రెండు రోజులేనా?
రెండు రోజులేనా?
Published Tue, Aug 2 2016 12:26 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
సుభాష్‌నగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫసల్‌బీమా యోజన గడువు నేటితో ముగియనుంది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31తోనే గడువు ముగిసింది. అయితే, లక్ష్యం 50 శాతం కూడా పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించాల్సి వచ్చింది. ఆగస్టు 2 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండ్రోజుల పెంపుతో పెద్దగా లాభం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీ నిధులు మంజూరు కాక, రుణాల రీషెడ్యూల్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల గడువు పొడిగింపు సరిపోదని, మరింత గడువు పొడిగించాలని అన్నదాతులు కోరుతున్నారు.
రైతుకు దన్నుగా నిలవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రవేశపెటటింది. పంట బీమాతో పాటు రైతుల వ్యక్తిగత, కుటుంబసభ్యులతో పాటు వ్యవసాయ యంత్రాలకు బీమా సౌకర్యం కల్పించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాను ఎంపిక చేసింది. అయితే, ఈ పథకంపై రైతులకు అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల అలసత్వం, వ్యవసాయ శాఖ అధికారుల అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల పథకం నీరుగారుతోంది.
జిల్లాలో సుమారు 4.25 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో దాదాపు 3.79 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఇప్పటివరకు 1.90 లక్షల మంది రైతులకు చెందిన రూ.900 కోట్ల పంట రుణాలను రెన్యూవల్ చేసినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్‌కు రూ.1950 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించింది. దాదాపు 50 శాతం పంట రుణాలు రెన్యూవల్ అయ్యాయని లీడ్‌బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు చెప్పారు. అయితే, పంట రుణాలు 50 శాతం వరకు రెన్యూవల్ అయినా, ఫసల్ బీమా పథకంలో మాత్రం చేరేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. గత నెల చివరి వారంలో కలెక్టర్ యోగితారాణా బ్యాంకర్లతో సమీక్షించగా, అప్పటివరకు కేవలం 1,441 మందికి మాత్రమే ఫసల్ బీమా పథకంలో అవకాశం కల్పించినట్లు చెప్పారు. తాజాగా అది 50 శాతం వరకు చేరిందని చెబుతుండడం గమనార్హం.
ఫసల్ బీమా యోజన అమలులో కొంత ఇబ్బంది నెలకొందని లీడ్‌బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక్కో రైతు పేరిట డీడీలు తీయడం వల్ల ఇబ్బంది తలెత్తుతుందన్నారు. గ్రామం లేదా బ్యాంక్ యూనిట్‌గా రైతులు బీమా చేయించుకుంటే వారందరిని కలిపి ఒకే డీడీ తీస్తున్నామని, దాని వల్ల రైతుల వివరాలు తెలియాలంటే ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. బ్యాంకర్లు రైతులకు వీలైనన్ని రుణాలిచ్చి పంటల బీమాకు ప్రీమియం చెల్లించాలని ఆయన సూచించారు. రెండు నెలల కాలంలో రైతులను బీమా పథకంలో చేర్చని అధికారులు, బ్యాంకర్లు.. రెండ్రోజుల గడువులో ఏం చేస్తారని రైతులు పేర్కొంటున్నారు. మరింత గడువు పెంచడంతో పాటు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
Advertisement
Advertisement