చక్కని పండు.. రుచిలో మెండు
ఔషధ గుణాల ఖర్జూరాలు..
ఉపవాస దీక్ష విరమణలో ప్రధమ స్థానం
రంజాన్ మాసంలో విరివిగా అమ్మకాలు
నగరానికి 65కి పైగా రకాల దిగుమతి
నిగనిగలాడే రంగు.. చూడచక్కని రూపం దూరం నుంచే నోరూరించే నైజం.. నోట్లో వేసుకుంటే కరిగిపోయి.. తక్షణం శక్తినిచ్చే లక్షణం ఖర్జూర పండు సొంతం. అంతేనా.. ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయండోయ్. అందుకే రంజాన్ మాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించి దీక్షను విరమించేటప్పుడు తొలుత ఈ పండునే నోట్లో వేసుకుంటారు. దీన్ని తీసుకోవడంవల్లశరీరానికి తక్షణ శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రంజాన్ మాసంలో ముస్లింలు ప్రశాంతతను నింపే నమాజ్‌లు, నిబద్ధతతో కూడిన ఉపవాసం చేస్తుంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలను త్యజించి రోజాను పాటిస్తారు. వీరికి ఇఫ్తార్ సమయానికి తప్పక గుర్తుకొచ్చేది ఖజూర్ (కర్జూరం). ఉపవాస దీక్షను ఖజూర్తోనే విరమించడం ‘సున్నత్’గా పేర్కొంటారు. - సాక్షి, సిటీబ్యూరో
వారెవ్వా.. అజ్వా..!
ఖజూర్ రకాలన్నింటిలోకీ చాలా ఖరీదైన రకం అజ్వా. సౌదీ అరేబియాలో పండే ఈ రకం ఖజూర్ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైన పండుగా గుర్తింపు పొందింది. నల్లటి రంగులో ఉండే అజ్వా ఖజూర్లోని గింజలను తొలగించి, వీటిలో పూర్తిగా బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను స్టఫ్ చేసి వాటిని తేనెలో వాటిపై కుంకుమపువ్వును వేసుకుని నోట్లో వేసుకుంటే.. ఆ రుచి ఇక మరిచిపోలేం. అందుకూ ఈ పండు ధర కూడా అధికమే.
ఇఫ్తార్‌కు ఈ పండు తప్పనిసరి
ఉపవాస దీక్ష ముగిసి ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం పండ్లనే అధిక శాతం తీసుకుంటారు. ప్రస్తుతం నగరంలో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారత్‌లో పండే ఖర్జూరాలతో పాటు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలకు చెందిన దాదాపు 65 రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కల్మీ, సుక్రీ, క్లాస్, సుగాఈ-వార్డ్, అజ్వా, మెడ్‌జాల్ కింగ్, మరియమ్, జఫ్రాన్ రకాలు ముఖ్యమైనవి. రకాన్ని బట్టి కిలో రూ.80 నుంచి రూ. 4000 ధర పలుకుతున్నాయి.
నోరూరించే ‘సగాయి’..
అజ్వా తరువాత తియ్యదనంలో మేటిగా చెప్పబడే రకం సగాయి. దుబాయ్‌లో ఈ సగాయి రకం ఖర్జూరం అధికంగా పండుతుంది. ప్రపంచ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఖజూర్ ఇది. ఇవి కూడా కేవలం ఖజూర్గానే కాక వీటిలో డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసి వాటికి వైట్ హనీని జతచేసి కుంకుమ పువ్వుతో కలిపి అమ్ముతారు.
త్రిగల్ బందీ..
శిల్పారామం ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారింది. వారాంతపు వేడులో భాగంగా కందుల కూచిపూడి నాట్యాలయం ఆధ్వర్యంలో మోహినీ అట్టం, ఒడిస్సీ, కూచిపూడి మిళితంగా ‘త్రిగల్ బందీ’ ప్రదర్శించి అలరించారు. స్వర్ణదీప మోహినీ ఆట్టంతోను, దేబాశీష్ పట్నాయక్ ఒడిస్సీతోను, రవి కూచిపూడి నాట్యాన్ని కలిపి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి కళాకారిణి డాక్టర్ యశోద ఠాకుర్, హేమ పటేల్, డాక్టర్ క్రిష్ణ, డాక్టర్ కన్నయ్య పాల్గొని కళాకారులను సత్కరించారు.- మాదాపూర్
చిలుకూరు కిటకిట
చిలుకూరు బాలాజీ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవుల చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. పర్యావరణ పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే సంకల్పంతో సాయంత్రం ‘వృక్షారోపనం’ కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు అందజేసిన 500 మొక్కలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు పంపిణీ చేశారు. - మొయినాబాద్
కొనేటప్పుడు జాగ్రత్తసుమా..!
మార్కెట్లో చాలా రకాల ఖర్జూరాలు దొరుకుతున్నాయి. అయితే, కొందరు వ్యాపారులు అవకాశాన్నిబట్టి నాసిరకం కూడా అమ్మేస్తుంటారు. అందుకే మనం చెల్లించే డబ్బుకు తగినట్టుగా నాణ్యమైన ఖర్జూరాలను తీసుకునేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. ఖర్జూరాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఎలాంటి జిగురు అంటకూడదు. అలా ఉంటే నిగనిగలాడేందుకు ఎలాంటి రసాయనాలు వాడలేదని అర్థం. ఖర్జూరాల పైపొర పల్చగా ఉండి, గుజ్జు తాజాగా ఉండాలి. నాణ్యమైన ఖర్జూరాలు ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి.
ఎంత నిర్లక్ష్యం..!
నగరంలో వాహన రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పెద్దవారే ఈ రద్దీలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఇక చిన్నారుల సంగతి అత్యంత దారుణంగా ఉంటుంది. విద్యార్థులు బడికి వెళ్లి రావడానికి.. వారు చదివే స్కూళ్లు ఉన్న వీధుల్లో ‘ఇక్కడ స్కూలు ఉంది’ అని సూచిస్తూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు ఇప్పుడు విరిగిపోయి ఫుట్‌పాత్‌పై పడిపోయాయి. మరికొన్ని చోట్ల ఆ బోర్డులు కనిపించకుండా చిరువ్యాపారులు ఆక్రమించేశారు. సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనైనా ఈ బోర్డులను సరి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇవి విద్యార్థులు పట్ల అధికారులకు గల బాధ్యతకు అద్దం పడుతున్నాయి.