ఆహారం మిగిలిందా.. మాకివ్వండి
తణుకు అర్బన్(పశ్చిమగోదావరి): శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పాహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నాయి తణుకుకు చెందిన ఫీడ్ ద నీడ్ – గిఫ్ట్ ఎ మీల్ రిఫ్రిజరేటర్స్ కేంద్రాలు. పేదల ఆకలిని తీర్చేందుకు తణుకు ప్రభుత్వ ఆస్పత్రి ముఖద్వారంలో, తణుకు సొసైటీ రోడ్డులోని బాలగంగాధర తిలక్ ఆడిటోరియం ప్రాంతంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకూడదనే..
ఏ ఒక్కరూ కూడా ఆకలితో పడుకోకూడదనే లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో తణుకులో ఏర్పాటుచేసిన రెండు కేంద్రాలు ఇప్పుడు అన్నపూర్ణలుగా మారాయి. ఫీడ్ ద నీడ్ – గిఫ్ట్ ఏ మీల్ రిఫ్రిజరేటర్లను ఈనెల 21న ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు పేదలకు ఆహారాన్ని అందించడంలో సేవలందిస్తున్నాయి. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వా తాతలు, దివ్యాంగుల, అనాథల కడుపులు నింపుతున్నాయి. ఈ కేంద్రాల్లో మూడు షిఫ్టుల్లోను ముగ్గురు ,చొప్పున ఆరుగురు విధుల్లో ఉండి పేదలకు ఆహారాన్ని అందించేలా రూపకల్పన చేశారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్‌ల్లో భద్రపరచడం, ఆహారం కోసం వచ్చే పేదలకు ఆహారాన్ని అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గృహాలు, శుభకార్యాల్లో మిగిలిన ఆహారం
గృహాలు, శుభకార్యాల్లోను మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా ఔదార్యం ఉన్న మహానుభావులు ఈ కేంద్రాలకు తరలిస్తే వాటిని ఫ్రిజ్‌లలో ఉంచి పేదలకు అందించే విధంగా ఏర్పాటుచేశారు. మానవత్వం, సామా జిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రాలకు అందచేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఎమ్మెల్యే కారుమూరి, పట్టాభి ఫౌండేషన్ ఔదార్యం
ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాల్లో ఒక కేంద్రం ఏర్పాటుకు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు రూ. 7 లక్షలు అందించగా, మరొక కేంద్రాన్ని తణుకుకు చెందిన పట్టాభి ఫౌండేషన్ సంస్థ ఏర్పాటుచేశారు. అంతేకాకుండా మునిసిపాలిటీ కూడా విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు.
గుప్పెడు ఆహారం అందించడం కోసమే..
పేదలకు గుప్పెడు ఆహారం అందించాలనే లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాలు ఏర్పాటుచేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. ఆహారం లేక ఖాళీ కడుపుతో ఏ ఒక్కరూ పడుకోకూడదనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. తణుకు ఎమ్మెల్యే కారుమూరి, అధికారులు ఎంతగానో ప్రోత్సాహం అందించారు.
– డాక్టర్ నీలిమ ఆర్య, ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా
పేదలకు ఆహారం అందించాలనే లక్ష్యం నచ్చి..
వారసుల ఆదరణ కొరవడిన అవ్వా, తాతలు, అనాథలు, దివ్యాంగులు ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వతహాగా అన్నం పెట్టడమంటే నాకు చాలా ఇష్టం. పేదలకు ఆహారం అందాలనే లక్ష్యం నచ్చి ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి కేంద్ర ఏర్పాటుపై నా దృష్టికి తీసుకురాగానే వెంటనే నా వంతుగా సాయం చేశాను. ఆ కేంద్రాల ద్వారా పేదల ఆకలి తీరడం నాకు చాలా ఆనందంగా ఉంది.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే