ఈ నెల 15న ఫతేపుర్ సిక్రిలో తమ పార్టీ తలపెట్టిన ర్యాలీకి అఖిలేష్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల భారతీయ జనతాపార్టీ శ్రేణులు శుక్రవారం లక్నోలో నిప్పులుకక్కుతున్నాయి. ర్యాలీని రద్దు చేయటం అఖిలేష్ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యగా ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదుర్ పాథక్ అభివర్ణించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఆ ర్యాలీని రద్దు చేశారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రి అజాంఖాన్ నేతృత్వంలో అఖిలేష్ సింగ్ యాదవ్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ర్యాలీ నిర్వహించుకునే అవకాశం ఉందని, అలాంటిది ఏ కారణం లేకుండా తమ పార్టీ చేపట్టనున్న ర్యాలీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని పాథక్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మైనారిటీలను బుజ్జగించే చర్యల్లో భాగంగానే ర్యాలీని రద్దు చేసినట్లు కనబడుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని ముజఫర్నగర్లో చోటు చేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో ర్యాలీకి అనుమతించేది లేదని గత అర్థరాత్రి అఖిలేష్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో బీజేపీ శ్రేణులు అఖిలేష్ ప్రభుత్వాం, అజాంఖాన్లకు వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా హురెత్తుతున్నాయి.
అయితే బీజేపీ తలపెట్టిన ర్యాలీని అఖిలేష్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందే సరైన వివరణ ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ బాజపాయి ఇక్కడ డిమాండ్ చేశారు. ఆ ర్యాలీని విజయవంతం చేయడానికి గత నెలరోజులుగా భారతీయ జనతాపార్టీ ముమ్మర చర్యలు చేపట్టింది.
ఆ ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభలో బీజేపీ ముఖ్యనేత ఎల్.కే.అద్వానీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వరణ్ గాంధీలు ఆ సభలో ప్రసంగించనున్నారు.ముజఫర్నగర్లో ఇటీవల చోటు చేసుకున్న మత ఘర్షణల్లో దాదాపు 44 మంది మరణించారు. మరో వెయ్యి మంది వరకు క్షతగాత్రులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.