అమెరికాలో దేశీయ ఆటో మేజర్ మహీంద్ర అండ్ మహీంద్రకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ చేపట్ట నున్నామని అమెరికా రెగ్యులేటరీ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ మంగళవారం ప్రకటించింది. జీప్ డిజైన్ విషయంలో అమెరికా వాహన దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ చేయనున్నట్టు తెలిపింది.
జీప్ రూపకల్పనలో మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిన వివాదంలో మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ ఉత్పత్తి చేసిన ఆఫ్-రోడ్ యుటిలిటీ వాహనం రోక్సార్‌కి సంబంధించి పేటెంట్-సంబంధిత దర్యాప్తును ప్రారంభించనున్నట్టు ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ (ITC) ఒక ప్రకటనలో తెలిపింది. 45 రోజుల వ్యవధిలో దాని దర్యాప్తును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే మొదట్లో ఈ వార్తలను కొట్టి పారేసిన ఎంఅండ్‌ఎండ్ ఈ అంశాన్ని ధృవీకరించింది. ఫియట్ క్రిస్లెర్ ఫిర్యాదుపై ఐటిసి దర్యాప్తు చేపట్టనుందని మహీంద్ర ఆటోమోటివ్ ఉత్తర అమెరికా మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు రిచ్ అన్సెల్ వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు ఫియట్ క్రిస్లర్ అందుబాటులో లేదు. మరోవైపు ఈ వార్తల నేపథ‍్యంలో ఎం అండ్ ఎం షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది.
కాగా అమెరికాలో మహీంద్రా రోక్సార్ విక్రయాలను నిలిపివేయాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌ను ఫియట్ క్రిస్లర్ ఇటీవల ఆశ్రయించింది. తమ అనుబంధ సంస్థ జీప్ డిజైన్లను మహీంద్రా వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment