ఫేస్బుక్లో ప్రముఖ జర్నలిస్టుల అకౌంట్లు మాయం
న్యూఢిల్లీ : గత 10 రోజులుగా... ఫేస్బుక్ డజనుకు పైగా జర్నలిస్టుల అకౌంట్లను మాయం చేసింది. కనీసం ఎలాంటి హెచ్చరికలు లేదా నోటీసులు లేకుండా.. వారి అకౌంట్లను డిసేబుల్ చేసింది. వీరిలో చాలా మంది సీనియర్ ఎడిటర్లే ఉన్నారట. అసలెందుకు ఫేస్బుక్ ఈ పని చేసింది? సీనియర్ ఎడిటర్ల అకౌంట్లనే ఎందుకు డిసేబుల్ చేస్తుంది? అంటే దాని వెనుక పెద్ద కథే ఉందట. ఈ జర్నలిస్టులందరూ దేశంలో జరుగుతున్న కొన్ని కీలక అంశాలపై ఆర్టికల్స్ రాస్తూ ఫేస్బుక్లో పోస్టు చేస్తున్నారు. ఎక్కువగా మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అట్టడగు వర్గాల వారి సమస్యలు, జాతీ ప్రాముఖ్యత అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వీరు ఆర్టికల్స్ రాస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగే అవకాశముందనే కారణంతో, ఏకంగా జర్నలిస్టుల అకౌంట్లనే ఫేస్బుక్ డిసేబుల్ చేస్తుందట.
సెప్టెంబర్ చివరి వారంలో ఫేస్బుక్ పలువురు ప్రముఖ జర్నలిస్ట్‌ల అకౌంట్లను డిసేబుల్ చేసింది. వారిలో దైనిక్ భాస్కర్ న్యూస్ ఎడిటర్ అజయ్ ప్రకాశ్, జంజ్వార్.కామ్ ఎడిటర్ ప్రేరణ నెగి, జనతాకారిపోర్టర్.కామ్ ఎడిటర్, బీబీసీ మాజీ ఎడిటర్ రిఫత్ జావిద్, గల్ఫ్‌లో అవార్డ్ విన్నింగ్ భారతీయ జర్నలిస్ట్, కాలమిస్ట్, ఖలీజ్ టైమ్స్ మాజీ ఒపీనియన్ ఎడిటర్ అజాజ్ జాకా సయ్యద్‌లు ఉన్నారు. అంతేకాక, జర్నలిస్ట్‌లపై వేటు వేయడాన్ని ఫేస్బుక్ ఇంకా ఆపలేదట. మరికొంతమంది ఎడిటర్లపై కూడా ఫేస్బుక్ వేటు వేసినట్టు తెలిసింది.
‘ఎలాంటి కారణం లేకుండా.. న్యూస్ వెబ్సైట్ ఎడిటర్ల ఖాతాలను ఫేస్బుక్ డిసేబుల్ చేస్తోంది. జాతీయ ప్రాముఖ్యత, సమకాలీన రాజకీయ అంశాలు, అట్టడుగు గ్రూప్‌లు, మైనార్టీల సమస్యలపై ఆర్టికల్స్ రాస్తున్న ఎడిటర్లనే ఫేస్బుక్ టార్గెట్ చేసింది’ అని కారవాన్‌డైలీ.కామ్ ట్వీట్ చేసింది. ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్‌లు వాసిమ్ త్యాగి, సంజయ్ పాండే వంటి వారి అకౌంట్లను కూడా ఫేస్బుక్ డిసేబుల్ చేసింది. దీంతో ఎడిటర్లు ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఫేస్‌బుక్‌ను తెలియపరిచారు. ఫేస్బుక్ ఎలాంటి నోటీసులు లేకుండా తమ అకౌంట్లను డిసేబుల్ చేయడంపై మండిపడ్డారు. పదేపదే ఫిర్యాదు చేయడంతో, కొంతమంది అకౌంట్లను ఫేస్బుక్ రిస్టోర్ చేసింది. అయితే కొంతమంది అకౌంట్లను ఇప్పటికీ డిసేబుల్‌లోనే ఉంచినట్టు తెలిసింది.
‘నా అకౌంట్ ఇప్పటికీ డిసేబుల్‌లోనే ఉంది. కొత్త ఐడీ క్రియేట్ చేసుకుని, ఫేస్‌బుక్‌కు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, అకౌంట్‌ను రిస్టోర్ చేయలేదు. భారత్‌లో మైనార్టీలపై పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా రచనలు రాసినందుకే నా అకౌంట్‌ను డిసేబుల్ చేసినట్టు నేను భావిస్తున్నా’ అని అజాజ్ జాకా సయ్యద్ అభిప్రాయపడ్డారు. న్యూస్ ఇంటర్నేషనల్, అరబ్ న్యూస్, గల్ఫ్ న్యూస్, స్ట్రయిట్స్ టైమ్స్ ఆఫ్ సింగపూర్, గ్రేటర్ కశ్మీర్, ఇన్కిలాబ్ ఉర్దూ డైలీ వంటి పలు జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్స్‌కు సయ్యద్ రచయితగా ఉన్నారు. దేశీయ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఆమోదించదగినది కాదని, ఒకవేళ అలా చేస్తే భారత్‌లో ఫేస్‌బుక్‌ను బ్లాక్ చేస్తారని జర్నలిస్ట్ సంజయ్ పాండే హెచ్చరించారు. ఇప్పటికే పలు దేశాల రాజకీయాల్లో ఫేస్బుక్ జోక్యం చేసుకుందని ఆ కంపెనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికి రెండు సార్లు ఫేస్బుక్ నా ఐడీని డిస్‌బుల్ చేసింది. నేను ఫేస్బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్‌లను అనుసరిస్తా. ఇదే మీ ఫ్రీ స్పీచ్’ అంటూ జర్నలిస్ట్ వాసిమ్ అక్రమ్ త్యాగి, ఫేస్‌బుక్‌ను ప్రశ్నించారు.