- జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్
ఫీడింగ్ మిక్సింగ్ ప్లాంట్‌లకు ఔత్సాహిక మహిళలు
Published Mon, Oct 3 2016 11:13 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కాకినాడ సిటీ :
జిల్లాలో పశుపోషణకు అవసరమైన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌ల ఏర్పాటులో ఔత్సాహిక మహిళలను ప్రోత్సహించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ కోర్టుహాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దాణాకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పెద్దాపురం మండలం తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్లాంట్ మాదిరి 50 యూనిట్లు జిల్లాలో ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో రూ.25 లక్షలతో ఏనిమల్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ హాస్టల్‌లో వంద పశువులకు దాణా అందిస్తూ, ఆక్కడ ఉత్పత్తి అయ్యే పాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారన్నారు. మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో చేపలు ఎండబెట్టే ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. పొలాల్లో నిర్మించిన పంటకుంటల్లో పెంచేందుకు చేప పిల్లలను పంపిణీ చేయాలని సూచించారు.
మరుగుదొడ్ల నిర్మాణానికి నెలవారీ లక్ష్యాలు
అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి 2019కు ముందే బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించడానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో దానవాయిపేటలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జేసీ సత్యనారాయణ, జేసి–2 రాధాకృష్ణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement