నీటి పారుదల పథకాలకు మరిన్ని నిధులు
ఉప ఎన్నికలపై బీజేపీ వ్యూహం
విభేదాలు వీడి... విజయానికి కృషి చేయాలని నేతల పిలుపు
ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు తీర్మానం
జెడ్పీ ఎన్నికల సన్నాహాలపై చర్చ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవడం ద్వారా విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సమావేశం తీర్మానించింది. స్థానిక మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి, విజయానికి అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. రెండు స్థానాల్లో పార్టీ బలంగా ఉన్నందున, మూడో స్థానాన్నీ గెలుచుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలని తీర్మానించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టాల్సిన ఆందోళన గురించి కూడా సమావేశంలో చర్చించారు.
అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్, లోపించిన శాంతి భద్రతలు, పెరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. రాబోయే జిల్లా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలపై కూడా చర్చ జరిగింది. పదాధికారుల సమావేశం అనంతరం పార్టీ జిల్లా శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు జగదీశ్ శెట్టర్, కేఎస్. ఈశ్వరప్ప ప్రభృతులు పాల్గొన్నారు.
శాంతి భద్రతలు విచ్ఛిన్నం
రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, ప్రభుత్వం నిద్ర పోతోందని జోషి, ఈశ్వరప్పలు విమర్శించారు. పదాధికారుల సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ హోం మంత్రికి ప్రత్యేకంగా సలహాదారును నియమించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. కేజే. జార్జ్ బదులు ఆయన సలహాదారు కెంపయ్య హోం మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి తాండవిస్తున్నప్పటికీ, మంత్రులు పీడిత ప్రాంతాలను సందర్శించలేదని వారు విమర్శించారు.