మరణం లేని లవణం
నివాళి
లవణంను పత్రికలు ప్రముఖ నాస్తికుడు అని వర్ణిం చడం ఆయన విలక్షణమైన వ్యక్తిత్వానికి ఏమాత్రం పరిచయం కాదు. ఆయన సుదీర్ఘ జీవనయానంలో నాస్తికత ఒక అంశం మాత్రమే. వకుళాభరణం రాసి నట్టు దాన్ని ఒక మతం వలె ఆయన ప్రచారం చేయ లేదు. పక్కవాడి గురించి ఆలోచించే లక్షణం, సమా జం గురించి పరితపించే లక్షణం లవణం. కుల మతాలు ఉండరాదని ప్రతి వాడూ పెదాల కొసల నుంచి మాట్లాడే వాడే కాని కులతత్వాన్ని వదిలిం చుకున్నవాడు మనకు ఎక్కడో గాని కనిపించడు. ఆ అరుదైన వ్యక్తి లవణం.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడవలసిన చారిత్రిక సత్యాన్ని విజయవాడ నడిబొడ్డు నుంచి చాటి చెప్పి న ఆలోచనాశీలి లవణం. తెలంగాణ, ఆంధ్రా ప్రాం తాల మధ్య సాంఘిక సాంస్కృతిక బాంధవ్యాలు ఏర్పడలేదని చరిత్ర సూచిస్త్తున్నదన్నారు లవణం. ఆవేశపూరితమైన ఈ సమస్య వెనుక మూలాల్లోకి వెళ్లిన వ్యక్తిత్వం ఆయనది.
ఆంధ్రా నుంచి తెలంగా ణకు వలస వెళ్లి విస్తారమైన భూములు కొని, విద్యా వ్యాపారసంస్థలు నెలకొల్పి, పరిశ్రమలు స్థాపించి, భారీ ఎత్త్తున పెట్ట్టుబడులు పెట్టడం తెలంగాణవా సుల్లో అభద్రతా భావాన్ని పెంచింది. ఎన్ఆర్ ఐలు కూడా ఆ ప్రాంతంలో నిధులు దింప డంతో తమను ఆంధ్రా వారు దోచు కుంటున్నారన్న అభిప్రాయం కలిగిం దని ఆయన వివరించారు. నిరంకుశ ని జాం మీద పోరాడిన తెలంగాణ నా యకుడు బూర్గుల రామకృష్ణారా వుకు విశాలాంధ్రకు తొలి ముఖ్య మంత్రిగా ఉండే అవకాశం ఇవ్వా ల్సిందని, అప్పుడు మేం మీతో ఉన్నామని ఆం ధ్రులు అంటున్నారనే భావన ఏర్పడి ఉండేదన్నారు.
తెలంగాణతో లవణం లోతైన నిజమైన అను బంధం కలిగి ఉన్నారు. ఆయన తెలంగాణకు భూ ముల వ్యాపారం చేయడానికి రాలేదు. చదువు అమ్మి పేదలను కొల్లగొట్టాలని రాలేదు. సేవాభిలా షతో, సంస్కరణాభిలాషతో వచ్చారు. మూఢ నమ్మ కాలపైన అంటరానితనం మీద ఆయన సాగించిన పోరాటాలకు తెలంగాణ జిల్లాలు వేదికైనాయి. భార్య హేమలతతో కలిసి నిజామాబాద్, మెదక్ జిల్లాలలో జోగిని వ్యవస్థను సంస్క రించడానికి లవణం తపించారు, శ్రమించారు. ‘నేను మూడు తరాల తెలంగాణ ప్రజలతో కలిసి పనిచేశా ను. అక్కడ సగటు మనిషి నాడి నా కు తెలుసు. తెలంగాణను వ్యతిరే కించే వారు నిజానికి ఆ ప్రాంతంలో తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరిం చాలనే దురాశ కలిగిన వారే’ అని విశ్లేషించిన ఆలోచనాపరుడు లవణం. చాలా మంది అందంగా చెప్పుకునే సమైక్య నినాదం ఒక డొల్ల అనీ, పూర్తి ఖాళీదని లవణం తేల్చారు.
‘తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం అంటే కేవలం రాజకీయ విభజన మాత్రమే. దాన్ని మనం ఒప్పు కోవాలి. రెండు ప్రాంతాల (ఇప్పుడు రెండు రాష్ట్రా ల) మధ్య సామాజిక సాంస్కృతిక సమైక్యత పెరగ డానికి ఇప్పటికైనా కృషి చేయాలి’ అన్నారాయన. లవణం తెలంగాణవాది కాదు. ఆయన అసలైన సమైక్యవాది. తెలంగాణను వ్యతిరేకించే రాజకీయ కారణాలన్నీ ఇప్పుడు అంతరించాయి కనుక, లవ ణం మాటలలో లోతును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవలసిన అవసరం ఏర్పడింది.
నేరగాళ్ల వంశాలంటూ ఉండవు. పరిస్థితులు, పేదరికం, అవమానాలు దోపిడీ మంచి వారిని కూడా నేరస్తులను చేస్తాయి అనే అవగాహనతో ఆం ధ్రప్రదేశ్‌లో క్రిమినల్ ట్రైబ్స్‌గా పేరొందిన వర్గాల ప్రజలను సాధారణ జీవన స్రవంతిలో ప్రవేశ పెట్ట డానికి లవణం చేసిన కృషి సామాన్యమైంది కాదు. లవణం లేకపోవడం నేరస్తుల వంశం అని నిందలు భరించే కుటుంబాలకు తీరని నష్టం.
మానవతావాదులకు అండగా ఆలోచించే ఆద రవు కనుమరుగైపోయింది. తన మనసు తెలిసిన మంచి మిత్రుడిని తెలంగాణ కోల్పోయింది. బతికి నంత కాలం సమాజం వైపే చూసిన లవణం కళ్లు ఓ ఇద్దరికి చూపునివ్వబోతున్నాయి ఆయన కళ్లు దానం చేశారు కనుక. ఆయనలో అంగాంగం, అణువణువు మానవ శరీర పాఠాలకు సజీవ సాక్ష్యాలు కాబోతు న్నాయి, వైద్య కళాశాలకు శరీరాన్ని దానం చేసు కున్నారు కనుక. కాబట్టి లవణానికి మరణం లేదు.
మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com