Film Journalist
-
యాంకర్ సుమ గొప్ప మనసు.. వారి కోసం ఆర్థిక సాయం!
టాలీవుడ్లో యాంకర్ సుమ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈవెంట్ ఏదైనా సరే సుమక్క లేకపోతే ఏదో కాస్తా తక్కువైనట్లు అనిపిస్తుంది. అంతలా తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే సుమ యాంకరింగ్‌తో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థ పేరుతో ఆమె సేవలందిస్తున్నారు. ఏదైనా పండుగ వచ్చిందంటే తన వంతు సహకారంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు రూ.5 లక్షల చెక్‌ను అందజేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్‌కు సాయం అందజేసినట్లు సుమ వెల్లడించారు. ఈ విషయంలో నాట్స్ సహకారం గొప్పదని సుమ తెలిపారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. బబుల్ గమ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. A heartfelt thank you to @follownatsworld for their generous 5 Lakh donation to the @FilmJournalists through @ItsSumaKanakala @FestivalsforJoy Special appreciation to #SreedharAppasani Garu, #ArunaGanti, #BapuNuthi , #PrashanthPinnamaneni & #RajAllada garu, #NATS Board of… pic.twitter.com/FJo1Bzzx57 — Telugu Film Journalists Association (@FilmJournalists) December 25, 2023 -
ఫన్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు వి. జయశంకర్ సమర్పణలో రవిపొలిశెట్టి నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టైటిల్ లోగో విడుదల పాత్రికేయుల చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ చిత్రం థియేటర్స్‌లో గట్టిగా సౌండ్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్ ఫన్ రైడ్ చిత్రం’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘పాతిక రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ఇది మా యూనిట్‌కు, వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు రవి పొలిశెట్టి. -
బాక్సాఫీస్ వద్ద సీక్వెల్స్ హల్చల్
-
చిత్రసీమ ఆత్మబంధువు బి.ఎ. రాజు ఇకలేరు
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్ఓ, నిర్మాత బి.ఎ. రాజు (61) ఇకలేరు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారని బి.ఎ. రాజు కుమారుడు, దర్శకుడు శివకుమార్ తెలిపారు. విజయవాడలో పుట్టిన బి.ఎ. రాజుకి హీరో కృష్ణ అంటే అభిమానం. కృష్ణ వద్ద పనిచేయాలని చెన్నై వెళ్లారు రాజు. కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పీఆర్ఓగా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కృష్ణ ప్రోత్సాహంతో సినీ జర్నలిస్ట్‌గా మారారు. జ్యోతిచిత్ర, ఆంధ్రజ్యోతి, ఉదయం, శివరంజని వంటి దిన, వార పత్రికల్లో జర్నలిస్ట్‌గా చేశారు. 1994లో తన భార్య, జర్నలిస్ట్ బి. జయతో కలసి ‘సూపర్‌హిట్’ వారపత్రికను ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషల్లోని ఎందరో హీరోలు, నిర్మాతలు, దర్శకులకు, 1500 సినిమాలకుపైగా పీఆర్ఓగా చేశారు. నాటి తరంలో కృష్ణతో మొదలుపెట్టి ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ఆ తర్వాతి తరంలో ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇలా పలువురు అగ్రకథానాయకుల చిత్రాలకు పీఆర్వోగా చేశారు. ‘కృష్ణగారి సినిమాలకు చేశాను.. వారి అబ్బాయి మహేశ్‌బాబు చిత్రాలకు చేస్తున్నాను.. భవిష్యత్తులో మహేశ్ అబ్బాయి గౌతమ్ హీరో అయినా తన సినిమాలకు కూడా చేస్తాను’ అంటుండేవారు రాజు. నిర్మాతగా మారి, తన భార్య జయ దర్శకత్వంలో ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, వైశాఖం’ వంటి సినిమాలు నిర్మించారాయన. ‘ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షునిగానూ చేశారు బి.ఎ. రాజు. కాగా 2018లో రాజు భార్య, దర్శకురాలు జయ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు కుమారులు అరుణ్ కుమార్, శివకుమార్ ఉన్నారు. ఇద్దరూ సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అరుణ్ కుమార్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు. శివ కుమార్ దర్శకుడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘22’ సినిమా విడుదల కరోనా లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. ఇటు పాత్రికేయులకు అటు చిత్రసీమకు మధ్య వారధిగా ఉన్న రాజు హఠాన్మరణం పాత్రికేయులకు, చిత్రసీమకు ఓ షాక్. బి.ఎ. రాజు అంత్యక్రియలు శనివారం మహాప్రస్థానంలో జరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రాజు ఇక లేరంటే నమ్మశక్యంగా లేదని, అందరి ఆత్మబంధువులా మెలిగిన ఆయన లేని లోటు తీర్చలేనిదని పాత్రికేయులు, సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ప్ప్రముఖుల నివాళి మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని బి.ఎ. రాజు నాతో షేర్ చేసుకునేవారు. సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్టు రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన. ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత ప్యాషన్ ఉన్న పత్రికా జర్నలిస్ట్. రాజుగారిలాంటి వ్యక్తి ఉండటం పరిశ్రమ అదృష్టం. – చిరంజీవి బి.ఎ. రాజుగారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఇకపై ఆయన మన మధ్య ఉండరనే వార్త కలచివేసింది. – బాలకృష్ణ 37 సంవత్సరాలుగా నా శ్రేయోభిలాషి, ప్రియ మిత్రుడు బి.ఎ. రాజు లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీరనిది. – నాగార్జున చెన్నైలో ఉన్నప్పటి నుంచే రాజుగారితో నాకు పరిచయం ఉంది. సినిమా అంటే తపన ఉన్న జర్నలిస్ట్ ఆయన. నిర్మాతగానూ నిలబడ్డారు ఆయన. – పవన్ కల్యాణ్ వృత్తిపరమైన అనుబంధం హద్దులు లేని ప్రేమతో వ్యక్తిగత అనుబంధంగా ఎలా మారుతుందో చూపించిన వ్యక్తి రాజుగారు. – సూర్య తెలుగు, తమిళ చిత్రాల మధ్య మంచి వారధి వేసిన బి.ఎ. రాజు గుర్తుండిపోతారు. – విక్రమ్ నేను అన్నయ్యలా భావించే రాజుగారి మరణం నన్నెంతగానో కలచివేసింది. నా కెరీర్ అంతా ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. – విశాల్ బి.ఎ. రాజు.. నువ్వు లేని తెలుగు సినిమా మీడియా, పబ్లిసిటీ ఎప్పటికీ లోటే.. నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు గుర్తుండిపోతాయి. – కె.రాఘవేంద్రరావు ఫిల్మ్ జర్నలిస్టుగా, 1500 సినిమాలకు పీఆర్వోగా చేసిన అనుభవం ఉన్న బి.ఎ. రాజులాంటి సీనియర్ వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరం. – ఎస్.ఎస్. రాజమౌళి సూపర్‌స్టార్ కృష్ణగారి అభిమానుల ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు ఇచ్చే వ్యక్తిగా బి.ఎ. రాజుగారు నాకు పరిచయం అయ్యారు. కృష్ణగారి ‘సింహాసనం’ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న రోజులవి. బి.ఎ. రాజు ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమా పోస్టర్స్ డిజైన్ చేస్తున్న సమయంలో నేను ‘శివ’ సినిమా పోస్టర్స్ డిజైనింగ్‌లో ఉన్నాను. బీఏ రాజుతో పాటు ఆయన చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుంది – దర్శకుడు తేజ బి.ఎ. రాజుగారు వేడుకల్లోనే కాదు... ఇబ్బందుల్లోనూ మాతో ఉన్నారు. సినిమాలంటే ఉన్న ప్రేమతోనే ఆయన కృష్ణగారికి దగ్గరయ్యారు. అదే ప్రేమను మహేశ్‌పైనా చూపించారు. మా సినిమాలకు సంబంధించిన ఏ చిన్న వేడుకయినా ఆయన పూలతో వచ్చేవారు. అలాంటిది ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్ని ఓ పువ్వును సమర్పించుకో లేనందుకు బాధగా ఉంది. మా హృదయాల్లో నిలిచే ఉంటారు. – నమ్రత నా జీవితంలో సానుకూలమైన ఆలోచనల కాంతిని వెలిగించిన వ్యక్తి బీఏ రాజుగారు. సినిమా హిటై్టనా.. ఫ్లాప్ అయినా ఆయన చెప్పే మాటలు కొత్త ఉత్సాహాన్ని నింపేవి. – సమంత -
వర్మా వర్మా వర్మా.. ఓ రాంగ్ గోపాల్ వర్మ
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కమెడియన్ ‘షకలక’ శంకర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా పోస్టర్‌ను మహిళాభ్యుదయవాది సంధ్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘మహిళల పట్ల చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టల్ని ఎండగడుతూ ప్రభు రూపొందించిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను’ అన్నారు. ‘ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయిన నేను ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం నేను రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ..’ అనే పాటను త్వరలో విడుదల చేస్తాం’ అని ప్రభు తెలిపారు. (రాంగ్ గోపాల్ వర్మ) -
ఫిల్మ్ జర్నలిస్టుల కోసం అండగా...
కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ఫిల్మ్ జర్నలిస్టులకు ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్’(టీఎఫ్జేఏ) అండగా ఉంటుందని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 35 మంది ఫిల్మ్ జర్నలిస్టులకు టీఎఫ్జేఏ ఆధ్వర్యంలో 30 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రెస్‌మీట్స్‌కి హాజరయ్యే విలేకరులకు, ఫొటో, వీడియో జర్నలిస్టులకు టీఎఫ్జేఏ అండగా ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదనేది సంస్థ ముఖ్యోద్దేశం. ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులు టీఎఫ్జేఏని సంప్రదించవచ్చు’’ అన్నారు. -
‘ఎఫ్ఎన్ఏఈఎమ్’కు మెగాస్టార్ చేయూత
ఫిలిం జర్నలిస్ట్‌ల కోసం ఫిలిం న్యూస్ కాస్టర్స్ అసోషియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న కార్యక్రమాలను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా సహాయం చేశారు. భవిష్యత్తులో కూడా సభ్యుల శ్రేయస్సు కోసం ఎటువంటి సహాయం చేయటానికైనా ముందుంటానని చెప్పారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ను కలిసి అసోషియేషన్ పెద్దలు మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల అసోషియేష్ సభ్యులకు సినిమా ప్రముఖుల చేతుల మీదుగా చేతుల మీదుగా హెల్త్ కార్డులు అందచేసిన విషయం తెలిసిందే. -
ఈ వయసులో కొత్త ఉత్సాహం
ఈ అవార్డు - సీనియర్ జర్నలిస్ట్ నందగోపాల్ ‘‘ఎనభయ్యేళ్ళ వయసులో నాకు మళ్ళీ నూతనోత్సాహాన్నిచ్చిన అవార్డు ఇది’’ అని సీనియర్ సినీ జర్నలిస్టు నాదెళ్ళ నందగోపాల్ వ్యాఖ్యానించారు. అయిదేళ్లు శ్రమించి, ‘సినిమాగా సినిమా’ అంటూ ఆయన చేసిన రచన ‘ఉత్తమ సినీ గ్రంథం’గా జాతీయ అవార్డుకు ఎంపికైంది. బుధవారం సాయంత్రం ఈ అవార్డు ప్రకటన వెలువడిన వెంటనే కలసిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆయన తన స్పందనను తెలిపారు. మరో 2 తెలుగు సినీ గ్రంథాలతో సహా, దేశం నలుమూలల నుంచి వచ్చిన 43 ప్రముఖుల రచనల మధ్య పోటీలో నందగోపాల్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ‘‘ఇంత పోటీలో, ఇందరు హేమాహేమీల మధ్య నాకు అవార్డు రాదేమో అని అనుకున్నా. కానీ, న్యాయం జరిగింది. నిష్పక్షపాతంగా అవార్డు ఎంపిక చేశారు’’ అని నందగోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి నుంచి మన తెలుగు దాకా సినీ పరిశ్రమలోని వివిధ సాంకేతిక విభాగాల పరిణామాన్నీ, ప్రస్థానాన్నీ ఈ 424 పేజీల గ్రంథంలో స్థ్థూలంగా వివరించారాయన. ‘‘పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన ‘ఫిల్మ్ ఎప్రీసియేషన్’ కోర్సు, ఇరవయ్యేళ్ళ పైగా వివిధ జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు హాజరైన అనుభవం, తొమ్మిదిన్నరేళ్ళ సెన్సార్ బోర్డు సభ్యత్వం - ఇవన్నీ ఈ రచనకు నాకు పునాదులు’’ అన్నారాయన. రేపల్లెలో పుట్టి, మద్రాసులో డిగ్రీ చేసి, 1952లో దర్శకుడు కె. ప్రత్యగాత్మ సహాయకుడిగా ‘జ్వాల’ పత్రికతో జర్నలిస్టయ్యారు నందగోపాల్. ‘తెలుగుతెర’, ‘కినిమా’ లాంటి పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన ఈ కురువృద్ధుడు 1995లో ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు అందు కున్నారు. ‘‘ఇప్పుడీ గ్రంథానికి అవార్డు వచ్చిందంటే నా రచనతో పాటు, దాన్ని ఎంతో అందంగా ముద్రించిన ‘ప్రగతి’ ప్రింటర్స్ హనుమంతరావు పాత్రను మర్చిపోలేను’’ అని నందగోపాల్ అన్నారు. ఈ అవార్డుతో ఉత్తమ సినీ గ్రంథ రచయితగా జాతీయ అవార్డునందుకున్న మూడో తెలుగు సినీ జర్నలిస్ట్ అయ్యారాయన. - రెంటాల జయదేవ -
‘బాలీవుడ్’కు ‘భావన’ భాష్యం
సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: టీనేజ్ అమ్మాయి. తల్లితండ్రులు లేరు. కెనడాలో అక్కదగ్గరుంటోంది. ఒక ప్రకటన చూసి ఇంటర్వ్యూకి వెళ్లి ఫిలిం జర్నలిస్ట్ అయ్యింది. మూడు దశాబ్దాలు సినిమా రీలులా తిరిగాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మైలురాళ్లో! బ్లాక్‌బస్టర్ ఫిలిం మేగజైన్ ‘స్క్రీన్’కు చీఫ్ ఎడిటర్. అబ్జర్వర్, హిందు, హిందుస్థాన్ టైమ్స్ తదితర పత్రికలకు కాలమిస్ట్. ‘అమితాబ్ బచన్ ద లెజెండ్-సలాం బాలీవుడ్-టాకింగ్ సినిమా’ తదితర 12 ప్రతిష్టాత్మక పుస్తకాల రచయిత. షబనా అజ్మీ కోసం: ‘మాసూమ్, ఆజ్కా ఎంఎల్ఏ, కామ్యాబ్’లకు చిత్రరచన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 92.7 బిగ్ ఎఫ్ఎంలో రోజూ ఉదయం ఆమె కంఠం హిందీ సినిమా తాజా కబుర్లను వినిపిస్తుంది. ఇంతకీ ఎవరామె..? రేడియో-టీవీ-ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియమ్లలో సినిమాలను రిపోర్ట్ చేస్తోన్న ఎవర్గ్రీన్ జర్నలిస్ట్ ‘భావనా సోమయ్య’. ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’ ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం ప్రధానవేదిక ఆషియానాలో ‘బాలీవుడ్ సంగతులు’ అంశంపై చర్చాగోష్టిలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ‘భావనా’తరంగాలు.. అమ్మ సలహా పాటించా.. జర్నలిస్ట్లతోను, సినిమా వాళ్లతో చనువుగా ఉండడం ఇష్టం లేని తల్లి తన కెరీర్ తొలి రోజుల్లో ‘చీకటి పడకముందే ఇంటికిరా. గబ్బర్‌సింగ్ లాంటివారి ఇంటర్వ్యూలు చేయమంటే ఒప్పుకోకు’ అని తల్లి చెప్పారని గుర్తు చేసుకున్నారు భావన. ఒక పత్రిక ఫిలిం ఎడిటర్‌గా పనిచేయమని అవకాశం వచ్చినపుడు తనకు అంతటి సామర్థ్యం లేదని భావించానని, ‘మూడు నెలలు పనిచెయ్యి, నువ్వు పనికిరావని తెలుసుకునేందుకైనా అంత సమయం పడుతుందని’ తల్లి ఇచ్చిన సలహాను పాటించానని భావన చమత్కరించారు. దాదాపు 16 ఏళ్లు అమితాబ్ బచర్ మీడియాను నిషేధించారని, ఆ దశలో అమితాబ్‌పై తాను రాసిన అనేక వ్యాసాల గురించి విన్న ఆయన ఆ క్లిప్పింగ్స్ అడిగితే ఇచ్చానన్నారు. వాటిని అమితాబ్ దంపతులు చదివి పుస్తకంగా తీసుకువచ్చారన్నారు. సినిమాల్లో నగ్న సన్నివేశాలను చూపడాన్ని తాను తప్పు పట్టనని రెండు పర్యాయాలు సెన్సార్‌బోర్డ్ సలహా సంఘం సభ్యురాలిగా పనిచేసిన భావన పేర్కొన్నారు. అయితే, కెమెరాను వల్గర్ ఏంగిల్స్‌లో చూపే వ్యక్తుల కుసంస్కారాన్ని తప్పుపడతానన్నారు. కథ, వినోదం కోసమే సినిమాలు.. ‘లంచ్‌బాక్స్’ లాంటి ఉత్తమ చిత్రాలు కాకుండా చెత్త సినిమాలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నకు బదులిస్తూ.. అన్ని సినిమాలు నచ్చినట్లుండాలనే ధోర ణిని తాను హర్షించ లేనన్నారు. కొన్ని సినిమాలు కథ కోసం, కొన్నిటిని వినోదం కోసం చూస్తారని గుర్తు చేశారు. తెలుగు అస్సలు తెలీకపోయినా తన మామగారు విపరీతంగా తెలుగు సినిమాలు చూస్తారనే ఒక కాశ్మీరీ కోడలి వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉదహరించారు. జర్నలిస్ట్లలోనూ రకరకాలుంటారని, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకు వచ్చే ధోరణి సమర్ధనీయం కాదని పేర్కొన్నారు. వివిధ భాషాచిత్రాలు రూపొందుతోన్న ముంబై పేరుతో కేవలం హిందీ సినిమాలను సూచించే ‘బాలీవుడ్’ పేరును మహేష్‌భట్ పెట్టారని ఇది అనుచితమేనన్నారు. -
సినీ పాత్రికేయులు ఎల్.బాబురావు కన్నుమూత
హైదరాబాద్:ప్రముఖ సినీ పాత్రికేయులు, సినిమా పీఆర్వో లగడపాటి బాబురావు (48) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్, యూసఫ్‌గూడలోని స్వగృహంలో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. సినీ జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న బాబూరావుకు అటు పాత్రికేయ రంగంలోను, ఇటు సినీ రంగంలోను మంచి గుర్తింపు ఉంది. ఆయన పాతికేళ్ల సినీ పాత్రికేయ ప్రస్థానం ‘ఈనాడు’తో మొదలయ్యింది. అనంతరం ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, శివరంజని, సాక్షి వంటి ప్రముఖ దినపత్రికల్లో పనిచేశారు. ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ‘శివరంజని’ నుంచి బయటకు వచ్చాక... ‘చిత్రం’ అనే సినీ వారపత్రికను స్థాపించారు. అనేక హంగులతో వెలువడిన ఈ పత్రిక... తెలుగు సినీ జర్నలిజంలో సంచలనంగా నిలిచింది. బాబురావు ఆధ్వర్యంలోని ఆ పత్రిక వినూత్నమైన విధానంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది. ‘సాక్షి’ పత్రిక ప్రారంభం నాటి నుంచీ సినిమా పేజీకి ఇన్చార్జిగా ఉన్నారు బాబూరావు. ఒకవైపు జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సినీ పీఆర్వోగా కూడా కెరీర్‌ను కొనసాగించారు. వాణిశ్రీ, మోహన్‌బాబు, జయసుధ, సౌందర్య, స్రవంతి రవికిశోర్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రాశి, లయ, మమతా మోహన్‌దాస్, హన్సిక, రామ్ వంటి అనేకమంది సినీ ప్రముఖులకు బాబురావు పీఆర్వోగా వ్యవహరించారు. పాత, కొత్త సినీ తరాలకు వారధిలా వ్యవహరించిన బాబూరావు తెలియని సినీ జనాలు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిగా అందరి మన్ననలనూ అందుకున్న బాబూరావు బాబూరావు మృతిపై పలువురు సినీ, పాత్రికేయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు ప్రముఖులంతా తరలి వచ్చారు. బాబూరావు అవివాహితులు. స్నేహానికి ప్రాణమిచ్చేవారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే సాయమందించడానికి ముందుండేవారు. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తూ, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాబూరావు మృతి తీరని లోటని ఆయన స్నేహితులు, పరిచయస్తులు ఆవేదన చెందుతున్నారు. నేడు హైదరాబాద్‌లోని పంజగుట్ట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.