Fiat Chrysler
-
జీప్ స్పీడ్‌కు ఫియట్ క్రిస్లర్ సై
న్యూఢిల్లీ, సాక్షి: దేశీయంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పట్టు సాధించేందుకు 25 కోట్ల డాలర్లను(సుమారు రూ. 1,850 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్లోబల్ ఆటో దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా రానున్న రెండేళ్లలో నాలుగు కొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను(ఎస్‌యూవీలు) ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. పెట్టుబడులను స్థానిక తయారీ కోసం వెచ్చించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ఎస్‌యూవీలలో మధ్యస్థాయి, మూడు వరుసల వాహనాలను రూపొందించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు జీప్ ర్యాంగ్యులర్, జీప్ చెరొకీ వాహనాల అసెంబ్లింగ్‌ను చేపట్టనున్నట్లు వివరించింది. ఈ బాటలో జీప్ కంపాస్ ఎస్యూవీ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. (కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి) 1 శాతమే ప్రస్తుతం దేశీ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్సీఏ) వాటా 1 శాతానికంటే తక్కువగానే ఉన్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. పోర్ట్‌ఫోలియోలో కొత్త వాహనాలను జత చేసుకోవడం ద్వారా వాటాను పెంచుకునే ప్రణాళికల్లో కంపెనీ ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా స్థానికంగా విడిభాగాలను సమకూర్చుకోవడం ద్వారా ఆర్థికంగానూ పటిష్టపడే యోచనలో ఉన్నట్లు వివరించారు. వెరసి వ్యయాలు తగ్గించుకుంటూ అమ్మకాలు పెంచుకునే బాటలో కంపెనీ సాగనున్నట్లు తెలియజేశారు. 25 కోట్ల డాలర్ల కొత్త పెట్టుబడుల కారణంగా పలు విభాగాలలో బలాన్ని పెంచుకోనున్నట్లు ఎఫ్సీఏ ఇండియా ఎండీ పార్ధ దత్తా చెప్పారు. తమ వాహనాలకు విడిభాగాలను స్థానికంగానే సమకూర్చుకునేందుకు సంసిద్ధమై ఉన్నట్లు వెల్లడించారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) టాప్ గేర్‌లో నిజానికి కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆటో రంగ దిగ్గజాలు పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నట్లు పరిశ్రమ విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ 2019 నుంచీ ఆటో రంగం నెమ్మదించినట్లు ప్రస్తావించారు. దీంతో జపనీస్ దిగ్గజం హోండా మోటార్ రెండు ప్లాంట్లలో ఒకదానిని మూసివేసేందుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇదేవిధంగా 2017లోనే దేశీయంగా కార్ల విక్రయాలను నిలిపివేసిన జనరల్ మోటార్స్ ఎగుమతుల కోసం చేపడుతున్న కార్ల ఉత్పత్తికి సైతం మంగళం పాడుతున్నట్లు గత నెలలో వెల్లడించింది. అయితే మరోవైపు గత రెండేళ్లలో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటార్స్, చైనా దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ కార్ప్ దేశీ మార్కెట్లలో ప్రవేశించిన విషయం విదితమే. తయారీ ఇలా పశ్చిమ భారతంలో దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌తో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్లాంటులో కొత్త ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు ఎఫ్సీఏ వెల్లడించింది. కంపెనీ విడుదల చేయనున్న మూడు వరుసల ఎస్యూవీ ప్రధానంగా ఫోర్డ్ మోటార్ తయారీ ఎండీవర్, టయోటా తయారీ ఫార్చూనర్లతో పోటీ పడే వీలున్నట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. తాజా పెట్టుబడులతో దేశీయంగా ఎఫ్సీఏ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ 70 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 5,200 కోట్లు) చేరనున్నట్లు తెలియజేశారు. వీటిలో గ్లోబల్ టెక్ సెంటర్‌కు కేటాయించిన15 కోట్ల డాలర్లు కలసి ఉన్నట్లు చెప్పారు. -
