్తుమందు కంటే ఎక్కువగా అడిక్టు చేయించే వస్త్రవిశేషం, విశేషవస్త్రం బనీను’’. ‘‘బనీను గొప్పదేమిట్రా నీ ముఖం’’ అన్నాను. ‘‘బనీనంటే ఏమిటి? బిడ్డపుట్టగానే బనీను గుడ్డలో చుట్టి ఉంచుతారు. పుట్టుకతో మొదలైన ఈ బనీను బంధం... పుడకల దగ్గర పోవాల్సిందేరా. అంతగా తోడొచ్చే వస్త్రం మరోటి లేదు. అంతెందుకు పైన తొడిగే షర్టు ఓ భవనం అయితే దానికి పునాది బనీను. అందుకే కొందరు బనీనునూ, అది ఇచ్చే కంఫర్టునూ వదల్లేక దానికే కాలరొకటి కుట్టించి, ‘టీ షర్ట్’ అని ముద్దుపేరు పెట్టుకున్నారు’’ అన్నాడు. ‘‘ఒరే రాంబాబూ, రోజూ క్యాజువల్‌గా తొడుక్కునే దానికి ఇంత రాద్ధాంతం ఏమిట్రా! టాపిక్ వదిలెయ్’’ అన్నాన్నేను. కానీ వాడు అంత తేలిగ్గా వదలడానికి ఇష్టపడలేదు. ‘‘బనీను తెలుగు సినిమా రంగానికి సేవ చేస్తుంటుందిరా. హీరో ఇమేజ్ను కాపాడటానికి తోడ్పడుతుంది’’ ‘‘బనీనా... హీరో ఇమేజ్నా’’ అన్నాను సంభ్రమంగా. ‘‘హీరో తన అల్లరి మూకతో ఆగడాలు చేస్తూ పోలీసులకు పట్టుబడతాడనుకో. అప్పుడు పోలీసులు హీరోకు తోడున్న తోకబ్యాచీవాళ్లందర్నీ చారల డ్రాయర్ మీద నగ్నంగా నిలబెడతారు. కానీ హీరోకు మాత్రం బనీనును ఉంచి వాడి ఇమేజు డ్యామేజు కాకుండా కాపాడతారు. ఇక నువ్వు చాలా విలువైన జాతివజ్రాలనూ, మేలురత్నాలనూ బంగారుపళ్లెంలో పోసి రాచకొలువుకు తెస్తున్నావనుకో. అప్పుడు ఒక అందమైన నగిషీల గుడ్డ కప్పి తెస్తావు చూడు... అలాంటిదే హీరో బనీను. జాతివజ్ర, మేలిరత్న దర్శన సమయంలో సదరు జలతారు వస్త్రాన్ని పక్కకు తొలగించినట్టే... సినిమా చివర్లో హీరో కూడా బనీను విప్పేసి తన సిక్స్‌ప్యాక్ చూపిస్తాడన్నమాట. ఇది కండలున్న హీరోకు! ఒకవేళ వాడు కండల్లేని హీరో అనుకో. ఇంటి సీన్లూ, పెరటి సీన్లలాంటి క్యాజువల్ సన్నివేశాల్లో వాడి మానరక్షణతో పాటు మళ్లీ ఇమేజు సంరక్షణకు తోడ్పడుతుంది. అది మన సంస్కృతి’’ అంటూ ఒక థీసిస్ సమర్పించాడు. ‘‘బనీను సంస్కృతేమిట్రా బాబూ. అది ఇంగ్లిషు వాళ్లు నేర్పిన అలవాటు కాదా?’’ అని ఆశ్చర్యంగా అడిగాన్నేను. ‘‘కాదు... ప్రబంధమహాకవి శ్రీనాథుడేమన్నాడు? ‘కుల్లాయుంచితి... మహాకూర్పాసమున్ తొడిగితిన్’ అన్లేదా? మహాకూర్పాసమంటే ఏమనుకున్నావ్. గొప్ప బనీను అని అర్థం తెల్సా? అలా ఎన్నో రకాలు’’ అన్నాడు వాడు. ‘‘బనీన్లలో రకాలా?’’ ‘‘మహాకూర్పాసమంటే బహుశా శ్రీనాథుడూ దాని గొప్పదనాన్ని అర్థం చేసుకొని, మహా అనే విశేషణాన్ని చేర్చి ఉంటాడు. ఆయన చేతులున్న బనీను వేసుకుని ఉంటాడు. చేతుల్లేని బనీనును ‘ఖండకర కార్పాసకూర్పాసం’ అని మన తెలుగు సార్ చెప్పింది నీకు గుర్తులేదా? మొన్న మొన్నటి వరకూ షావుకార్లూ, మోతుబర్లూ సైనుగుడ్డను బనీనుగా కుట్టించి డబ్బులూ అవీ జాగ్రత్తగా పెట్టుకోడానికి దాన్లోనే కలిసిపోయి కనిపించని విధంగా పెద్ద పెద్ద జేబులు పెట్టించేవారు. పైన షర్టేసేవారు. మామూలు బడుగు జనాలైతే పై అంగీలేకుండా వాటినే వేసుకునేవారు’’ అంటూ బనీన్ల చరిత్ర, వాటి ప్రాధాన్యం గురించి లెక్చరిచ్చాడు. ‘‘ఆయనేదో ఆరోజు ఖండకరకార్పాసమంటూ హాస్యానికి అన్నారు. నువ్వేమో సీరియస్‌గా తీసుకుంటున్నావ్’’ పిచ్చి వదిలిద్దామని నేను లోతుగా గిల్లితే, అసలు రహస్యమేమిటో చెప్పాడు. ‘‘ఆ టీవీలో ప్రకటన చూళ్లేదా? అమ్మాయిల్ని కొందరు ఆకతాయీలు ఏడిపిస్తుంటే ఎలక్ట్రీషియన్ బనీన్‌తో ఎగిరి దూకుతాడు. ఆ ఎలక్ట్రీషియన్‌ను సదరు అమ్మాయిలు మోహిస్తారు. ఇంకోటి చెప్పనా? ఫలానా సెంటు వాడితే అమ్మాయిలు వెంటపడతారని చూపిన ప్రకటన చూసి అది వాడా. నిజంగానే వెంటపడ్డారు కొట్టడానికి! అందుకే సెంటు వర్కవుటు కాలేదని బనీను మీద పడ్డా. మన ఫిట్‌నెస్‌కు విట్నెస్గా ఇది నిల్చి ఎప్పటికైనా ఓ అమ్మాయి లవర్‌గా దొరుకుతుందేమోరా’’ అంటూ తన ఆశను బయటికి చెప్పాడు. ‘‘మరి చేతిలో ఆ కటింగ్ ప్లేయర్ ఏమిట్రా?’’ అంటే, ‘‘అమ్మాయిలకు కటింగ్ ఇవ్వాలంటే ఈమాత్రం ఉండాలి’’ అన్నాడు. - యాసీన్ -
ఎడారిలో నాలుగేళ్లు
ధర్పల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రానికి చెందిన దామోదర్ జనార్దన్ కుటుంబ పోషణ కోసం కిరాణ షాపు నడుపుకునే వాడు. ఎలాంటి లాభాలు రాకపోగా అప్పులు పెరిగి పోయాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలి. పిల్లలకు మంచి విద్య అందించాలి. ఇందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లడమే మార్గమని భావించాడు. ఇందుకోసం లక్ష రూపాయలు అప్పు చేసి ఏజెంట్ చేతిలో పెట్టా డు. అయితే సౌదీకెళ్లిన తర్వాత తెలిసింది తాను మోసపోయానని. అక్కడ పడిన వెతలు జనార్దన్ మాటల్లోనే..‘గల్ఫ్ దేశానికి వెళ్తే బతుకు బాగుపడుతుందనుకున్నాను. మంచి జీతం వస్తుందని ఆశపడ్డాను. నెలనెలా ఇంటికి పైసలు పంపి పిల్లలను బాగా చదివించాలనుకున్నాను. సౌదీ వెళ్లేందుకు నిర్ణయించుకుని ఏజెంటును కలిశాను. అతను కంపెనీ వీసా ఇప్పిస్తానని, కపిల్ ఇంట్లో వాచ్‌మన్ ఉద్యోమని చెప్పాడు. మంచి జీతం ఉంటుందన్నాడు. అయితే లక్ష రూపాయలు ఖర్చవుతాయన్నాడు. తెలిసిన వారినల్లా అడిగి లక్ష రూపాయలు జమచేసి ఏజెంట్ చేతిలో పెట్టాను. ఇది నాలుగేళ్ల కిందటి మాట. నేను సౌదీలోని దోఆద్మీకి వెళ్లగా అక్కడి నుంచి అరబ్బులు తీసుకెళ్లి ఎడారిలో విడిచిపెట్టారు. ఒంటెలను మేపాలని చెప్పి వెళ్లి పోయారు. వారానికి ఓసారి వచ్చి ఎండిన రొట్టెలు వేసి వెళ్లేవారు. చేసిన పనికి జీతం ఇచ్చేవారు కాదు. కోసుల దూరం నడిచి తొలుత ఇంటికి ఫోన్ చేసి కష్టాలు చెప్పుకొనే వాడిని. ఎంత చెప్పినా వారేం చేస్తారు. ఇటు భార్య పిల్లలు, అటు నేను ఏడుస్తూనే కాలం వెళ్లదీశాం. మూడేళ్ల తర్వాత మరో ఎడారి ప్రాంతానికి అరబ్బులు తీసుకెళ్లారు. అక్కడ ఫోన్ కూడా లేకపోయింది. దీంతో ఏడాది పాటు భార్యాపిల్లలకు ఫోన్ చేయలేకపోయాను. నా జాడ తెలియక నా తల్లిదండ్రులు గంగవ్వ, రాజన్న, భార్య సావిత్రి ఇద్దరు పిల్లలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒక దశలో వారు మంచం పట్టారు. ఈ పరిస్థితుల్లో కంపెనీ వీసా లేని వారు స్వదేశాలకు వెళ్లి పోవాలని సౌదీ ప్రభుత్వం నితాఖత్ జారీ చేసింది. దీంతో నాకు విముక్తి లభించినట్లయ్యింది. అప్పటి వరకు చేసిన పనికి జీతం కూడా అరబ్బులు ఇవ్వ లేదు. వారిని ప్రశ్నించే ధైర్యం నాకు లేదు. స్వదేశానికి రావాలంటే సౌదీకి చెందిన రెండు వేల రియాళ్లు చెల్లించాలి. ఇంటికి చేరేందుకు డబ్బులు లేక అల్లాడి పోయాను. సౌదీలోనే ఓ కంపెనీలో పనిచేసే తెలుగు వారిని డబ్బులు అప్పుగా ఇవ్వాలని వేడుకొన్నాను. అప్పు ఇచ్చేందుకు వారు ఒక షరతు పెట్టారు. వారి ఊళ్లో ఉన్న బంధువులకు డబ్బులు చెల్లించాక నాకు అప్పు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని నా భార్యకు ఫోన్లో చెప్పగా.. ఆమె * 30 వేలు అప్పుచేసి సౌదీలో నాకు అప్పు ఇచ్చే వారి ఇంట్లో ఇచ్చింది. అప్పుడు అక్కడి వారిచ్చిన డబ్బులతో టికెట్ కొనుక్కుని ఈనెల 18న ఇంటి కి చేరాను. నేను సౌదీకి వెళ్లికి కూడగట్టుకున్నది కష్టాలు, కన్నీళ్లే! కుటుంబానికి అప్పు భారం మిగిల్చాను. ప్రస్తుతం కుటుంబాన్ని మోయలేని స్థితిలో ఉన్నాను. ప్రభుత్వం సాయమందించాలి’ అని వేడుకున్నాడు జనార్దన్. బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించాను కుటుంబ పెద్ద దిక్కు సౌదీకి వెళ్లి ఏమి డబ్బులు పంపలేక పోయాడు. కుటుంబాన్ని పోషించేందుకు రాత్రి, పగలు బీడీలు చుట్టాను. అత్తమామతో పాటు ఇద్దరు పిల్లల్ని పోషించాల్సిన భారం నా మీదే పడింది. పూట తప్పించి పూట తింటూ కష్టపడ్డాను. ఇప్పుడు నా భర్త వచ్చిన ఆనందం ఎంతో ఉంది. ఇటు చేసిన అప్పులు తీరేది ఎలా అని దిగాలు కూడా ఉంది. ప్రభుత్వం మా కుటుంబానికి సాయం అందించాలి. -సావిత్రి, గల్ఫ్ బాధితుని భార్య, ధర్పల్లి