Fighter plane
-
దడ పుట్టించిన చేజింగ్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ చిన్న విమానాన్ని జెట్ విమానం వెంబడించడం కలకలం రేపింది. అసాధారణ వేగంతో ప్రయాణిస్తూ యుద్ధ విమానం నుంచి వెలువడిన సోనిక్ శబ్ధం వాషింగ్టన్ వాసుల గుండెల్లో దడ పుట్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏవియేషన్ విభాగం సమాచారం ప్రకారం.. ఆ సెస్నాసైటేషన్ విమానం టెన్నెస్సీలోని ఎలిజెబెత్టన్ నుంచి బయలుదేరింది. లాంగ్ ఐల్యాండ్‌లోని మెక్ ఆర్థర్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా, న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మీదుగా, సరాసరి వాషింగ్టన్ డీసీ వైపుగా వచ్చింది. దేశ రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన నిషిద్ధ ప్రాంతాల మీదుగా అది వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేడియో సిగ్నళ్లకు పైలట్ స్పందించకపోవడంతో వెంటనే ఎఫ్–16 జెట్ విమానాన్ని పంపారు. అది సోనిక్ శబ్ధంతో ప్రయాణిస్తూ దూసుకెళ్లింది. ఆ శబ్దం వాషింగ్టన్‌తోపాటు, మేరీల్యాండ్, వర్జీనియాలోని కొన్ని ప్రాంతాల వారికి సైతం వినిపించింది. సదరు విమానం పైలట్ దృష్టిలో పడేందుకు ఫైటర్ జెట్ ఎఫ్–16 విమానం మంటలను సైతం వదులుతూ వెళ్లింది. భూమిపైని వారి భద్రతను, సదరు విమానం భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వర్జీనియాలోని మౌంట్ మొంటెబెల్లోకు సమీపంలోని పర్వత ప్రాంతంలో చివరికి చిన్న విమానం కుప్పకూలింది. విమానం మండిపోయిందని, అందులో వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు. చివరి క్షణంలో అది నిమిషానికి 30 వేల అడుగుల చొప్పున వేగంగా నేలవైపుగా దూసుకొచ్చిందని ఫ్లైట్ ట్రాకింగ్ రికార్డులు చెబుతున్నాయి. పర్వత ప్రాంతంలో విమానం కూలిన చోటుకు కాలినడకన చేరుకునేందుకు పోలీసులకు దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఫ్లోరిడాకు చెందిన ఎన్కోర్ మోటార్స్ పేరిట ఆ విమానం రిజిస్టరై ఉంది. ఈ కంపెనీ నిర్వాహకుడు జాన్ రంపెల్ మాట్లాడుతూ..ఆ విమానంలో పైలట్‌తోపాటు తన కూతురు, రెండేళ్ల మనవరాలు, ఆయా ఉన్నారన్నారు. వీరు నార్త్ కరోలినా నుంచి ఈస్ట్ హాంప్టన్‌కు వస్తున్నారన్నారు. విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇది 1999 నాటి ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పట్లో లీయర్జెట్ విమానం సాంకేతిక లోపం తలెత్తి అడ్డదిడ్డంగా తిరుగుతూ సౌత్ డకోటా ప్రాంతంలో కూలిపోయింది. అందులోని ఆరుగురూ చనిపోయారు. -
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే..
పణాజి : భారత నావికాదళానికి చెందిన మిగ్-29 యుద్ధవిమానం గోవాలో ఆదివారం ఉదయం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. రొటీన్ ట్రైనింగ్‌లో భాగంగా టేకాఫ్ అయిన విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గోవాలోని వాస్కో వద్దగల ఐఎన్ఎస్ హంస బేస్ నుంచి ఈ విమానం ఎగిరింది. రెండు ఇంజన్లు, సింగిల్ సీటర్ గల ఈ విమానం.. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదానికి గురైనట్టు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, 2019 నవంబర్, 2018 జనవరి నెలల్లో కూడా రెండు మిగ్-29 విమానాలు కుప్పకూలాయి. ఆ ప్రమాదాల్లోంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. -
మిగ్–27కు వీడ్కోలు
జోథ్‌పూర్: దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్(ఎంఐజీ)–27 యుద్ధ విమానాలు ఇక విశ్రాంతి తీసుకోనున్నాయి. జోథ్‌పూర్ వైమానిక స్థావరంలో శుక్రవారం జరిగిన మిగ్ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్కే ఘోటియా పాల్గొన్నారు. ఈ విమానాలు పోరాటక్షేత్రంలో ముందు నిలిచాయని, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమూల్యమైన సేవలందించాయని తెలిపారు. ఇన్నాళ్లూ జోథ్‌పూర్ ఎయిర్ బేస్‌లో మిగ్–27 రకం విమానాలు ఏడు వరకు సేవలందించాయి. -
తేజస్ ‘అరెస్టెడ్ ల్యాండింగ్’ సక్సెస్
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’మరో అరుదైన ఘనత సాధించింది. గోవాలోని ఓ నావికా కేంద్రంలో తొలిసారి విజయవంతంగా అరెస్టెడ్ ల్యాండింగ్‌ను పూర్తి చేసింది. అతి తక్కువ స్థలం మాత్రమే ఉండే విమాన వాహక నౌకలపై సమర్థవంతంగా దిగేందుకు అరెస్టెడ్ ల్యాండింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. విమానం ముందుభాగంలో ఉన్న కొక్కెం ల్యాండింగ్ సమయంలో డెక్‌పై ఉన్న ఓ తీగను అందుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటుంది. తద్వారా తక్కువ పొడవున్న విమాన వాహక యుద్ధ నౌక రన్‌వేపై సులువుగా ల్యాండ్ అవుతుంది. నిమిషానికి 1,500 అడుగుల వేగంతో ప్రయాణిస్తూ.. యుద్ధ విమానానికి ఏ మాత్రం నష్టం కలగకుండా ల్యాండ్ కావడం ఈ ప్రక్రియలోని విశేషం. ఇది విజయవంతంగా పూర్తవడంతో నేవీలోనూ తేజస్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. నేవీ కోసం ప్రస్తుతం రెండు తేజస్ విమానాలను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఒకే ఒక్క సీటుండే తేజస్‌తో అరెస్టెడ్ ల్యాండింగ్ విజయవంతం కావడంతో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తరువాత ఈ సామర్థ్యమున్న యుద్ధ విమానాన్ని రూపొందించిన ఘనత భారత్‌కే దక్కింది. మరి కొన్నిసార్లు ఇదే ఫలితాలను సాధిస్తే పరీక్ష కేంద్రంలో కాకుండా అసలైన యుద్ధనౌకపై అరెస్టెడ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు మొదలవుతాయి. -
సాంకేతిక లోపంతో కూలిన ఫైటర్ విమానం
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోని విఖ్యాత్ వెంచర్లో బుధవారం ఓ ఫైటర్ శిక్షణ విమానం సాంకేతిక లోపంతో నేలకూలింది. అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్ హకీంపేటలో గల భారత వాయుసేనకు చెందిన స్థావరంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్ యాదవ్ పైలట్‌గా శిక్షణ తీసుకుంటున్నాడు. బుధవారం ఉదయం యోగేశ్ హకీంపేట నుంచి ఫైటర్ శిక్షణ విమానంలో బయల్దేరాడు. సరిగ్గా 11.40 గంటల సమయంలో విమానం బాహుపేట సమీపంలోకి రాగానే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని కంట్రోల్ చేయడానికి యోగేశ్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో గ్రామ శివారులో ఉన్న విఖ్యాత్ వెంచర్ వద్దకు రాగానే ప్యారాచూట్ సాయంతో కిందకి దూకాడు. విమానం సుమారు అర కిలోమీటర్ దూరంలో కుప్పకూలిపోయి, పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో పైలట్ యోగేశ్ కాళ్లకు తీవ్ర గాయాలై చచ్చుబడి పోయాయి. ప్రమాదం జరిగిన అరగంటకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మరో హెలికాప్టర్లో ఆర్మీ వైద్యులు అక్కడికి చేరుకున్నారు. యోగేశ్‌కు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ నిపుణులు పరిశీలించారు. భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేశ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. -
72 ఏళ్ల తర్వాత బయటపడింది!
అది ఎప్పుడో 1944వ సంవత్సరం. అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం భీకరంగా జరుగుతోంది. ముగ్గురు సిబ్బందితో కూడిన అమెరికా బాంబర్ విమానం ఒకటి శత్రుస్థావరాల మీద దాడికి బయల్దేరింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా అది వెళ్తుండగా శత్రుసైన్యాలు దాన్నిగుర్తించి పేల్చేశాయి. దాంతో ఆ విమానం కాస్తా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ఘటన జరిగి ఇప్పటికి 72 ఏళ్లు గడిచింది. టీబీఎం-1సి అవెంజర్ విమానం ఇన్నేళ్ల తర్వాత సముద్ర అడుగుభాగంలో కనిపించింది. దాంట్లోనే విమాన సిబ్బంది అవశేషాలు కూడా కనిపించాయి. ఇన్నాళ్ల బట్టి ఆ విమానం కోసం శాస్త్రవేత్తలు గాలిస్తూనే ఉన్నారు. ఇలా వివిధ సందర్భాల్లో కనిపించకుండా పో యిన అమెరికన్ విమానాలను కనిపెట్టేందుకు 'ప్రాజెక్ట్ రికవర్'ను చేపట్టారు. ఆ ప్రాజెక్టు సాధించిన విజయాల్లో ఇదొకటి. అత్యాధునిక సోనార్ టెక్నాలజీని ఉపయోగించి విమానాలు ఎక్కడున్నాయో వీళ్లు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన సిబ్బంది మృతదేహాలలో మిగిలిన భాగాలను దేశానికి తీసుకొచ్చి, వారికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ప్రాజెక్ట్ రికవర్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎరిక్ టెరిల్ తెలిపారు. -
'ఇరాక్ ఫైటర్ జెట్‌ను కూల్చేశాం'
బాగ్దాద్: తాము ఇరాక్ ఫైటర్ జెట్ విమానాన్ని కూల్చివేశామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ వెల్లడించింది. అంబార్ ప్రావిన్స్ లోని రామాదికి ఉత్తరాన దానిని పడగొట్టామని స్పష్టం చేసింది. అయితే, దీని వివరాలు మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన సున్నీ దళానికి చెందిన సవా అనే ఉగ్రవాది ట్విట్టర్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అతడి ప్రకటన ప్రకారం రష్యా తయారు చేసిన ఎస్‌యూ-25 ఇరాక్ విమానం తాము కాల్పులు జరిపాక మంటల్లో ఇరుక్కుపోయిందని, అనంతరం రామాది వద్ద కూలిపోయిందని అతడు వెల్లడించారు. -
కూలిన యుద్ధవిమానం: ఒకరు మృతి
లాస్ ఏంజిల్స్: యూఎస్‌లో ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. కాలిఫోర్నియా వెంట్యురా కౌంటీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. విమానం కుప్ప కూలిన వెంటనే మంటలు భారీగా ఎగసిపడ్డాయని... అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతుందని చెప్పారు. ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.