ఎం అండ్ ఎండ్‌కు పేటెంట్ షాక్
అమెరికాలో దేశీయ ఆటో మేజర్ మహీంద్ర అండ్ మహీంద్రకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ చేపట్ట నున్నామని అమెరికా రెగ్యులేటరీ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ మంగళవారం ప్రకటించింది. జీప్ డిజైన్ విషయంలో అమెరికా వాహన దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ చేయనున్నట్టు తెలిపింది. జీప్ రూపకల్పనలో మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిన వివాదంలో మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ ఉత్పత్తి చేసిన ఆఫ్-రోడ్ యుటిలిటీ వాహనం రోక్సార్కి సంబంధించి పేటెంట్-సంబంధిత దర్యాప్తును ప్రారంభించనున్నట్టు ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ (ITC) ఒక ప్రకటనలో తెలిపింది. 45 రోజుల వ్యవధిలో దాని దర్యాప్తును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదట్లో ఈ వార్తలను కొట్టి పారేసిన ఎంఅండ్‌ఎండ్ ఈ అంశాన్ని ధృవీకరించింది. ఫియట్ క్రిస్లెర్ ఫిర్యాదుపై ఐటిసి దర్యాప్తు చేపట్టనుందని మహీంద్ర ఆటోమోటివ్ ఉత్తర అమెరికా మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు రిచ్ అన్సెల్ వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు ఫియట్ క్రిస్లర్ అందుబాటులో లేదు. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఎం అండ్ ఎం షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా అమెరికాలో మహీంద్రా రోక్సార్ విక్రయాలను నిలిపివేయాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌ను ఫియట్ క్రిస్లర్ ఇటీవల ఆశ్రయించింది. తమ అనుబంధ సంస్థ జీప్ డిజైన్లను మహీంద్రా వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
ఫియట్ తొలి మేడిన్ ఇండియా ‘జీప్ కంపాస్’
మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి పుణే: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లర్’ భారతీయ అనుబంధ సంస్థ ‘ఎఫ్సీఏ ఇండియా ఆటోమొబైల్స్’ తాజాగా తొలి మేడిన్ ఇండియా ‘జీప్ కంపాస్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. పుణేలోని రన్జన్గావ్ ప్లాంటులో జరిగిన ఈ ఎస్యూవీ ఆవిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్సీఏ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (ఆసియా పసిఫిక్ ప్రాంతం, చైనా మినహా) పాల్ అల్కల, ఎఫ్సీఏ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ ఫ్లిన్ తదితరులు పాల్గొన్నారు. తాజా ఆవిష్కరణతో జీప్ కంపాస్ ఎస్‌యూవీలను తయారు చేసి, ఎగుమతి చేసే దేశాల (చైనా, మెక్సికో, బ్రెజిల్) సరసన భారత్ కూడా చేరింది. జీప్ వాహనాల స్థానిక తయారీకి 280 మిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేశామని అల్కల తెలిపారు. పేర్కొన్నారు. జీప్ కంపాస్‌ను ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పారు. -
ఫియట్ తో గూగుల్ భాగస్వామ్యం అంతేనా..!
