film production
-
బాబు ముడుపులకు 'రోహిత్' వేషం!
బహుశా.. ఇలాంటి ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ!! ఆయన ‘స్కిల్’ మామూలుదా!! ముడుపులు పుచ్చుకోవడంలో, తీసుకున్న వాటిని తెలివిగా దారి మళ్లించి తన జేబులోకి తెచ్చుకోవడంలో ఆయన ‘స్కిల్స్’ను బయటపెట్టే ‘సినిమా’ కథ తాజాగా బయటపడింది. ఈ కథకు హీరో ఒక్కడే. బాబు సోదరుడి కొడుకు నారా రోహిత్. నిర్మాతలుగా బయటకు వేరేవారు కనిపించినా... సహ నిర్మాతలుగా, ఫైనాన్షియర్లుగా వ్యవహరించింది మాత్రం బాబు హయాంలో వివిధ ప్రాజెక్టుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. తీసిందేమో ఫ్లాపు సినిమాలు. భారీగా నష్టం వచ్చిందంటూ ప్రకటనలు. చంద్రబాబుకు మాత్రం లాభాలే లాభాలు!. అదెలాగని ఆశ్చర్యపోతున్నారా? లంచాలు దిగమింగడంలో బాబు మాస్టర్‌మైండ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించే టాలీవుడ్ సినిమాల కథ ఇదిగో... సాక్షి, హైదరాబాద్: అరె! ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రూపాయి లాభం తెచ్చిన పాపాన పోలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం బ్రేక్ ఈవెన్ (లాభనష్టాలు లేని స్థితి) సాధించింది లేదు. ప్రతి సినిమాకూ పెట్టిన పెట్టుబడిలో కనీసం 80 శాతం తిరిగి రాలేదని నిర్మాతలే చెబుతున్నారు. అలాగని అవేవీ చిన్న సినిమాలు కావు. అన్నీ 30–40 కోట్ల రేంజి బడ్జెట్ సినిమాలేనట? మరి ఇలా నష్టాలొచ్చినా సరే వదలకుండా అదే హీరోను పెట్టి వరసగా ఏడాదిలో ఆరేడు సినిమాలు తీసేశారంటే ఏమనుకోవాలి? బ్లాక్ మనీ దండిగా ఉన్నవాళ్లు కూడా నేరుగా డబ్బును కాల్చేయటం ఎందుకన్న ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు తీయరు. కానీ నారా రోహిత్‌తో మాత్రం కొందరు నిర్మాతలు పదేపదే ఫ్లాప్ సినిమాలు తీశారు. ఫ్లాపు సినిమాలిచ్చిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ ఫ్లాపు సినిమాలు తీశారు. ఒకసారి దర్శకత్వం వహించి ఫ్లాపు సినిమా ఇచ్చిన వ్యక్తి అదే హీరోతో మరో సినిమాకు నిర్మాతగా కూడా మారాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదీ... 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ‘సూపర్ స్టార్’గా మారిపోయిన ‘నారా రోహిత్’ కథ. విచిత్రమేంటంటే రోహిత్‌కు 2014కు ముందు పెద్దగా సినిమాలు లేవు. 2019లో చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయాక కూడా సినిమాలు లేవు. కానీ 2014–1019 మధ్య మాత్రం ఏకంగా 17 సినిమాలు వచ్చాయి. అంటే... చంద్రబాబు అధికారానికీ, నారా రోహిత్ సినిమాలకూ ఏదో సంబంధం ఉందనేగా అర్థం. అది ఏ సంబంధమంటే... ముడుపుల సంబంధం. బ్లాక్ మనీ సంబంధం. బాబు ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు, సంస్థలు ఆయనకు నేరుగా ముడుపులివ్వటానికి ఇబ్బంది పడ్డారు. జీఎస్టీ వచ్చాక కాంట్రాక్టర్లకు మొత్తం బిల్లులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే చెల్లించాల్సి వచ్చింది. దీంతో వారు ఆ డబ్బుల్లో నుంచి ఎవరికి ఎంత చెల్లించినా ఐటీకి లెక్కలు చెప్పాల్సి వచ్చేది. మరి బాబుకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వడమెలా? దీనికోసం మాస్టర్ మైండ్ చంద్రబాబు ఒక మార్గం కనిపెట్టాడు. తన తమ్ముడు రామ్మూర్తి