fasal beema
-
ధీమా ఇవ్వని ఫసల్‌బీమా
– దారుణంగా దెబ్బతిన్న పప్పుశనగ - రూపాయి కూడా అందని పరిహారం – ఎంతమంది ప్రీమియం చెల్లించారో చెప్పలేకపోతున్న అధికారులు అనంతపురం అగ్రికల్చర్ : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై).. దేశమంతా ఒకే ప్రీమియం ఒకటే బీమా పథకం.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2016 మే నెలలో ప్రవేశపెట్టాయి. ఫసల్ బీమాతో రైతుల తలరాతలు మారిపోతాయని గొప్పలు చెప్పారు. ఇన్ని సంవత్సరాలకు మంచి బీమా పథకం వచ్చిందని రైతులు కూడా చాలా ఆనందపడ్డారు. అందులోనూ అనంతపురం జిల్లా లాంటి కరువుపీడత రైతుల బతుకులకు భరోసా లభిస్తుందని ఆశించారు. అయితే ఫసల్‌బీమా కూడా పంటల బీమా, వాతావరణ బీమా పథకాల మాదిరిగానే రైతులను అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తోంది. రబీలో ఫసల్ బీమా.. రబీకి సంబంధించి జిల్లాలో వరి, జొన్న, పప్పుశనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు ఫసల్ బీమా వర్తింపజేశారు. ఖరీఫ్‌లో అయితే రైతు వాటాగా 2 శాతం, రబీ పంటలకైతే 1.5 శాతం ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉంది. ఇందులో రబీకి సంబంధించి వరి హెక్టారుకు రూ.33,750, జొన్నకు రూ.20 వేలు, పప్పుశనగకు రూ.21,250, వేరుశనగకు రూ.45 వేలు, పొద్దుతిరుగుడుకు రూ.25 వేలు బీమా పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇవీ ప్రయోజనాలు.. వర్షాభావ పరిస్థితులతో పాటు అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను, తీవ్ర తుఫాను, టోర్నడోలు, వరదలు, నీట మునగడం, భూమి దిగిపోవడం, అనావృష్టి, వాతావరణం బాగుండకపోవడం, పంటకు తెగుళ్లు, కీటకాలు ఆశించి నష్టం జరిగినా బీమా పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. కోతల తర్వాత పంట తడిచినా పరిహారం వర్తిస్తుందన్నారు. ఇవన్నీ కాకుండా పంటకు వేయడానికి భూములు దుక్కులు చేసుకుని, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్న తర్వాత వర్షాలు లేక విత్తనం వేయలేని పరిస్థితి ఏర్పడినా 25 శాతం వరకు పరిహారం వర్తింపజేయాలనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటితో పాటు బీమా చేసిన రైతు, ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిని కూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గత బీమా పథకాలతో పోల్చితే ఫసల్ బీమాలో రైతులకు అనేక ప్రయోజనాలు కల్పించినట్లు ప్రచారం చేశారు. ప్రీమియం చెల్లించిన రైతుల ఖాతాల్లోకి నేరుగా పరిహారం జమ అవుతుందని చెప్పారు. లోపభూయిష్టం.. ఫసల్ బీమా పథకం అమలులోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా పావలా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఇంత పరిహారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు కూడా వెలువడలేదు. పథకం గురించి చెప్పడానికి అటు జిల్లా మంత్రులు, ఇతర అధికార పార్టీ నేతలు కాని, జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ కానీ నోరుమెదపడం లేదు. ఖరీఫ్‌లో నాలుగైదు పంటలకు ఈ పథకం అమలు చేయగా... వేరుశనగ పంటకు వర్తింపజేయకపోవడంతో పెద్దగా ఎవరూ ఈ పథకంలోకి రాలేదు. వేరుశనగ కాకుండా మిగతా పంటలు వేసిన రైతులు ప్రీమియం చెల్లించినట్లు చెబుతున్నా, అధికారుల దగ్గర వివరాలు అందుబాటులో లేవు. ప్రధానంగా రబీలో పప్పుశనగకు వర్తింపజేయడంతో పెద్ద సంఖ్యలో రైతులు ప్రీమియం చెల్లించినట్లు సమాచారం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పప్పుశనగ పంట 80 శాతం మేర దెబ్బతినడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ప్రీమియం కట్టిన రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఎంత మంది రైతులు, ఎన్ని హెక్టార్లకు, ఎంత మొత్తంలో ప్రీమియం చెల్లించారు...? అనే వివరాలు జిల్లాలో ఎవరి దగ్గరా లేకపోవడం విశేషం. దీనిపై లీడ్‌బ్యాంకు మేనేజర్ జయశంకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, ప్రస్తుతం తన వద్ద వివరాలు లేవనీ, వివరాలు కోరుతూ బీమా కంపెనీ వారికి రెండురోజుల క్రితం మెయిల్ పంపామన్నారు. అక్కడి వివరాలు అందగానే ఎంత మంది ప్రీమియం చెల్లించారో వెల్లడిస్తామని తెలిపారు. -
10 వరకు గడువు
అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద ఎంపిక చేసిన ఎనిమిది పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల పదోతేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వరి పంటకు మాత్రం ఆగస్టు 21 వరకు గడువుందని పేర్కొన్నారు. పత్తి, మిరపకు ఐదు శాతం, మిగతా పంటలకు రెండు శాతం మేర ప్రీమియం కట్టాలని సూచించారు. పంట రుణాలు తీసుకున్న రైతులతో పాటు పొందని రైతులు కూడా ప్రీమియం చెల్లించాలని తెలిపారు. ఫసల్‌బీమా పథకాన్ని ఈ ఏడాది కంది పంటకు గ్రామం యూనిట్‌గా, వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మిరప (నీటి వసతి), పత్తి పంటలకు జిల్లా యూనిట్‌గా అమలు చేస్తున్నారు. -
రెండు రోజులేనా?
సుభాష్‌నగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫసల్‌బీమా యోజన గడువు నేటితో ముగియనుంది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31తోనే గడువు ముగిసింది. అయితే, లక్ష్యం 50 శాతం కూడా పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించాల్సి వచ్చింది. ఆగస్టు 2 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండ్రోజుల పెంపుతో పెద్దగా లాభం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీ నిధులు మంజూరు కాక, రుణాల రీషెడ్యూల్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల గడువు పొడిగింపు సరిపోదని, మరింత గడువు పొడిగించాలని అన్నదాతులు కోరుతున్నారు. రైతుకు దన్నుగా నిలవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రవేశపెటటింది. పంట బీమాతో పాటు రైతుల వ్యక్తిగత, కుటుంబసభ్యులతో పాటు వ్యవసాయ యంత్రాలకు బీమా సౌకర్యం కల్పించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాను ఎంపిక చేసింది. అయితే, ఈ పథకంపై రైతులకు అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల అలసత్వం, వ్యవసాయ శాఖ అధికారుల అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల పథకం నీరుగారుతోంది. జిల్లాలో సుమారు 4.25 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో దాదాపు 3.79 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఇప్పటివరకు 1.90 లక్షల మంది రైతులకు చెందిన రూ.900 కోట్ల పంట రుణాలను రెన్యూవల్ చేసినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్‌కు రూ.1950 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించింది. దాదాపు 50 శాతం పంట రుణాలు రెన్యూవల్ అయ్యాయని లీడ్‌బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు చెప్పారు. అయితే, పంట రుణాలు 50 శాతం వరకు రెన్యూవల్ అయినా, ఫసల్ బీమా పథకంలో మాత్రం చేరేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. గత నెల చివరి వారంలో కలెక్టర్ యోగితారాణా బ్యాంకర్లతో సమీక్షించగా, అప్పటివరకు కేవలం 1,441 మందికి మాత్రమే ఫసల్ బీమా పథకంలో అవకాశం కల్పించినట్లు చెప్పారు. తాజాగా అది 50 శాతం వరకు చేరిందని చెబుతుండడం గమనార్హం. ఫసల్ బీమా యోజన అమలులో కొంత ఇబ్బంది నెలకొందని లీడ్‌బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక్కో రైతు పేరిట డీడీలు తీయడం వల్ల ఇబ్బంది తలెత్తుతుందన్నారు. గ్రామం లేదా బ్యాంక్ యూనిట్‌గా రైతులు బీమా చేయించుకుంటే వారందరిని కలిపి ఒకే డీడీ తీస్తున్నామని, దాని వల్ల రైతుల వివరాలు తెలియాలంటే ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. బ్యాంకర్లు రైతులకు వీలైనన్ని రుణాలిచ్చి పంటల బీమాకు ప్రీమియం చెల్లించాలని ఆయన సూచించారు. రెండు నెలల కాలంలో రైతులను బీమా పథకంలో చేర్చని అధికారులు, బ్యాంకర్లు.. రెండ్రోజుల గడువులో ఏం చేస్తారని రైతులు పేర్కొంటున్నారు. మరింత గడువు పెంచడంతో పాటు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. -
నారుమడులే లేవు.. బీమా ఎలా
31తో ముగుస్తున్న ఫసల్ బీమా సాగు ఉందో లేదో.. అయోమయంలో రైతులు అవగాహన కల్పనకు వ్యవసాయశాఖ చర్యలు గుడివాడ : పంటల బీమాలో కేంద్ర ప్రభుత్వ మార్పులతో రైతులకు కొంత ఊరట లభించింది. గతంలో ఉన్న బీమా ప్రీమియం కన్నా రెండు శాతం తగ్గించింది. ప్రస్తుతం పంట వేసుకునేందుకు నీరేలేని పరిస్థితిలో బీమా ఎలా చెల్లించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తోంది. బీమాపై రైతుల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయాధికారులు అంటున్నారు. పంటలే లేవు ? వరి పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్సు రూ.28 వేలు. రెండు శాతం చొప్పున బీమా ఎకరానికి రూ.567 చెల్లించాలి. కాలువలకు నీరు రాని కారణంగా ఇప్పటివరకు సగం మంది కూడా నారుమడులు వేయలేదు. బీమాకు దూరం అవుతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతులకు అందని ద్రాక్షానే.. నియోజక వర్గంలో దాదాపు 25 వేల మంది రైతులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది కౌలు రైతులే. 60 వేల ఎకరాల్లో సాగు కౌలు రైతులే చేస్తుంటారు. ఈ ఏడాది ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. గత ఏడాది నుంచి రెవెన్యూ అధికారులు కౌలు రైతుల్ని గుర్తించే కార్డులు ఇస్తున్నారు. బీమా ప్రీమియం చెల్లించాలంటే కౌలు రైతులు కార్డు తప్పనిసరి, యజమాని కౌలుదారుణ్ణి అంగీకరిస్తూ బీమా పత్రంపై సంతకం చేయాలి. ఇందుకు యజమానులు ఒప్పుకోవటం లేదని రైతులే చెబుతున్నారు. కౌలు రైతులు బీమాకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణం పొందే రైతులకు ఆగస్టు 21వ తేదీ వరకు గడువు ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా బీమా ప్రీమియం చెల్లిస్తారు. బీమాకు ఏం కావాలంటే... బీమా ప్రీమియం చెల్లించాలంటే ప్రతి రైతు నారుమడి వేసినట్లు ఆయా గ్రామ వీఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. పట్టాదార్ పాస్‌పుస్తకం నకలు, ఆధార్‌కార్డు ఇవ్వాలి. కౌలు రైతు గుర్తింపు కార్డు లేదా వీఆర్వోతో సాగుదారు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ప్రీమియం డీడీ తీయాలి. రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం ప్రధానమంత్రి ఫసల్ బీమాపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఐకేపీ సభ్యుల సహకారంతో ప్రచారం చేస్తున్నాం. తక్కువ ప్రీమియంతో రైతులకు మేలు కలుగుతోంది. – బి.రంగనాథ్‌బాబు, ఏవో కౌలు రైతులు దూరం.. బీమాకు కౌలు రైతులు దూరం అవుతున్నారు. గుర్తింపు కార్డులు ప్రస్తుతం లేవు. యజమాని, వీఆర్వో ధ్రువీకరణ పత్రం ఇచ్చే పరిస్థితి లేదు. రైతు వద్ద వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్, ఆయిల్ ఇంజిన్, వంటి వాటికి బీమా చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. బీమా తగ్గించింది ఎక్కడ. రైతుమిత్ర గ్రూపులు, కౌలురైతు గ్రూపులకు ఎటువంటి షరతులు లేకుండా బీమా సౌకర్యం కల్పించాలి. – నీలం మురళీ కృష్ణారెడ్డి, రైతు సంఘ నాయకుడు