ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్‌ఓ, నిర్మాత బి.ఎ. రాజు (61) ఇకలేరు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారని బి.ఎ. రాజు కుమారుడు, దర్శకుడు శివకుమార్ తెలిపారు.
విజయవాడలో పుట్టిన బి.ఎ. రాజుకి హీరో కృష్ణ అంటే అభిమానం. కృష్ణ వద్ద పనిచేయాలని చెన్నై వెళ్లారు రాజు. కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పీఆర్‌ఓగా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కృష్ణ ప్రోత్సాహంతో సినీ జర్నలిస్ట్‌గా మారారు. జ్యోతిచిత్ర, ఆంధ్రజ్యోతి, ఉదయం, శివరంజని వంటి దిన, వార పత్రికల్లో జర్నలిస్ట్‌గా చేశారు. 1994లో తన భార్య, జర్నలిస్ట్ బి. జయతో కలసి ‘సూపర్‌హిట్’ వారపత్రికను ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషల్లోని ఎందరో హీరోలు, నిర్మాతలు, దర్శకులకు, 1500 సినిమాలకుపైగా పీఆర్‌ఓగా చేశారు.
నాటి తరంలో కృష్ణతో మొదలుపెట్టి ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ఆ తర్వాతి తరంలో ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇలా పలువురు అగ్రకథానాయకుల చిత్రాలకు పీఆర్వోగా చేశారు. ‘కృష్ణగారి సినిమాలకు చేశాను.. వారి అబ్బాయి మహేశ్‌బాబు చిత్రాలకు చేస్తున్నాను.. భవిష్యత్తులో మహేశ్ అబ్బాయి గౌతమ్ హీరో అయినా తన సినిమాలకు కూడా చేస్తాను’ అంటుండేవారు రాజు. నిర్మాతగా మారి, తన భార్య జయ దర్శకత్వంలో ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, వైశాఖం’ వంటి సినిమాలు నిర్మించారాయన.
‘ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షునిగానూ చేశారు బి.ఎ. రాజు. కాగా 2018లో రాజు భార్య, దర్శకురాలు జయ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు కుమారులు అరుణ్ కుమార్, శివకుమార్ ఉన్నారు. ఇద్దరూ సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అరుణ్ కుమార్ వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు. శివ కుమార్ దర్శకుడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘22’ సినిమా విడుదల కరోనా లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. ఇటు పాత్రికేయులకు అటు చిత్రసీమకు మధ్య వారధిగా ఉన్న రాజు హఠాన్మరణం పాత్రికేయులకు, చిత్రసీమకు ఓ షాక్. బి.ఎ. రాజు అంత్యక్రియలు శనివారం మహాప్రస్థానంలో జరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రాజు ఇక లేరంటే నమ్మశక్యంగా లేదని, అందరి ఆత్మబంధువులా మెలిగిన ఆయన లేని లోటు తీర్చలేనిదని పాత్రికేయులు, సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.
ప్ప్రముఖుల నివాళి
మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని బి.ఎ. రాజు నాతో షేర్ చేసుకునేవారు. సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్టు రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన. ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత ప్యాషన్ ఉన్న పత్రికా జర్నలిస్ట్. రాజుగారిలాంటి వ్యక్తి ఉండటం పరిశ్రమ అదృష్టం.
– చిరంజీవి
బి.ఎ. రాజుగారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఇకపై ఆయన మన మధ్య ఉండరనే వార్త కలచివేసింది.
– బాలకృష్ణ
37 సంవత్సరాలుగా నా శ్రేయోభిలాషి, ప్రియ మిత్రుడు బి.ఎ. రాజు లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీరనిది.
– నాగార్జున
చెన్నైలో ఉన్నప్పటి నుంచే రాజుగారితో నాకు పరిచయం ఉంది. సినిమా అంటే తపన ఉన్న జర్నలిస్ట్ ఆయన. నిర్మాతగానూ నిలబడ్డారు ఆయన.
– పవన్ కల్యాణ్
వృత్తిపరమైన అనుబంధం హద్దులు లేని ప్రేమతో వ్యక్తిగత అనుబంధంగా ఎలా మారుతుందో చూపించిన వ్యక్తి రాజుగారు.
– సూర్య
తెలుగు, తమిళ చిత్రాల మధ్య మంచి వారధి వేసిన బి.ఎ. రాజు గుర్తుండిపోతారు.
– విక్రమ్
నేను అన్నయ్యలా భావించే రాజుగారి మరణం నన్నెంతగానో కలచివేసింది. నా కెరీర్ అంతా ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
– విశాల్
బి.ఎ. రాజు.. నువ్వు లేని తెలుగు సినిమా మీడియా, పబ్లిసిటీ ఎప్పటికీ లోటే.. నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు గుర్తుండిపోతాయి.
– కె.రాఘవేంద్రరావు
ఫిల్మ్ జర్నలిస్టుగా, 1500 సినిమాలకు పీఆర్వోగా చేసిన అనుభవం ఉన్న బి.ఎ. రాజులాంటి సీనియర్ వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరం.
– ఎస్.ఎస్. రాజమౌళి
సూపర్‌స్టార్ కృష్ణగారి అభిమానుల ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు ఇచ్చే వ్యక్తిగా బి.ఎ. రాజుగారు నాకు పరిచయం అయ్యారు. కృష్ణగారి ‘సింహాసనం’ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న రోజులవి. బి.ఎ. రాజు ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమా పోస్టర్స్ డిజైన్ చేస్తున్న సమయంలో నేను ‘శివ’ సినిమా పోస్టర్స్ డిజైనింగ్‌లో ఉన్నాను. బీఏ రాజుతో పాటు ఆయన చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుంది
– దర్శకుడు తేజ
బి.ఎ. రాజుగారు వేడుకల్లోనే కాదు... ఇబ్బందుల్లోనూ మాతో ఉన్నారు. సినిమాలంటే ఉన్న ప్రేమతోనే ఆయన కృష్ణగారికి దగ్గరయ్యారు. అదే ప్రేమను మహేశ్‌పైనా చూపించారు. మా సినిమాలకు సంబంధించిన ఏ చిన్న వేడుకయినా ఆయన పూలతో వచ్చేవారు. అలాంటిది ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్ని ఓ పువ్వును సమర్పించుకో లేనందుకు బాధగా ఉంది. మా హృదయాల్లో నిలిచే ఉంటారు.
– నమ్రత
నా జీవితంలో సానుకూలమైన ఆలోచనల కాంతిని వెలిగించిన వ్యక్తి బీఏ రాజుగారు. సినిమా హిటై్టనా.. ఫ్లాప్ అయినా ఆయన చెప్పే మాటలు కొత్త ఉత్సాహాన్ని నింపేవి.
– సమంత
Comments
Please login to add a commentAdd a comment