fatehpur sikri
-
భారీ మెజారిటీ; కేంద్రమంత్రి పదవిపై కన్ను!
లక్నో : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో చోటు కోసం బీజేపీ సహా మిత్రపక్షాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాజ్ కుమార్ చహర్ కేంద్రమంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్‌పై భారీ మెజారిటితో గెలుపొందిన రాజ్ కుమార్ మోదీ కేబినెట్లో కచ్చితంగా చోటు దక్కించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ నేత బాబూలాల్ చౌదరి కూడా రాజ్ బబ్బర్‌పై పైచేయి సాధించారు. అయితే అప్పడు ఆయన కేవలం లక్షన్నర ఓట్ల మెజారిటీ మాత్రమే పొందారు. 2019 ఎన్నికల్లో ఫతేపూర్ సిక్రీ అభ్యర్థిగా రాజ్ కుమార్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సిట్టింగ్ ఎంపీని కాదని బీజేపీ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన రాజ్ కుమార్ మొత్తంగా 6.67,147 ఓట్లు సాధించారు. 4, 95, 065 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిని మట్టికరిపించారు. వారణాసిలో నరేంద్ర మోదీకి వచ్చిన మెజారిటీ కంటే కూడా ఇదే ఎక్కువ. అదే విధంగా రాజ్ కుమార్ చహర్‌కు 64.32 శాతం ఓట్లు దక్కడంతో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ దారుణ ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న రాజ్ కుమార్ చహర్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం మోదీ హవాలో కొట్టుకుపోయారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానం(సోనియా గాంధీ- రాయ్‌బరేలీ)లో గెలుపొందిన సంగతి తెలిసిందే. -
‘ఫతేపూర్’ బస్తీలో రాజ్‌బబ్బర్
ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ)తో కూడిన మహాగఠ్ బంధన్‌లో స్థానం దక్కని కాంగ్రెస్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో గెలుపు అవకాశాలున్న అతి కొద్ది సీట్లలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ బాలీవుడ్ నటుడైన రాజ్‌బబ్బర్ రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో మొదటిసారి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయ చేతిలో దాదాపు పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే ఏడాది జరిగిన ఫిరోజాబాద్ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్‌ను బబ్బర్ ఓడించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఘజియాబాద్‌లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఆయన ఎస్పీలో ఉండగా ఆ పార్టీ తరఫున ఆగ్రా నుంచి 1999, 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పునర్విభజనలో ఆగ్రా స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఆగ్రా జిల్లాలో సగ భాగం ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం 2009లో ఏర్పాటయింది. 2014లో బీజేపీ అభ్యర్థి చౌధరీ బాబూలాల్ తన సమీప బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయను లక్షా 73 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. అప్పుడు కాంగ్రెస్–ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన అమర్‌సింగ్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి బాబూలాల్‌కు బీజేపీ టికెట్ దక్కలేదు. రాజ్‌కుమార్ చాహర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. మహాగఠ్ బంధన్ తరఫున శ్రీభగవాన్ శర్మ అలియాస్ గుడ్డూ పండిత్ (బీఎస్పీ) పోటీ చేస్తున్నారు. ఆగ్రా నగరంలో పుట్టిన బబ్బర్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఘజియాబాద్ వద్దన్న బబ్బర్.. రాజ్ బబ్బర్‌ను మొదట ఆయన కిందటిసారి ఓడిన ఘజియాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. బబ్బర్ మద్దతుదారులతో పాటు ఆయన కూడా అక్కడి నుంచి పోటీకి ఇష్టపడకపోవడంతో చివరికి ఫతేపూర్ సిక్రీ టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో కులం కూడా ప్రధాన పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో రాజ్‌బబ్బర్ కులానికి (విశ్వకర్మ) చెందిన జనం బాగా తక్కువ. తనను చూసి అభిమానంతో చేతులు ఊపుతున్న ప్రజలంతా తన కులస్తులేనని, బంధువులని బబ్బర్ ఓ సందర్భంలో చమత్కరించారు. బాలీవుడ్ నటునిగా జనంతో ఉన్న పాత సంబంధం, స్థానికునిగా ఉన్న గుర్తింపు తనకు చాలని ఆయన భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఠాకూర్లు, బ్రాహ్మణుల తర్వాత జాట్ల జనాభా ఎక్కువ. బీజేపీ అభ్యర్థి చాహర్ జాట్. బీఎస్పీ నేత గుడ్డూ పండిత్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. జనాభా రీత్యా ఠాకూర్ల ఆధిపత్యం ఉన్నా ఈ వర్గం అభ్యర్థులెవరూ బరిలో లేరు. బీఎస్పీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సూరజ్‌పాల్ సింగ్, ధరమ్‌పాల్ సింగ్ (ఇద్దరూ ఠాకూర్లే) ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో రాజ్ బబ్బర్ ప్రచారం ఊపందుకుంది. మోదీ ఇమేజ్‌పైనే బీజేపీ అభ్యర్థి భారం బీజేపీకి లోక్‌సభ అభ్యర్థిని చూసి తాము ఓట్లేయడం లేదనీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల విధానాల కారణంగానే కాషాయ పక్షాన్ని గెలిపిస్తున్నామనే అభిప్రాయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి చాహర్ గతంలో సిక్రీ నుంచి అసెంబ్లీకి మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. బబ్బర్ అనుచరునిగా పనిచేసిన నేపథ్యం కూడా చాహర్‌కు ఉంది. అయినా, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నరేంద్రమోదీ ముఖం చూసి ఓటేసే వారి సంఖ్య యూపీలో గణనీయంగా ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్పీకి దూరమైన బ్రాహ్మణ ఓటర్లు? బ్రాహ్మణ వర్గంలో మంచి పలుకుబడి ఉన్న సీమా ఉపాధ్యాయకు బీఎస్పీ టికెట్ ఇవ్వలేదు. ఆమె పార్టీ టికెట్‌పై 2009 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈసారి ఆమె వర్గానికే చెందిన గుడ్డూ పండిత్‌కు బీఎస్పీ టికెట్ లభించింది. స్థానికేతురుడైన బులంద్‌శహర్ ఎమ్మెల్యే పండిత్‌కు మద్దతు ఇవ్వడానికి బ్రాహ్మణులు ఆసక్తి చూపడం లేదు. మాయావతి కులమైన జాటవులు మాత్రమే బీఎస్పీ అభ్యర్థి తరఫున ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మంచి పేరు లేకపోవడం బబ్బర్‌కు అనుకూలాంశంగా మారింది. ఎస్పీకి చెందిన కొందరు బ్రాహ్మణ నేతలు బబ్బర్ తరఫున ప్రచారం చేయడంతో పోటీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చాహర్, బబ్బర్ మధ్యనే ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘పెళ్లి చేస్తారంట.. నా లైఫ్‌కు ఇదే చివరి ఫైట్’
లక్నో: ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కనిపించడం అరుదు.. అది కూడా శాంతియుత వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అలా బ్యాలెట్ పేపర్లో నామమాత్రంగా కనిపిస్తుంటారు. అయితే, వారు గెలుపొందిన సందర్భాలు లేకపోలేదు.. అచ్చం అలాంటి భావనతోనే ఇటీవల కాస్తంతా ఆలోచన ఉన్న యువత ప్రత్యర్థులు ఎంతటి బలవంతులైనా భయపడకుండా స్వశక్తితో ముందడుగేయడం, ఇండిపెండెంట్‌గా పోటీచేయడం చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కూడా అలాంటి పరిస్థితి దర్శనం ఇచ్చింది. పెళ్లి చేసి తమ బాధ్యతలు తీర్చుకోవాలనుకుంటున్న తల్లిదండ్రుల వాదనతో పక్కకు జరిగి ప్రస్తుత ఎన్నికల్లో ఓ యువతి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగింది. కేవలం ఇంట్లో ఓ పది వేలు తీసుకెళ్లి నామినేషన్ వేసింది. తన ఆస్తులు 32వేలు అని అఫిడవిట్లో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. వందన శర్మ(25) అనే యువతి ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగింది. వాస్తవానికి ఆమె అలా చేయడంపై తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే, వారు కూడా ఆమెకు మద్దతివ్వడం లేదు. అయితే, ఆమె సోదరుడు మాత్రం తనతో ఉన్నాడు. చుట్టుపక్కలవారు ఆమె చైతన్యాన్ని చూసి ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలో వందనను ఓ మీడియా కలవగా ‘నా తల్లిదండ్రులు పెళ్లి చేసి వారి బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నారు. నాకు మాత్రం ఇదే చివరి ప్రయత్నం. నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. మా గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. కాలేజీలు దగ్గర్లో లేవు. ఇప్పటికీ అమ్మాయిలకు తోడుగా పురుషులు వెళ్లాల్సిందే. ఆరు దాటితే బయటకొచ్చే పరిస్థితి లేదు. ఇది 21వశతాబ్దం. ఈ పరిస్థితి మారాలి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
