కుప్పకూలి బూడిదైన పైటర్ విమానం, (ఇన్‌సెట్‌లో) గాయపడిన పైలట్ యోగేశ్ యాదవ్
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోని విఖ్యాత్ వెంచర్‌లో బుధవారం ఓ ఫైటర్ శిక్షణ విమానం సాంకేతిక లోపంతో నేలకూలింది. అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్ హకీంపేటలో గల భారత వాయుసేనకు చెందిన స్థావరంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్ యాదవ్ పైలట్‌గా శిక్షణ తీసుకుంటున్నాడు. బుధవారం ఉదయం యోగేశ్ హకీంపేట నుంచి ఫైటర్ శిక్షణ విమానంలో బయల్దేరాడు. సరిగ్గా 11.40 గంటల సమయంలో విమానం బాహుపేట సమీపంలోకి రాగానే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని కంట్రోల్ చేయడానికి యోగేశ్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో గ్రామ శివారులో ఉన్న విఖ్యాత్ వెంచర్ వద్దకు రాగానే ప్యారాచూట్ సాయంతో కిందకి దూకాడు.
విమానం సుమారు అర కిలోమీటర్ దూరంలో కుప్పకూలిపోయి, పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో పైలట్ యోగేశ్ కాళ్లకు తీవ్ర గాయాలై చచ్చుబడి పోయాయి. ప్రమాదం జరిగిన అరగంటకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మరో హెలికాప్టర్‌లో ఆర్మీ వైద్యులు అక్కడికి చేరుకున్నారు. యోగేశ్‌కు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ నిపుణులు పరిశీలించారు. భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్‌ఐ రమేశ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment