వికాసం: అల్లరికి నిర్వచనం
‘‘...పిల్లలకి రెండేళ్లు వచ్చేవరకూ నడవమని, మరింత మాట్లాడమనీ ప్రోత్సహిస్తాం. ఆ తరువాత ఇరవై ఏళ్లు కుదురుగా కూర్చోమని, మౌనంగా ఉండమని ప్రార్థిస్తాం’’ అంటుంది 69 మంది పిల్లల తల్లి మిస్సెస్ ఫియొడెర్ వసిలేవ్(ప్రపంచ రికార్డ్ హోల్డర్). తల్లిదండ్రులకి ‘పేరెంటింగ్’ మీద ఇచ్చే ఉపన్యాసాల్లో, ‘అల్లరి’ అంటే ఏమిటో నిర్వచించమని అడిగినప్పుడు, చాలామంది తల్లిదండ్రులు కూడా సరి అయిన సమాధానం చెప్పలేదు. తమకి విసుగు కలిగించే ప్రతీ పనినీ అల్లరి అంటారు చాలామంది తల్లిదండ్రులు. ‘‘పెద్దలు చెప్పిన మాట వినకపోవటమే అల్లరి’’ అంటారు మరికొందరు. నిర్వచనానికి ఇది కాస్త దగ్గరగా ఉన్నా నూటికి నూరుపాళ్లు కరెక్ట్ కాదు. ‘తిను’ అంటే తినకపోవటం, ‘ఆడు’ అంటే ఆడకపోవటం అల్లరి ఎలా అవుతుంది?
బద్దకం, ఆలస్యంగా నిద్ర లేవటం, చెప్పిన మంచి మాట వినకపోవటం, ఎప్పుడూ పక్కమీదే పడుకొని ఉండటం, చిన్న చిన్న దొంగతనాలు చెయ్యటం, గట్టిగా అరుస్తూ గెంతులెయ్యటం, అతిథుల్ని డిస్టర్బ్ చెయ్యడం, అన్నం తినకపోవటం, తింటున్న ప్లేట్లు విసిరెయ్యటం, గంటల తరబడి టీవీ చూడటం, పెద్ద గొంతుతో వాదించటం... అన్నీ అల్లరిలోకే వస్తాయి. అల్లరి చాలావరకు క్రమశిక్షణా రాహిత్యంతో కూడుకున్నది. తల్లిదండ్రుల బలహీనత మీద పిల్లలు ఆడుకునే గేమ్‌తో అది మొదలవుతుంది. పిల్లలకి అల్లరి (ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్) తల్లిదండ్రులే నేర్పుతారు అంటే ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు. అమ్మ చేసిన కూర నచ్చకపోతే దఢేలున ప్లేటు విసిరేస్తాడు కుర్రవాడు. బయట రూమ్‌లో పేపర్ చదువుతున్న తండ్రి విసుగ్గా ‘ఎందుకే వాడినలా విసిగిస్తావు? వాడికి ఇష్టమైందేదో చేసి పెట్టొచ్చు కదా’ అని తిడతాడు. తనకి కావలసింది కావాలంటే నాన్నని విసిగించాలి అన్న విషయం కుర్రవాడికి అర్థమవుతుంది.
ముగ్గురూ బజారు వెళ్లినప్పుడు, క్రికెట్ బ్యాట్ కొనిపెట్టమంటే తండ్రి ‘మొన్నే కదా కొనిచ్చాను’ అని తిడతాడు. అప్పుడు ఆ కుర్రవాడు తల్లి దగ్గరికి వెళ్లి, ‘అమ్మా బ్యాటు... అమ్మా బ్యాటు’ అంటూ అందరూ వినేలా రాగం తీస్తాడు. ఈమెకీ బ్యాటుకీ సంబంధం ఏమిటా అని చుట్టూ ఉన్నవారందరూ వింతగా చూడటంతో ఆమె ఇబ్బందిపడి భర్తతో ‘వాడికి బ్యాట్ కొనిస్తారా? లేదా?’ అని బెదిరించినట్లు అడుగుతుంది. తండ్రి చచ్చినట్టు కొనిపెడతాడు.
అప్పుడా కుర్రవాడికి ఒక విశ్వ రహస్యం అర్థమవుతుంది. ఇంట్లో నాన్నని విసిగించటం ద్వారా, బయట అమ్మని విసిగించటం ద్వారా, మొత్తం మీద అమ్మానాన్నలని ఆ విధంగా విడగొట్టడం ద్వారా తనక్కావలసిన పనులు చేయించుకోవచ్చు అని ఒక పాఠం నేర్చుకుంటాడు. ఒక సర్వే ప్రకారం పదహారేళ్లు వచ్చేసరికి టీనేజర్స్ సగటున పదివేల క్రైమ్, వయొలెన్స్, రొమాన్స్, హారర్ సంఘటనలు చదివి గానీ, సినిమాల్లో చూసి గానీ, విని గానీ ఉంటారట. కొన్ని వందల టీవీ సీరియల్స్ చూసి ఉండటం వల్ల వాళ్లకి ‘పెద్దలకి తెలివితేటలు ఉండవనీ, తండ్రులు తిట్టడానికీ, తల్లులు ఏడవటానికీ మాత్రమే పనికివస్తారనీ’ ఒక గాఢమైన అభిప్రాయం ఏర్పడిపోయి ఉంటుందిట.
పిల్లల్లో అల్లరి తగ్గాలంటే భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. ఒకరు తిడుతున్నప్పుడు మరొకరు మాట్లాడకూడదు. ‘నువ్వు మమ్మల్ని విడగొట్టి మా బలహీనతల మీద ఆడుకోలేవు’ అన్న విషయం పిల్లవాడికి స్పష్టంగా అర్థమయ్యేలా ప్రవర్తించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ క్రమశిక్షణతో ఉండాలి. తాము టీవీ చూస్తూ, పిల్లల్ని వేరే గదిలో కూర్చుని చదువుకోమంటే అది సాధ్యం కాదు. చాలామంది పెద్దలు తాము గొప్ప తెలివిగా పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నామనుకొంటారు. తమ కన్నా పిల్లలు తెలివైనవాళ్లు అని నమ్మాలి.
ఒక తండ్రి భారతదేశ పటాన్ని రాష్ట్రాలవారిగా కత్తిరించి కూతురికిచ్చి, ‘అరగంటలో వీటిని సరిగ్గా అతికించి చూపించు’ అన్నాడు. ఆ అమ్మాయి అయిదు నిమిషాల్లో ఆ పని చేసింది. ఆశ్చర్యపోయిన తండ్రి ‘ఇంత అద్భుతంగా ఎలా చేశావు’ అని అడిగితే, ఆ అమ్మాయి, ‘ఏముంది? వెనుక వైపు నా అభిమాన హీరో బొమ్మ చూసి అతికించాను’ అని చెప్పింది.
- యండమూరి వీరేంద్రనాథ్
yandamoori@hotmail.com