హైదరాబాద్:ప్రముఖ సినీ పాత్రికేయులు, సినిమా పీఆర్వో లగడపాటి బాబురావు (48) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్, యూసఫ్‌గూడలోని స్వగృహంలో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. సినీ జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న బాబూరావుకు అటు పాత్రికేయ రంగంలోను, ఇటు సినీ రంగంలోను మంచి గుర్తింపు ఉంది. ఆయన పాతికేళ్ల సినీ పాత్రికేయ ప్రస్థానం ‘ఈనాడు’తో మొదలయ్యింది. అనంతరం ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, శివరంజని, సాక్షి వంటి ప్రముఖ దినపత్రికల్లో పనిచేశారు. ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ‘శివరంజని’ నుంచి బయటకు వచ్చాక... ‘చిత్రం’ అనే సినీ వారపత్రికను స్థాపించారు. అనేక హంగులతో వెలువడిన ఈ పత్రిక... తెలుగు సినీ జర్నలిజంలో సంచలనంగా నిలిచింది. బాబురావు ఆధ్వర్యంలోని ఆ పత్రిక వినూత్నమైన విధానంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది.
‘సాక్షి’ పత్రిక ప్రారంభం నాటి నుంచీ సినిమా పేజీకి ఇన్‌చార్జిగా ఉన్నారు బాబూరావు. ఒకవైపు జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సినీ పీఆర్వోగా కూడా కెరీర్‌ను కొనసాగించారు. వాణిశ్రీ, మోహన్‌బాబు, జయసుధ, సౌందర్య, స్రవంతి రవికిశోర్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రాశి, లయ, మమతా మోహన్‌దాస్, హన్సిక, రామ్ వంటి అనేకమంది సినీ ప్రముఖులకు బాబురావు పీఆర్వోగా వ్యవహరించారు. పాత, కొత్త సినీ తరాలకు వారధిలా వ్యవహరించిన బాబూరావు తెలియని సినీ జనాలు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిగా అందరి మన్ననలనూ అందుకున్న బాబూరావు బాబూరావు మృతిపై పలువురు సినీ, పాత్రికేయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు ప్రముఖులంతా తరలి వచ్చారు.
బాబూరావు అవివాహితులు. స్నేహానికి ప్రాణమిచ్చేవారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే సాయమందించడానికి ముందుండేవారు. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తూ, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాబూరావు మృతి తీరని లోటని ఆయన స్నేహితులు, పరిచయస్తులు ఆవేదన చెందుతున్నారు. నేడు హైదరాబాద్‌లోని పంజగుట్ట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
సినీ పాత్రికేయుడు బాబురావు కన్నుమూత
Published Wed, Aug 21 2013 4:30 PM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement