సేంద్రియ గుడ్లు!
‘ఆహారం సరైనదైతే ఏ ఔషధమూ అవసరం లేదు.. ఆహారం సరైనది కాకపోతే ఏ ఔషధమూ పనిచేయదు’... ఈ సూత్రాన్ని మనుషులకే కాదు ఫారం కోళ్లక్కూడా విజయవంతంగా వర్తింపజే యవచ్చని రుజువు చేస్తున్నారు ఓ మహిళా రైతు. గత రెండేళ్లుగా రసాయనిక ఔషధాలు, వాక్సిన్లు మచ్చుకి కూడా వాడకుండా 15 వేల లేయర్ కోళ్లను ఆరోగ్యదాయకంగా పెంచుతున్నారు జయప్రదారెడ్డి. చిరుధాన్యాలతో తయారు చేసుకునే దాణాలో 15% మేరకు కూరగాయలు, ఆకులు అలములు కలిపి కోళ్లకు మేపుతున్నారు. ఇందుకోసం రెండున్నర ఎకరాల్లో ఔషధ మొక్కలు, చెట్లు, పందిరి కూరగాయలు పెంచుతున్నారు. అత్యంత నాణ్యమైన ‘సేంద్రియ గుడ్ల’ను ఉత్పత్తి చేస్తూ గణనీయమైన లాభాలు గడిస్తున్నారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన ఆ మహిళా రైతు జయప్రదా రెడ్డి అభినందనీయురాలు. సాధారణ పౌల్ట్రీ రైతుగా జీవనం ప్రారంభించి సొంత ఆలోచనతో సేంద్రియ రైతుగా ఎదిగారు.
ఏదైనా రంగంలో కృషి చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన జయప్రదారెడ్డి(53)ని సేంద్రియ కోళ్ల రైతుగా మార్చింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాణిపేట ఆమె స్వగ్రామం. నిజాం సర్కారులో కొత్వాల్‌గా పని చేసిన రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి వంశంలోని కుటుంబానికి కోడలిగా వచ్చిన జయప్రదారెడ్డి పెళ్లి తర్వాత హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేశారు. భర్త జనార్దన్‌రెడ్డి గతంలో జైళ్లవిభాగంలో హైదరాబాద్‌లో పనిచేసి డీఎస్పీగా రిటైరయ్యారు. ఆ తర్వాత రాణిపేటకు మకాం మారింది. ఆ దశలో ఏడేళ్ల క్రితం భర్త ప్రోత్సాహంతో జయప్రదారెడ్డి రాణిపేటలోని తమ ఇంటి దగ్గర్లోని సొంత భూమిలో షెడ్లు నిర్మించి లేయర్ (గుడ్లు పెట్టే) కోళ్ల ఫారాన్ని ప్రారంభించారు. దాణా గోదాము నిర్మించారు. ఇందుకోసం రూ. 45 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నారు.
లేయర్కోళ్ల పెంపకంలో ఒక పంట కాలం వంద వారాలు. ఒకరోజు వయసున్న కోడి పిల్లలను హేచరీ నుంచి తెచ్చి ఫారంలో పెంచుతారు. అయితే, కోళ్ల ఫారం నిర్వహణలో అనుభవరాహిత్యం వల్ల మొదటి పంట కాలంలో ఎదిగిన కోళ్లను కొన్నారు. నిపుణుల సూచన మేరకు ఔషధాలు, వాక్సిన్లు వాడినప్పటికీ జబ్బు పడి కోళ్లు చనిపోయాయి. 60వ వారానికే ఆ బ్యాచ్ మొత్తాన్నీ తీసేయాల్సి వచ్చింది. రూ. లక్షల్లో నష్టం వచ్చింది. అయినా, అధైర్యపడకుండా, సొంత భూమి తనఖా పెట్టి వర్కింగ్ క్యాపిటల్‌గా రూ. 30 లక్షలు రుణం తీసుకొని రెండో బ్యాచ్ కోడిపిల్లల పెంపకం చేపట్టారు. మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జలు తదితరాలతో కూడిన దాణా ఇచ్చే వారు. 45 రోజులకోసారి వ్యాక్సిన్ వేయడంతోబాటు ఔషధాలూ వాడేవారు. తరచూ జబ్బులు వచ్చేవి. రెండో బ్యాచ్‌ను 82 వారాల్లో తీసేయాల్సి వచ్చింది. ఆరుబయట గరికను కొరుక్కు తినే నాటు కోళ్లు ఆరోగ్యంగా ఉండటం గమనించిన జయప్రదారెడ్డికి, తన ఫారం కోళ్లకు పెట్టే దాణాలో డ్రై ఫీడ్తోపాటు గరికను, మేకలు తినే రకరకాల ఆకులను కలిపి పెడితే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న ఆలోచన వచ్చింది. ప్రయోగాత్మకంగా గరికను దాణాలో కలపడం ప్రారంభించగా కొద్ది రోజుల్లోనే మంచి మార్పు వచ్చింది. ఆ మార్పు ఆమెను ఉత్సాహపరచింది.