నాయుడి కొడుకు నారా రోహిత్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీయాల్సిందిగా తెలిసిన నిర్మాతలు, దర్శకులకు పురమాయించాడు. దానికి కావాల్సిన డబ్బులు మాత్రం ఈ కాంట్రాక్టర్లు, తన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్లు సహ నిర్మాతల రూపంలోనో, ఫైనాన్సియర్లగానో చెల్లిస్తారు. ఓ 5 కోట్లతో పూర్తయ్యే సినిమాకు ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించటమే కాక... అంతా ఖర్చుపెట్టినట్లు చూపిస్తారు. వాస్తవంగా రూ.5 కోట్లు ఖర్చయితే.... మిగతా రూ.35 కోట్లు నేరుగా బాబు బంగళాకు చేరిపోతాయి. ఇక ఈ సినిమా ఎలాగూ ఐదారు కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేయదు. దీంతో తాము భారీగా నష్టపోయామని నిర్మాతలు ప్రకటిస్తారు. విచిత్రమేంటంటే ఇలా డిజాస్టర్ అయి నష్టపోయిన నిర్మాతలు... మళ్లీ అదే హీరోతో, మళ్లీ భారీ బడ్జెట్‌తో మరో సినిమా తీయటం. ఇలా ఏడాదిలోనే ఆరేడు సినిమాలు తీశారంటే పరిస్థితిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదీ... రోహిత్ ఫ్లాపుల కథ నారా రోహిత్ యావరేజ్ నటుడు. 2009 నుంచి 2014 వరకు.. అంటే చంద్రబాబు సీఎం కుర్చిలో లేని ఆ ఐదేళ్లలో అతను నటించిన సినిమాలు నాలుగే,. బాణం (2009), సోలో (2011), సారొచ్చారు (2012), ఒక్కడినే (2013). మొదటి రెండూ యావరేజ్ కాగా, మిగిలిన రెండూ డిజాస్టర్లు. దాంతో రోహిత్‌కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏడాది తర్వాత చంద్రబాబు సీఎం కాగానే రోహిత్ ముఖ ‘చిత్రం’ మారిపోయింది. హిట్ హీరోలకు సైతం సాధ్యం కాని స్థాయిలో వరుస పెట్టి సినీ అవకాశాలొచ్చాయి. 2019లో బాబు దిగిపోయేనాటికి ఏకంగా 17 సినిమాలు. అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. నిజానికి వీటిలో చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలీదు. మళ్లీ 2019లో చంద్రబాబు దిగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రోహిత్ చేయలేదు. ఇలా, అలా తిప్పి.. కొడుకు చేతికి డబ్బులు ఒక ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టరుకు ప్రభుత్వం రూ.500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసిందనుకోండి. ఒప్పందం ప్రకారం దీన్లో 50 శాతం అంటే రూ.250 కోట్లు ముడుపులు బాబుకివ్వాలి. నగదు రూపంలో ఇవ్వటం సాధ్యం కాదు కదా? మరి ఎలా? దీంతో కొన్ని సినిమా నిర్మాణ సంస్థలను పుట్టించారు. ఆ సంస్థల పేరిట అనేక బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. ఒక్కో ఖాతాకు చిన్న చిన్న మొత్తాల్లో రూ.250 కోట్లు తరలించారు. ఇక ఆయా ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయటం కోసం సినిమా నిర్మాణం అనే పేరు పెట్టారు. రూ.2–3 కోట్లలో చుట్టేసిన చిన్న చిన్న సినిమాలకు కూడా రూ.30–40 కోట్లు అయిందని దొంగ లెక్కలు చూపించారు. సినిమాలో రోజు వారీ ఖర్చులు కింద / ప్రొడక్షన్ ఖర్చుల కింద వాటికి దొంగ బిల్లులు పెట్టారు. ప్రతి సినిమాకు రూ.20 కోట్లు– రూ.30 కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేశారు. అలా ఎక్కడా టాక్స్ చెల్లించే సమస్య రాకుండా చూసుకున్నారు. ఇలా మొత్తం డబ్బును బ్లాక్‌గా మార్చి, అటుతిప్పి ఇటుతిప్పి ఆఖరుకు చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతికి భద్రంగా చేర్చారు. ఇలా గుంటూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఒక్కడి దగ్గరే రూ.250 కోట్లు చిన్న చిన్న మొత్తాల్లో ట్రాన్స్ఫర్ చేయించారని ఆయనే ఇటీవల వాపోయారు. ఇలా నారా రోహిత్‌ను వాడేసుకుని 17 సినిమాలు హడావుడిగా చుట్టేసి.. చాలా మంది కాంట్రాక్టర్ల నుంచి ముడుపుల డబ్బును నారా లోకేశ్‌కు అందించారు. కాంట్రాక్టర్లే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల నుంచి కూడా ఇదే తరహాలో డబ్బులు దండుకున్నారని తెలిసింది. దొంగ లెక్కలతో బురిడీ ఆయా సినిమాల అంచనా వ్యయం, లాభనష్టాలు, వాస్తవ బడ్జెట్ వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. హీరో రెమ్యునరేషన్‌తో సహా నారా రోహిత్ సినిమా బడ్జెట్ ప్రొడక్షన్ స్టార్ కాంబినేషన్‌ను బట్టి రూ.5–10 కోట్లు లోపు మాత్రమే. అయితే రోహిత్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు మాత్రం వీటి బడ్జెట్ రూ.30 నుంచి 40, 45 కోట్ల దాకా కూడా చెబుతూవచ్చారు. అదే విధంగా వాళ్ల బంధు గణంతోనే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అవతారాలు ఎత్తించి థియేట్రికల్ రైట్స్‌ను రూ.30 కోట్లు నుంచి రూ.40 కోట్లకు కొనిపించినట్లు చూపారు. అంటే ఆ సినిమాలు తీసేవాడూ, వాటిని కొనేవాడూ ఇద్దరూ ఒకరేనని తెలుస్తోంది. సినిమా ఆడలేదు కాబట్టి.. తమకు ఇంత నష్ట్టం వచ్చిందని ప్రభుత్వానికి ఈ ముఠా దొంగ లెక్కలు చూపించింది. ఇలా రోహిత్ సినిమాల ద్వారా లంచాల రూపంలో వచ్చిన బ్లాక్ మనీ సుమారు రూ.300 నుంచి 400 కోట్ల వరకు దండుకున్నారని అంచనా. ఈ ప్రశ్నలకు బదులేదీ? ► బడా స్టార్స్, క్రేజీ హీరోలకు తప్ప మరే హీరోదైనా ఒక సినిమా డిజాస్టర్ అయింది అంటే రెండో సినిమా అవకాశం కనాకష్టం. అలాంటిది వరుసగా ఇన్ని సినిమాల్లో రోహిత్ ఎలా చేయగలిగాడు? ► ఆయన సినిమాల బిజినెస్, కలెక్షన్ల ప్రకారం.. ప్రతి సినిమా రూ.20, 30 కోట్లకు పైగా భారీ నష్టాలు మూటగట్టుకుంది. అయినా కూడా నిర్మాతలు వరుస కట్టి అదే హీరోతో పదే పదే సినిమాలు ఎందుకు తీశారు? ► అతి కొద్ది మంది తప్ప నారా రోహిత్ సినిమాలు తీసిన వారిలో ఎవరూ అంతకుముందు భారీ చిత్రాలు తీసిన చరిత్ర ఉన్న నిర్మాతలు కాకపోవడం ఇక్కడ గమనార్హం. అలాంటప్పుడు వారు ఈయనతో మాత్రమే భారీ చిత్రాలు ఎందుకు తీశారు? ► ఆయా నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో కొందరు.. నారా రోహిత్ సినిమాల కోసమే పుట్టినట్టుగా పుట్టి ఆ తర్వాత కనిపించక పోవడం వెనుక అంతరార్థం ఏమిటి? ► నారా రోహిత్ సినిమా నిర్మాతల్లో పలువురికి తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉండడం వెనుక మతలబు ఏమిటి? బాబు హయాంలో ఏకంగా 17 సినిమాలు 2014: ప్రతినిధి 2015: రౌడీ ఫెలో, అసుర, తుంటరి, సావిత్రి, 2016: రాజా చెయ్యి వేస్తే, జో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడుండేవాడు 2017: శమంతకమణి, ఒక్కడు మిగిలాడు, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, మెంటల్ మదిలో 2018: నీది నాది ఒకే కథ, ఆటగాళ్లు, వీరభోగ వసంతరాయలు -
వివేక్ ఒబెరాయ్‌కి రూ.1.55 కోట్ల టోకరా
