‘పెళ్లి చేస్తారంట.. నా లైఫ్‌కు ఇదే చివరి ఫైట్’
లక్నో: ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కనిపించడం అరుదు.. అది కూడా శాంతియుత వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అలా బ్యాలెట్ పేపర్లో నామమాత్రంగా కనిపిస్తుంటారు. అయితే, వారు గెలుపొందిన సందర్భాలు లేకపోలేదు.. అచ్చం అలాంటి భావనతోనే ఇటీవల కాస్తంతా ఆలోచన ఉన్న యువత ప్రత్యర్థులు ఎంతటి బలవంతులైనా భయపడకుండా స్వశక్తితో ముందడుగేయడం, ఇండిపెండెంట్‌గా పోటీచేయడం చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కూడా అలాంటి పరిస్థితి దర్శనం ఇచ్చింది.
పెళ్లి చేసి తమ బాధ్యతలు తీర్చుకోవాలనుకుంటున్న తల్లిదండ్రుల వాదనతో పక్కకు జరిగి ప్రస్తుత ఎన్నికల్లో ఓ యువతి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగింది. కేవలం ఇంట్లో ఓ పది వేలు తీసుకెళ్లి నామినేషన్ వేసింది. తన ఆస్తులు 32వేలు అని అఫిడవిట్‌లో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. వందన శర్మ(25) అనే యువతి ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగింది. వాస్తవానికి ఆమె అలా చేయడంపై తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే, వారు కూడా ఆమెకు మద్దతివ్వడం లేదు.
అయితే, ఆమె సోదరుడు మాత్రం తనతో ఉన్నాడు. చుట్టుపక్కలవారు ఆమె చైతన్యాన్ని చూసి ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలో వందనను ఓ మీడియా కలవగా ‘నా తల్లిదండ్రులు పెళ్లి చేసి వారి బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నారు. నాకు మాత్రం ఇదే చివరి ప్రయత్నం. నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. మా గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. కాలేజీలు దగ్గర్లో లేవు. ఇప్పటికీ అమ్మాయిలకు తోడుగా పురుషులు వెళ్లాల్సిందే. ఆరు దాటితే బయటకొచ్చే పరిస్థితి లేదు. ఇది 21వశతాబ్దం. ఈ పరిస్థితి మారాలి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.