ఆస్తి తగాదాలతో తండ్రిని చంపిన కొడుకు
చుండూరు(గుంటూరు): ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ కిరాతకుడు కన్నతండ్రిని హతమార్చాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని చుండూరుకు చెందిన పులుగు వెంకట్రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు శ్రీనివాసరెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఆస్తి పంపకాల విషయంలో శ్రీనివాసరెడ్డికి తండ్రితో విభేదాలున్నాయి. వీటిని మనసులో పెట్టుకున్న అతడు బుధవారం రాత్రి రాయితో బలంగా మోది తండ్రిని హత్య చేశాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
స్థానిక మిల్లులో పనిచేస్తున్న ఈశ్వరమ్మ అర్థరాత్రి ఇంటికి వచ్చేసరికి భర్త రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆమె వెంటనే స్థానికుల సాయంతో భర్త వెంకట్ రెడ్డిని గుంటూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గురువారం ఉదయం శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకుని ఏమీ తెలియనట్లు ఉన్నాడు. అయితే, శ్రీనివాసరెడ్డిపై అనుమానం ఉన్న గ్రామస్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.