15% మేరకు ఆకులు, కూరగాయలు
మూడో బ్యాచ్ కోడి పిల్లల పెంపకం ప్రారంభించిన తొలిదశ నుంచే దాణాలో పూర్తిస్థాయి మార్పులు చేశారు. గరిక, ఆకులతోపాటు టమాటా, సొర వంటి కూరగాయలను సైతం ముక్కలుగా తరిగి ప్రయోగాత్మకంగా దాణాలో కలిపి కోళ్లకు మేపడం మొదలు పెట్టారు. ఆహారంలో చేసిన మార్పులు మంచి ఫలితాలిస్తున్నట్లు గమనించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. వివిధ ధాన్యాలు(డ్రై ఫీడ్) 85%, ఆకులు–కూరగాయలు కలిపి 15% మేరకు దాణాలో కలపడం ప్రారంభించారు.
డ్రై ఫీడ్‌లో సగం మేరకు ధాన్యాలు, సగం మేరకు నూనె తీసిన తెలగపిండి ఉండేలా చూస్తున్నారు. మొక్కజొన్న(45%), సజ్జలు, జొన్నలు, కొర్రలు (తలా ఒక 10%)తో పాటు తవుడు, నూకలు, గడ్డిగింజల(మిగతా 25%)తో పాటు ఇదే మోతాదులో తెలగపిండులు కలిపి మరపట్టించి దాణాగా వాడుతున్నారు.
ఎకరం భూమిలో పెరుగుతున్న గరిక, కరివేపాకు, సొర ఆకు, కానుగ చిగుర్లు, బాదం ఆకులు, కొబ్బరి ఆకులు, మునగాకు, సపోటా ఆకులు, చింత ఆకులు, వేపాకులు, నేరేడాకులు, మామిడి ఆకులు వేస్తున్నారు. ఎండాకుల పొడిని కూడా వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి గుజ్జు కూడా అడపా దడపా వేస్తున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడు టమాటా, ఉల్లిపాయలు, సొరకాయలు వంటి కూరగాయలను రోజూ ఉదయం చాఫ్ కట్టర్‌తో ముక్కలు చేసి.. గ్రైండర్లో వేసి డ్రైఫీడ్తో కలగలిపి.. రోజుకు రెండు సార్లు కోళ్లకు మేపుతున్నారు. ఎకరంన్నర భూమిలో ప్రత్యేకంగా సొర పాదులు పెంచి.. ఆ కాయలను కోళ్లకు వినియోగిస్తున్నారు.
మూడో బ్యాచ్ నుంచి హెర్బల్ ఎగ్స్
మూడో బ్యాచ్‌లో పూర్తి సేంద్రియంగా హెర్బల్ గుడ్ల ఉత్పత్తి చేపట్టడంతో అంతకుముందు చేసిన అప్పులన్నీ తిరిపోయాయని, 90వారాలు అనుకుంటే 98 వారాల వరకు 85% గుడ్ల ఉత్పత్తితో కొనసాగించానని, కల్ బర్డ్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయని జయప్రదారెడ్డి ఎంతో సంతోషంగా చెప్పారు. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ సగంలో ఉంది. గుడ్ల ఉత్పాదకత బాగుంది. ఎండాకాలం కాబట్టి రోజుకు 150 నిమ్మకాయల రసం దాణాలో కలుపుతున్నారు. గుడ్డు సాఫ్ట్‌గా, నీచు వాసన లేకుండా, రుచి నాటు గుడ్ల మాదిరిగా ఉంటున్నదని ఆమె తెలిపారు. కుంటుతున్న కోళ్లకు చింత గింజలు, చింతాకు, చింతపండు దాణాలో కలిపి 15 రోజులు ఇస్తే సమస్య తగ్గిందని జయప్రదారెడ్డి తెలిపారు. కోళ్లు రొప్పుతూ ఉంటే (దగ తీయటం) మొదట్లో వంట సోడా ఫీడ్‌లో కలిపి ఇచ్చేవాళ్లం. 3 ఏళ్ల నుంచి వాడటం లేదు. ప్రతి 45 రోజులకోసారి రోగనిరోధక శక్తి పెంచడానికి వాక్సిన్ ఇచ్చే వాళ్లం అది కూడా ఇవ్వడం లేదు. రోజుకు ఐదారు గంటల పాటు విద్యుత్ లైట్లు వేసేవాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది.
గతంలో రెండు, మూడు రోజులకోసారి ఏదో ఒక మందు వేయాల్సి వచ్చేది. దాణాలో మార్పులు చేసి ఆకులు, కూరగాయలు వాడుతున్న తర్వాత గత రెండేళ్లుగా ఎటువంటి రసాయనిక వ్యాక్సిన్లు గాని, యాంటిబయాటిక్స్ గాని, ఇతర రసాయనిక ఔషధాలు గానీ కోళ్లకు వాడాల్సిన అవసరమే రాలేదని జయప్రదారెడ్డి అన్నారు. ‘జయ హెర్బల్ ఎగ్స్’ బ్రాండ్ పేరుతో ఆమె గుడ్లను విక్రయిస్తున్నారు. హైదరాబాద్, కర్నూలులోని అనేక మాల్స్ వారు వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ గుడ్లు 20 రోజుల వరకు నిల్వ∙ఉంటున్నాయన్నారు. గతంలో షెడ్ నుంచి వంద మీటర్ల దూరం వరకు దుర్వాసన వచ్చేది. ఈగలు, దోమల బెడద బాగా ఉండేదని, కోళ్ల పెంట బాగా దుర్వాసన వచ్చేది. ఇప్పుడు వాసన బాగా తగ్గిపోయింది. జర్మనీ శాస్త్రవేత్తలు అభినందించడం సంతోషాన్నిచ్చిందన్నారు. రసాయన రహితంగా గుడ్లను ఉత్పత్తి చేస్తున్న ఆమె ఆదర్శప్రాయురాలు.
కోడిలా జీవించాలి!
కోళ్లను పెంచే రైతులు తామే కోడిలా జీవించాలి. 24 గంటలూ వాటికి ఏమేమి అవసరమో శ్రద్ధగా గమనిస్తూ ఏ లోటూ రాకుండా చూసుకోవాలి. పని వాళ్లు చేస్తారులే అని వదిలేసి ఊరుకుంటే జరగదు. ఇంట్రెస్టుగా చెయ్యటం ముఖ్యం. కూర చేసినా మనసుపెట్టి ఇంట్రెస్టుగా చెయ్యాలి. అలాగే కోళ్లను కూడా ఇష్టంగా చూసుకోవాలి. నేను ఉదయం 5.30 గంటలకే షెడ్ దగ్గరకు వెళ్లి ఫీడ్ మిక్సింగ్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నా. ఇష్టంగా పనులు చేసుకుంటూ ఉంటే కోళ్ల ఫారంలో పెట్టుబడి ఆరేళ్లలో తిరిగి వచ్చేస్తుంది.
– జయప్రదారెడ్డి (86394 21276), రాణిపేట, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ
∙కోళ్ల కోసం సొరకాయలు కోస్తున్న జయప్రదారెడ్డి
కొర్రలు, సొర ముక్కలు, ఎండాకులతో తయారవుతున్న దాణా
అమ్మకానికి సిద్ధం
దాణాలో కలిపేందుకు సొరకాయలను కట్ చేస్తూ...
– బొలెమోని రమేష్, సాక్షి, వనపర్తి
ఫొటోలు: ఎం.యాదిరెడ్డి