ఇక రైతు సమగ్ర సర్వే
సాక్షి, హైదరాబాద్: రైతుల సమగ్ర సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. రైతుల సమగ్ర సమాచార సేకరణ జరిపిన తర్వాత.. వాటి ఆధారంగా భవిష్యత్తులో వివిధ పథకాలను రూపొం దించాలనేది ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా పంటకాలనీల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్లైన్లో చెల్లింపులు, ఆహార శుద్ధిపరిశ్రమల ఏర్పాటు, డీబీటీ పద్ధతిలో సబ్సిడీ చెల్లింపు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల అమలుకు ఈ సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తుంది.
వచ్చే నెల 15వ తేదీ నాటికి రైతుల సమగ్ర వివరాలను సేకరించాలని మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతుల సమాచార సేకరణ జరపాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్లకు లేఖ రాశారు. వేసవి కాలంలో ఉదయం 8నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4నుంచి 6 గంటల వరకు ప్రతీ రైతు వద్దకు వెళ్లి సమాచారాన్ని సేకరించాలని, సేకరించిన సమాచారాన్ని మధ్యాహ్న సమయంలో అప్లోడ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏ, బీ పార్టుల ప్రకారం సమాచారాన్ని సేకరించాలని ఆయన ఆదేశించారు.
పార్ట్–ఏలో సేకరించాల్సిన అంశాలు
రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతు పేరు, పట్టాదారు పాసు పుస్తకం నెంబరు, సర్వే నెంబర్ వివరాలు
ఆధార్ కార్డులో ఉన్నట్లుగానే రైతు పేరును నమోదు చేయాలి. రైతు తండ్రి లేదా భర్త పేరు కూడా ఉండాలి.
రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆధార్ కార్డు నెంబర్. దాని జిరాక్స్ కాపీ కూడా జత చేయాలి. ఆ జిరాక్సు కాపీపై రైతు సంతకం లేదా వేలి ముద్ర తీసుకోవాలి.
ఆధార్‌కార్డులో ఉన్న పుట్టినతేదీ నమోదు చేయాలి. ఒకవేళ పుట్టిన తేదీ కాకుండా పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే ఏ రైతుకైనా జులై ఒకటినే వారి పుట్టిన తేదీగా పేర్కొనాలి.
రైతు మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. రైతుబంధు పథకానికి ఇచ్చిన నెంబర్‌ను తీసుకోవాలి.
బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్
రైతుబీమా కోసం సేకరించిన వివరాల ప్రకారం సామాజిక హోదా
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ల వారీగా రైతుకు ఉన్న భూమి వివరాలు
రైతుబీమా సందర్భంగా తీసుకున్న ఎల్ఐసీ ఐడీ నెంబరు
పార్ట్–బీలో సేకరించాల్సిన అంశాలు
రైతు చదువు వివరాలు. నిరక్షరాస్యుడా, పదో తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, ఆపై వరకు చదివాడా వివరాలు
తనకున్న భూమి సాగుకు యోగ్యమైనదేనా కాదా?
వ్యవసాయ భూమికి సాగునీటి వసతి ఉందా? ఉంటే ఎలాంటి వసతి కలిగి ఉన్నాడు. ఎంత భూమి సర్వే నెంబర్ల వారీగా చాలా స్పష్టంగా వివరంగా సమాచారం ఉండాలి.
సాగునీటి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసుకున్నాడా?
సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకున్నాడా?
నేల స్వభావం, భూసార కార్డులు ఉన్నాయా?
ఎలాంటి పంటలు పండిస్తున్నాడు. కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు వంటి వాటిని గతేడాది ఏమైనా వేశారా?
2018–19 వ్యవసాయ సీజన్లో వేసిన పంటల వివరాలు
రాబోయే ఖరీఫ్‌లో ఎలాంటి పంటలు వేయడానికి రైతు సన్నద్ధమయ్యాడన్న వివరాలు. ఎందుకంటే వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు రైతుకు సరఫరా చేయడానికి అవసరమైన ప్రణాళిక ఏర్పాటు చేయడానికి ఈ వివరాలు సేకరించాలని సూచించారు.
వ్యవసాయ యంత్రాలేమైనా ఉన్నాయా? వరి కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు ఉన్నాయా?
పంట రుణం తీసుకున్నాడా లేదా?
పంటలకు బీమా ప్రీమియం చెల్లించారా లేదా?
2018–19లో పండించిన పంటను ఎలా అమ్ముకున్నారు? దళారులకు అమ్ముకున్నారా? ప్రభుత్వ సంస్థలకు అమ్ముకున్నారా?
ఆహారశుద్ధి పరిశ్రమలు పెడితే బాగుంటుందా? బాగుంటే ఎలాంటిది పెట్టాలని రైతులు భావిస్తున్నారో తెలుసుకోవాలి.
రైతు ఉత్పత్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా లేదా?
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా లేదా?
రైతుకు మొబైల్ నెంబర్ ఉందా లేదా?
ఒకవేళ రైతుకు స్మార్ట్‌ఫోన్ ఉంటే అందులో తప్పనిసరిగా కిసాన్ సువిధ, పంటల యాజమాన్య యాప్‌లను ఏఈవోలు డౌన్లోడ్ చేయాలని ప్రత్యేకంగా సూచించారు.
కిసాన్ పోర్టల్ నుంచి రైతులకు ఎస్ఎంఎస్లు వస్తున్నాయా లేదా?
పశు సంపద ఏ మేరకు ఉంది? వాటి వివరాలు.
సేంద్రీయ వ్యవసాయంపై రైతు ఆసక్తిగా ఉన్నారా? అవగాహన ఉందా లేదా?