'ఒక్క రూపాయి వసూలు చేసినా ప్రాణం తీసుకుంటా'
లక్నో: తన వద్ద నుంచి ఒక్క రూపాయి వసూలు చేసినా ఆత్మహత్యకు పాల్పడతానని బీజేపీ నేత ఒకరు బెదిరించారు. 2014లో నరేంద్రమోదీ నిర్వహించిన ర్యాలీకోసం కార్యకర్తలను తీసుకునేందుకు పది కోచ్లను ఇండియన్ రైల్వే నుంచి ఫతేపూర్ సిక్రీకి చెందిన బీజేపీ నేత వినోద్ సమారియా అద్దెకు తీసుకున్నారు. కానీ, ఆ మొత్తం చెల్లించడంలో విఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో ఆ డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆస్తులు వేలం వేసి వాటిని వసూలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ భారతీయ రైల్వే నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. లక్నోలో మోదీ నిర్వహించిన ర్యాలీ కోసం సమారియా రూ.18,39,560 డిపాజిట్ చేసి పది రైల్వే కోచ్లు అద్దెకు తీసుకున్నారు. దీనికి మొత్తం అద్దె రూ.30,68,950 కాగా డిపాజిట్ మాత్రమే చేసిన సమారియా మిగితావి చెల్లించలేదు.