నారుమడులే లేవు.. బీమా ఎలా
నారుమడులే లేవు.. బీమా ఎలా
Published Wed, Jul 20 2016 7:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
31తో ముగుస్తున్న ఫసల్ బీమా
సాగు ఉందో లేదో.. అయోమయంలో రైతులు
అవగాహన కల్పనకు వ్యవసాయశాఖ చర్యలు
గుడివాడ :
పంటల బీమాలో కేంద్ర ప్రభుత్వ మార్పులతో రైతులకు కొంత ఊరట లభించింది. గతంలో ఉన్న బీమా ప్రీమియం కన్నా రెండు శాతం తగ్గించింది. ప్రస్తుతం పంట వేసుకునేందుకు నీరేలేని పరిస్థితిలో బీమా ఎలా చెల్లించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తోంది. బీమాపై రైతుల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయాధికారులు అంటున్నారు.
పంటలే లేవు ?
వరి పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్సు రూ.28 వేలు. రెండు శాతం చొప్పున బీమా ఎకరానికి రూ.567 చెల్లించాలి. కాలువలకు నీరు రాని కారణంగా ఇప్పటివరకు సగం మంది కూడా నారుమడులు వేయలేదు. బీమాకు దూరం అవుతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కౌలు రైతులకు అందని ద్రాక్షానే..
నియోజక వర్గంలో దాదాపు 25 వేల మంది రైతులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది కౌలు రైతులే. 60 వేల ఎకరాల్లో సాగు కౌలు రైతులే చేస్తుంటారు. ఈ ఏడాది ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. గత ఏడాది నుంచి రెవెన్యూ అధికారులు కౌలు రైతుల్ని గుర్తించే కార్డులు ఇస్తున్నారు. బీమా ప్రీమియం చెల్లించాలంటే కౌలు రైతులు కార్డు తప్పనిసరి, యజమాని కౌలుదారుణ్ణి అంగీకరిస్తూ బీమా పత్రంపై సంతకం చేయాలి. ఇందుకు యజమానులు ఒప్పుకోవటం లేదని రైతులే చెబుతున్నారు. కౌలు రైతులు బీమాకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణం పొందే రైతులకు ఆగస్టు 21వ తేదీ వరకు గడువు ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా బీమా ప్రీమియం చెల్లిస్తారు.
బీమాకు ఏం కావాలంటే...
బీమా ప్రీమియం చెల్లించాలంటే ప్రతి రైతు నారుమడి వేసినట్లు ఆయా గ్రామ వీఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. పట్టాదార్ పాస్‌పుస్తకం నకలు, ఆధార్‌కార్డు ఇవ్వాలి. కౌలు రైతు గుర్తింపు కార్డు లేదా వీఆర్వోతో సాగుదారు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ప్రీమియం డీడీ తీయాలి.
రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం
ప్రధానమంత్రి ఫసల్ బీమాపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఐకేపీ సభ్యుల సహకారంతో ప్రచారం చేస్తున్నాం. తక్కువ ప్రీమియంతో రైతులకు మేలు కలుగుతోంది. – బి.రంగనాథ్‌బాబు, ఏవో
కౌలు రైతులు దూరం..
బీమాకు కౌలు రైతులు దూరం అవుతున్నారు. గుర్తింపు కార్డులు ప్రస్తుతం లేవు. యజమాని, వీఆర్వో ధ్రువీకరణ పత్రం ఇచ్చే పరిస్థితి లేదు. రైతు వద్ద వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్, ఆయిల్ ఇంజిన్, వంటి వాటికి బీమా చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. బీమా తగ్గించింది ఎక్కడ. రైతుమిత్ర గ్రూపులు, కౌలురైతు గ్రూపులకు ఎటువంటి షరతులు లేకుండా బీమా సౌకర్యం కల్పించాలి.
– నీలం మురళీ కృష్ణారెడ్డి, రైతు సంఘ నాయకుడు
Advertisement
Advertisement