సాయంత్రం వరకే..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంటు ఎన్నికల్లో కీలకమైన ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార కార్యక్రమానికి తెరపడినట్టే. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్న ఎన్నికల కమిషన్ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో సంచరించకూడదు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్లు పంపకూడదు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురు వ్యక్తులకు మించి పోలీస్స్టేషన్ల పరిధిలో సంచరించకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచార ఘట్టం దాదాపుగా ముగిసినట్టే. కరీంనగర్ ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశమై ఈ మేరకు ఎన్నికల సంఘం నిబంధనలను వివరించారు. ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
విస్తృతంగా సాగిన టీఆర్ఎస్ ప్రచారం
గత నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ఆరోజు నుంచే మొదలైన నామినేషన్ల ప్రకియ 25వ తేదీ వరకు సాగింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం ఉధృతంగా సాగింది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థులుగా కరీంనగర్లో బోయినిపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లిలో బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పదిహేను రోజులపాటు విస్తృత ప్రచారం సాగించారు. వీరికి మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ఇన్చార్జిలుగా సంపూర్ణ సహకారం అందించగా, ఎమ్మెల్యేలు అంతా తామై వ్యవహరించారు.
అభ్యర్థి హాజరు కాకపోయినా, పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతిరోజు రాత్రి వరకు ప్రచారం సాగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఎమ్మెల్యేలు కవర్ చేయగా, అభ్యర్థులు ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రచార సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రెండు స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసీఆర్ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొనగా, కేటీఆర్ కరీంనగర్, సిరిసిల్లలో రెండురోజులు పర్యటించారు. పనిలో పనిగా కాంగ్రెస్, బీజేపీల నుంచి ముఖ్యమైన నాయకులను పార్టీలో చేర్పించే కార్యక్రమాన్ని విస్తృతంగా సాగించారు. పెద్దపల్లికి చెందిన బీజేపీ సీనియర్ నేత మీస అర్జున రావు, ఆపార్టీ ముఖ్య నాయకులు సోమవారం కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.
ఒడిదొడుకుల్లోనూ... కాంగ్రెస్, బీజేపీ పోరాటం
టీఆర్ఎస్ దెబ్బకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుదేలైపోయిన కాంగ్రెస్, బీజేపీ తమకున్న పార్టీ యంత్రాంగంతో ప్రచార పర్వంలో ఉనికిని చాటుకున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను చుట్టి వచ్చారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సహకారంతో ఆయన తనకున్న పాత పరిచయాలతో పార్లమెంటు స్థానం పరిధిలో విస్తృత ప్రచారం సాగించారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ హిందుత్వ ఎజెండాను ప్రధాన ఆయుధంగా మార్చుకొని యువత, విద్యార్థులు టార్గెట్‌గా ప్రచారం నిర్వహించారు. కరీంనగర్లో నిర్వహించిన భారీ బహిరంగసభ విజయవంతం కావడం ఆయనకు ఊపిరినిచ్చింది. కరీంనగర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీల్లో ఓటుబ్యాంకును పెంచుకునే లక్ష్యంతో ఆయన ప్రచారం సాగించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌కు పార్టీలోనే తగిన సహకారం రాలేదు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మినహా ఆయనకు పూర్తిస్థాయిలో సహకరించిన నాయకులే కనిపించలేదు. విజయశాంతి, కోదండరాం తదితరులు వచ్చినా రాహుల్‌గాంధీ వంటి హేమాహేమీలు రాకపోవడం లోటుగా నిలిచింది. బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ తనకున్న సంబంధాలతో ప్రచారం సాగించారు.
మద్యం దుకాణాలు మూసివేత
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ జరిగే 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అంటే 48 గంటలపాటు యధావిధిగా మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. జిల్లాలో ఆల్కాహాల్ సంబంధమైన పానీయాలను విక్రయించే రిటైల్ మద్యం దుకాణాలతోపాటు బార్లు కూడా మూసివేయాల్సిందే. మద్యం నిల్వ ఉంచుకుంటే సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.