'ఒక్క రూపాయి వసూలు చేసినా ప్రాణం తీసుకుంటా'
లక్నో: తన వద్ద నుంచి ఒక్క రూపాయి వసూలు చేసినా ఆత్మహత్యకు పాల్పడతానని బీజేపీ నేత ఒకరు బెదిరించారు. 2014లో నరేంద్రమోదీ నిర్వహించిన ర్యాలీకోసం కార్యకర్తలను తీసుకునేందుకు పది కోచ్‌లను ఇండియన్ రైల్వే నుంచి ఫతేపూర్ సిక్రీకి చెందిన బీజేపీ నేత వినోద్ సమారియా అద్దెకు తీసుకున్నారు. కానీ, ఆ మొత్తం చెల్లించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆస్తులు వేలం వేసి వాటిని వసూలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ భారతీయ రైల్వే నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. లక్నోలో మోదీ నిర్వహించిన ర్యాలీ కోసం సమారియా రూ.18,39,560 డిపాజిట్ చేసి పది రైల్వే కోచ్‌లు అద్దెకు తీసుకున్నారు. దీనికి మొత్తం అద్దె రూ.30,68,950 కాగా డిపాజిట్ మాత్రమే చేసిన సమారియా మిగితావి చెల్లించలేదు. -
అమర్ సింగ్ కు వ్యతిరేకంగా జయబచ్చన్ ప్రచారం
ఆగ్రా: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. అమర్ సింగ్, బచ్చన్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు గతంలో ఉండేవి. అయితే ములాయం సింగ్ యాదవ్ తో విబేధించి సమాజ్ వాదీ పార్టీకి గుడ్ బై చెప్పాక అమర్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆపార్టీ తరపున ఫతేపూర్ సిక్రి నియోజకవర్గం నుంచి అమర్ సింగ్ పోటీలో ఉన్నారు. ఏప్రిల్ 24 తేదిన జరిగే ఎన్నికల్లో అమర్ సింగ్ కు వ్యతిరేకంగా సమాజ్ వాదీ ఎంపీ జయాబచ్చన్ ప్రచారం చేయనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో కలిసి జయ బచ్చన్ ఫతేబాద్, ఎత్మద్ పూర్, ఫతేపుర్ సిక్రి ప్రచారం చేపట్టనున్నారు. ఫతేపూర్ సిక్రి నియోజకవర్గంలో జయప్రద, శ్రీదేవి, బోని కపూర్, రాజా మురాద్, అస్రానీ తదితర బాలీవుడ్ ప్రముఖులతో ఇటీవల అమర్ సింగ్ ర్యాలీలు నిర్వహించారు. -
'అఖిలేష్ ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య'
ఈ నెల 15న ఫతేపుర్ సిక్రిలో తమ పార్టీ తలపెట్టిన ర్యాలీకి అఖిలేష్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల భారతీయ జనతాపార్టీ శ్రేణులు శుక్రవారం లక్నోలో నిప్పులుకక్కుతున్నాయి. ర్యాలీని రద్దు చేయటం అఖిలేష్ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యగా ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదుర్ పాథక్ అభివర్ణించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఆ ర్యాలీని రద్దు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రి అజాంఖాన్ నేతృత్వంలో అఖిలేష్ సింగ్ యాదవ్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ర్యాలీ నిర్వహించుకునే అవకాశం ఉందని, అలాంటిది ఏ కారణం లేకుండా తమ పార్టీ చేపట్టనున్న ర్యాలీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని పాథక్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనారిటీలను బుజ్జగించే చర్యల్లో భాగంగానే ర్యాలీని రద్దు చేసినట్లు కనబడుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో ర్యాలీకి అనుమతించేది లేదని గత అర్థరాత్రి అఖిలేష్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో బీజేపీ శ్రేణులు అఖిలేష్ ప్రభుత్వాం, అజాంఖాన్లకు వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా హురెత్తుతున్నాయి. అయితే బీజేపీ తలపెట్టిన ర్యాలీని అఖిలేష్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందే సరైన వివరణ ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ బాజపాయి ఇక్కడ డిమాండ్ చేశారు. ఆ ర్యాలీని విజయవంతం చేయడానికి గత నెలరోజులుగా భారతీయ జనతాపార్టీ ముమ్మర చర్యలు చేపట్టింది. ఆ ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభలో బీజేపీ ముఖ్యనేత ఎల్.కే.అద్వానీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వరణ్ గాంధీలు ఆ సభలో ప్రసంగించనున్నారు.ముజఫర్‌నగర్‌లో ఇటీవల చోటు చేసుకున్న మత ఘర్షణల్లో దాదాపు 44 మంది మరణించారు. మరో వెయ్యి మంది వరకు క్షతగాత్రులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.