ఫియట్ క్రిస్లర్ ఆటోమోబైల్స్ తో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల భాగస్వామ్యం కొనసాగించే ప్రణాళికలు ఇంకా తమ దగ్గర ఏమీ లేవని అల్ఫాబెట్ ఇంక్ గూగుల్ చెప్పింది. ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీకి ఇతర సమర్థవంతులైన భాగస్వామ్య కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల మొదట్లో 100 సెల్ఫ్ డ్రైవింగ్ మినీవ్యాన్స్ ను తయారుచేయడానికి గూగుల్ కు, ఫియట్ క్రిస్లర్ కు మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం ఫియాట్ క్రిస్లర్ తో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ యాజమాన్యాన్ని షేర్ చేసుకోవడం కాదని, కేవలం 100 కార్ల తయారీ వరకేనని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ క్రాఫ్సిక్ చెప్పారు. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో కార్లను ఉత్పత్తిచేయడానికి తాము ఇంకా వివిధ ఆటోమేకర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఎప్పటినుంచి ప్రజలకు అందుబాటులోకి తేనుందో గూగుల్ ఇంకా వెల్లడించలేదు. 15లక్షల మైల్స్ వరకూ టెస్ట్ డ్రైవింగ్ నిర్వహించింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్ ను త్వరగా ప్రజల ముందుకు తీసుకురావడం తమ బాధ్యతని, ప్రస్తుతం హ్యుమన్ డ్రైవర్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ఈ సిస్టమ్ ను రూపుదిద్దామని క్రాఫ్సిక్ తెలిపారు. హ్యుమన్ డ్రైవర్ వల్ల జరిగే ప్రమాదాల్లో ఏడాదికి 33వేల మరణాలు సంభవిస్తుండగా, 23లక్షల మంది క్షతగాత్రులు పాలవుతున్నట్టు చెప్పారు. -
8.9 లక్షల ఫియట్ వాహనాలు రీకాల్
డెట్రాయిట్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ 'ఫియట్' పెద్ద సంఖ్యలో వాహనాలను వెనక్కి పిలిచింది. ఫియట్ క్రిస్లర్కు చెందిన వాహనాల యాంటీ లాక్ బ్రేక్స్, ఎయిర్ బ్యాగ్‌లలో సమస్యలు తలెత్తడంతో ఫియట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలలో జీప్, డోగ్జే, ఫియట్ ఎస్యూవీ రకానికి చెందినవి ఉన్నాయి. యాంటీ లాక్ బ్రేక్ వ్యవస్థలో తేమ చేరే అవకాశాలు ఉన్నందున, సమస్యను పరిష్కరించడానికి వాహనాలను వెనక్కి పిలుస్తున్నట్లు ఫియట్ తెలిపింది. ఈ నిర్ణయంతో 2012 నుండి 2015 మధ్య కాలంలో తయారైన 5.5 లక్షల డోగ్జే వాహనాలలో సమస్యలను పరిష్కరించనున్నారు. -
వచ్చే ఏడాదే ఫియట్ జీప్ బ్రాండ్ వాహనాలు
వాషింగ్టన్: ఫియట్ క్రిస్లర్ కంపెనీ రానున్న ఐదేళ్లలో 12 కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తేనున్నది. వీటిల్లో 9 మోడళ్లను భారత్‌లోనే అసెంబుల్ చేస్తామని, మిగిలిన మూడింటిని దిగుమతి చేసుకుంటామని కంపెనీ వివరించింది. వచ్చే ఏడాది నుంచి జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లోనే తయారు చేయనున్నామని పేర్కొంది. ఈ ఏడాది అబర్త్ బ్రాండ్ వాహనాలు, అబర్త్ 500ను, కాంపాక్ట్ ఎస్యూవీ ఫియట్ అవెంచురను మార్కెట్లోకి తెస్తామని వివరించింది. హ్యాచ్‌బాక్ గ్రాండే పుంటో, మీడియమ్ సైజ్ సెడాన్ లినియాను ఈ ఏడాదే అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఇక వచ్చే ఏడాది జీప్ బ్రాండ్‌లో ర్యాంగ్లర్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని వివరించారు. 2018 కల్లా మహారాష్ట్రలోని రాంజన్గావ్ ప్లాంట్ నుంచి ఆరు కొత్త మోడళ్లు రానున్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో మూడు మోడళ్లను తయారు చేస్తున్నామని వివరించింది. ప్రస్తుతం డీలర్‌షిప్‌లు వంద ఉన్నాయని, 2018 కల్లా వీటి సంఖ్యను రెట్టింపు చేయనున్నామని ఫియట్ క్రిస్లర్ కంపెనీ పేర్కొంది.