ముంబై: సామాన్యులే కాదు, ప్రముఖులు సైతం ఆర్థిక నేరాల బారినపడుతున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పోగొట్టుకున్నారు. ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని, మంచి లాభాలు వస్తాయంటూ ఓ సినీ నిర్మాత, వివేక్ ఒబెరాయ్ ఇద్దరు వ్యాపార భాగస్వాములు నమ్మించారు. ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. కానీ, ఆ సొమ్మును ముగ్గురు వ్యక్తులు సొంతానికి వాడుకున్నారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. సదరు ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో వివేక్ ఒబెరాయ్ భార్య కూడా భాగస్వామిగా ఉన్నారు. -
విశాఖలో అంతర్జాతీయ యానిమేషన్ చిత్ర నిర్మాణం
విశాఖ (ఏయూ క్యాంపస్): అంతర్జాతీయ యానిమేషన్ చిత్రం ‘నోహాన్ ఆర్క్’ విశాఖ కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. విశాఖ ఐటీ పార్కులోని సింబయాసిస్ టెక్నాలజీస్ సంస్థలో అమెరికా, బ్రెజిల్ దేశాలకు చెందిన నిర్మాతలు దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.45 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో యానిమేషన్ ఫిల్మ్‌గా దీనిని రూపొందిస్తున్నట్టు సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈవో ఓ.నరేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర నిర్మాణంలో భాగంగా సముద్రంలో తుపానులను సృష్టించే వీఎఫ్‌ఎస్‌ల కోసం ప్రత్యేక కంప్యూటర్లను వినియోగిస్తామన్నారు. ఇటువంటి అంతర్జాతీయ చిత్రాలు మరిన్ని నిర్మించడానికి వీలుగా వీఎఫ్ఎక్స్, లైవ్‌ల్యాబ్, డబ్బింగ్ స్టూడియో, ఫిల్మ్ ల్యాబ్‌లను సిద్ధం చేశామన్నారు. షార్ట్ ఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌లు చిత్రీకరించి, ఎడిటింగ్, డబ్బింగ్ చేసే విధంగా అత్యున్నత సదుపాయాలను తమ సంస్థలో నెలకొల్పడం జరిగిందన్నారు. అంతర్జాతీయ యానిమేషన్ చిత్రాల రూపకల్పనలో విశాఖకు మంచి గుర్తింపు లభించినట్టుగా తాము భావిస్తున్నామన్నారు. చిత్ర నిర్మాణం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ఐటీ శాక మంత్రి గుడివాడ అమర్నాథ్కు సోమవారం సాయంత్రం నరేష్కుమార్ వివరించగా.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
ఐదుగురు నిర్మాతలతో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్: కటకం శ్రీకాంత్
Young Mantra Organization Entry Into Movie Production: డిజిటల్ సినిమా రంగంలో పదేళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ 'యంగ్ మంత్ర'. ఇప్పటి వరకు 500లకుపైగా చిత్రాలను ప్రమోట్ చేసిందీ సంస్థ. ప్రస్తుతం ఆ అనుభవమే పెట్టుబడిగా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలకు మూడు చిత్రాలను నిర్మిస్తుండగా, వాటితోపాటు త్వరలోనే నూతన నటీనటులతో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మంచి కంటెంట్, వారి డిజిటల్ ప్రమోషన్స్ అనుభవంతో నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తామని 'యంగ్ మంత్ర' వ్యవస్థాపకుడు కటకం శ్రీకాంత్ తెలిపారు. డిజిటల్ ప్రమోషన్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. 'టాలీవుడ్లో మొదటగా డిజిటల్ ప్రమోషన్స్ ప్రారంభించిన సంస్థల్లో యంగ్ మంత్ర ఒకటి. ఇప్పటివరకు 500లకుపైగా చిత్రాలకు ప్రమోషన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలతో పనిచేశాం. ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా మరింత అప్డేట్ అవుతూ మరిన్ని ఎక్కువ సినిమాలను తక్కువ ఖర్చుతో ప్రమోట్ చేయడమే మా లక్ష్యం. త్వరలోనే మా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్లో ఐదుగురు ప్రముఖ నిర్మాతలు విడుదల చేయనున్నారు.' అని కటకం శ్రీకాంత్ పేర్కొన్నారు. -
సూత్రధార్.. పాత్రధార్
హిమాయత్‌నగర్:‘‘అలనాటి నటులు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు తదితర మహా నటులు సైతం నాటకాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన వారే. నటన అనేది థియేటర్ ఆర్ట్స్‌తోనే వస్తుందంటున్నారు నటులు. థియేటర్ ఆర్ట్‌లోనే నటనకు ఓనమాలు దిద్దుకోవచ్చునంటున్నారు ‘సూత్రధార్’ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ అధినేత వినయ్‌వర్మ. కామెడీ, సీరియస్, విలనిజం, ఏడిపించడం, కవ్వించడం ఆయన సొంతం. థియేటర్ ఆర్ట్స్‌లో ఆయనకు తిరుగు లేదు. నటనలో లీనమవ్వడం, ఇతరులను మెప్పించడం ఆయనకే సాధ్యం. దేశవ్యాప్తంగా ఆయనకో క్రేజ్ ఉంది. నవలల్లోని స్టోరీలను ఆధారంగా చేసుకుని నేటివిటీ తగ్గట్టు నాటకాన్ని రూపుదిద్దుతారు. నాటకం పూర్తయ్యే వరకు కుర్చీలో కూర్చోబెట్టగలిగే ప్రతిభ వినయ్‌వర్మ సొంతం. హిమాయత్‌నగర్‌కు చెందిన వినయ్‌వర్మ. 1980లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సోషియాలజీ’ పీజీ పూర్తి చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో హుషారుగా ఉండేవారు. ఆయన ప్రతిభను గుర్తించిన రీసర్చ్ స్కాలర్ డాక్టర్ గోయల్ నాటకం చేస్తావా..అంటూ అడిగారు. రూ.లక్షలు వదిలి..లక్ష్యం దిశగా ఆయన మాటను కాదనలేక నటించేందుకు ఒప్పుకున్న వినయ్‌వర్మ ‘యాంగ్రీయంగ్ మ్యాన్’గా చేశారు. ఒక లీడర్‌గా వ్యతిరేకంగా వెళ్లే క్యారెక్టర్లో లీనమైన వినయ్‌వర్మ యూనివర్సిటీలోని అందర్నీ తన నటనతో మెప్పించాడు. అందరూ ప్రశంసించడంతో నటనపై దృష్టి సారించాడు. ఇదే నటనతో యావత్ ప్రజానీకాన్ని మెప్పించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. చదువు పూర్తయ్యాక ‘డేనా’ బ్యాంకులో ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినా, తన లక్ష్యం కోసం రూ. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. ‘ సూత్రధార్’ ద్వారా 65కి పైగా నాటకాలు హిమాయత్‌నగర్‌లో 1998లో ‘సూత్రదార్’ పేరుతో థియేటర్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా అనేక నవలల్లోని అతి ముఖ్యమైన కథలను నాటకాలుగా చిత్రీకరించారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కలకత్తా, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, భోపాల్, ఉదయ్‌పూర్ తదితర నగరాల్లోనూ నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 45 నిమిషాల నుంచి రెండు గంటల పాటు ఉండే ఈ నాటకాల్లో ‘నవ్వించడం, ఏడిపించడం, టెన్షన్‌కు గురి చేయడం, థ్రిల్ అయ్యేలా చెయ్యడం, మెప్పించడం, ఒప్పించడం’ ఆయనకు మాత్రమే సొంతం అనేలా అక్కున చేర్చుకున్నారు ప్రేక్షకులు. ‘లవ్’తో తెరంగేట్రం.. నాటకాల్లో అతడి నటనను చూసి మెచ్చిన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ డైరెక్టర్లు తమ సినిమాల్లో అతడికి అవకాశాలు ఇచ్చారు. 2001లో ‘లవ్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన వినయ్‌వర్మ ఆ సినిమాలో ‘టెర్రరిస్ట్’గా నటించాడు. ఆయన నటకు, తెరపైకి వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులను కుర్చీలలో నుంచి కదలనివ్వకుండా చేశాడు. ఇలా తెలుగులో 19 సినిమాలు, హిందీలో 7 సినిమాలు, హాలీవుడ్లో ‘బీపర్’ అనే సినిమాలో నటించాడు. బుల్లితెరపై కూడా తొమ్మిది సీరియల్స్ చేశాడు. అబ్బే..ఏం లేదు ఇప్పటి వరకు ఆయన చేసిన నాటకాలన్నీ హిందీ, ఉర్దూ, మరాఠి, గుజరాతి తదితర భాషలకు చెందినవే. మొదటిసారి తెలుగు స్టోరీతో తెలుగులో ‘అబ్బే..ఏం లేదు’ అనే నాటకంతో ముందుకొస్తున్నాడు వినయ్‌వర్మ. ఓ కుటుంబంలో భార్య, భర్త, పనివాడు, డాక్టర్, ఇద్దరు దొంగలతో రూపుదిద్దుకున్న నాటకమే ‘అబ్బే..ఏం లేదు’. వినయ్‌వర్మ మొదటిసారి తెలుగులో చేస్తున్న నాటకం కావడంతో సిటీ ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో బంజారాహిల్స్‌లోని ‘లామాకాన్’ ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ‘థియేటర్ ఆర్ట్’ బేసిక్ నాలెడ్జ్ నాటకం అంటే ఈ రోజుల్లో వారికి పెద్దగా తెలీదు, దానిని లైట్‌గా తీసుకుంటారు. థియేటర్ ఆర్ట్ అనేది బేసిక్ నాలెడ్జ్. దాని నుంచి సినిమాల్లోకి వెళితే అవలీలగా చేయగలిగే శక్తి, సామర్థ్యాలు వస్తాయి. హీరో విజయ్ దేవరకొండ కూడా థియేటర్ ఆర్ట్ నుంచి సినిమాల్లోకి వెళ్లిన వ్యక్తే. విజయ్ నా శిష్యుడు అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. నటనపై ఆసక్తి, డెడికేషన్ ఉన్న వారికే నేను నేర్పిస్తా. మొదటిసారి తెలుగు నవలలోని ఓ కథను ‘అబ్బే..ఏం లేదు’ అనే పేరుతో ప్రదర్శిస్తున్నాము. – వినయ్‌వర్మ, నటుడు, ‘సూత్రధార్’ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ అధినేత. -
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్, సునీల్ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సినిమాస్ సంస్ద ఏఎంబీ మాల్‌ను ఏర్పాటు చెసిన సంగతి తెలిసిందే. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ను కూడా నిర్మించింది. హీరో అల్లు అర్జున్‌తో మరో మల్లీఫ్లెక్స్‌ను కూడా నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ సంస్థ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమాని నిర్మిస్తోంది. -
ఓ స్త్రీ కథ
ఇంట, బయట, ఆఫీసుల్లో, కార్ఖానాల్లో..గుడిలో, బడిలో, మడిలో..అంతటా ఆమే.అవని అంతా ఆమే.ఆమె లేనిది ఏమీ లేదు.ఆమె ఉన్న చోట లేనిదంటూ ఏదీ లేదు. ఈ ఆలోచన దూరదర్శన్ ఛానెల్‌ని 90ల కాలంలో అమాంతం ఆకాశమంత ఎత్తు పెంచేసింది. ఏక్ ఔరత్ కి కహాని అంటూ చిన్నతెర ఓ స్త్రీ కథను చెప్పడం మొదలుపెట్టింది.అది ‘శాంతి’గా అందరి మదిని తట్టి లేపింది. ఇలా మొదలు... దేశంలో అతి పెద్దదైన బాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు స్నేహితులతో ‘శాంతి’ కథ ప్రారంభమవుతుంది. ఈ ఇద్దరు స్నేహితుల పేర్లు కామేష్ మహదేవన్, రాజేష్ సింగ్. ఒకరు రచయిత, ఇంకొకరు దర్శకనిర్మాత. ఈ ఇద్దరూ అత్యంత విలాసవంతమైన శాంతి మాన్షన్‌లో నివసిస్తుంటారు. శాంతి ఓ జర్నలిస్ట్ ప్రతీ ఒక్కరి వెనకాల ఓ గతం ఉంటుంది. ఆ గతాన్ని తెలుసుకొని, ఆ రహస్యాలను తన రచనల ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తుంటుంది జర్నలిస్ట్ శాంతి. సంపన్నుల ఇళ్లలో పనిచేసే సర్వెంట్స్ సమస్యల మీద కామేష్, రాజ్‌లు ఓ సినిమా తీసి, మంచి పేరు సంపాదిస్తారు. సెలబ్రిటీలైన వీరిద్దరి బయోగ్రఫీలు రాయాలని అనుకుంటుంది శాంతి. ఓ రోజు కామేష్, రాజ్‌లను కలిసి మంచి సినిమా తీశారని అభినందిస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి కుటుంబాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం కామేష్, రాజ్‌లకు తెలియదు. గత కాలపు నీడల జాడలు కామేష్ పెద్ద కొడుకు రమేష్ బుద్ధిమాంద్యుడని, చిన్న కొడుకు సోమేష్ తన స్క్రిప్ట్‌ని చివరికి తండ్రి కూడా తిరస్కరించడంతో తీవ్ర మనోవేదనకు లోనై కుంగిపోయి ఉన్నాడని తెలుసుకుంటుంది. కామేష్ భార్య ఆయేషా గతంలో ఓ సినీ నిర్మాత కూతురు. ఆ నిర్మాత కెరీర్‌ను ఈ ఇద్దరు స్నేహితులు కలిసి నాశనం చేశారనే విషయం స్పష్టం అవుతుంది. తన దత్తత కూతురు నిధి భర్త కామేష్ అక్రమసంతామని చెబుతుంది ఆయేషా. కామేష్ కుటుంబం తర్వాత రాజ్ సింగ్ కుటుంబ సభ్యులను కలుసుకుంటుంది. రాజ్‌సింగ్ భార్య మనశ్శాంతి కోసం సాధువులను కలుసుకోవడానికి తరచూ ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటుంది. ఆమెను కలుసుకున్న శాంతికి ఎన్నో నిగూఢమైన విషయాలు తెలుస్తాయి. తన కొడుకు నిహాల్, అమెరికన్ ఫ్రెండ్ మైఖేల్‌కి తనకు పుట్టిన సంతానం అని శాంతి ముందు బయట పెడుతుంది రాజ్‌సింగ్ భార్య. కూతురు మాయ తల్లి దూరం అవడంతో డిప్రెషన్ బారిన పడుతుంది. స్త్రీలోలుడు అయిన పెద్ద కొడుకు రోహణ్ మోడల్ సశ ను పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఉంటాడు. అత్యంత విలాసవంతమైన శాంతి మాన్షన్‌లో ఉన్న వీరందరి గత జీవితాలను తెలుసుకునే క్రమంలో తన పుట్టుకకు కారణం ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోతుంది శాంతి. ఒకప్పుడు శాంతి మాన్షన్ నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేసేది శాంతి తల్లి. ఆ మాన్షన్‌లోనే ఈ సినీ నిర్మాత, రచయిత కామేష్, రాజ్‌లు ఆమెపై లైంగిక దాడి చేస్తారు. గర్భవతి అయిన ఆమె ఒంటరిగా కూతుర్ని కని, పెంచి పెద్ద చేస్తుంది. పురుషాధిక్య సమాజంలో ఒంటరిగా ఒక తల్లి ఏ విధంగా జీవించిందో ఆమె పాత్ర స్పష్టం చేస్తుంది. సామాజిక, రాజMీ య శక్తులుగా ఎదిగిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె తన కూతురు పెంపకంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. స్త్రీ ఆధారిత సీరియల్స్‌కు చుక్కాని పాతికేళ్ల క్రితం సామాజిక సమస్యలను కళ్లకు కట్టిన తొలి డెయిలీ సీరియల్ శాంతి. 780 ఎపిసోడ్స్‌తో సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమైన శాంతి ఆ తర్వాత వచ్చిన స్త్రీ ఆధారిత సీరియల్స్‌కి స్ఫూర్తిగా నిలిచింది. అక్కణ్ణుంచే స్త్రీని శక్తిమంతురాలిగా, ప్రధాన పాత్రధారిణిగా చూపించడం మొదలుపెట్టింది చిన్నతెర. అలా ఆ తర్వాత వరసగా దూరదర్శన్‌లో వచ్చిన సీరియల్స్‌లో ‘రజని’ ఒకటి. ఓ మధ్యతరగతి గృహిణి సమాజంలోని అసమానతలను తొలగించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం ఈ సీరియల్లో చూస్తాం. అటు తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ పాత్రను కళ్లకు కట్టిన ‘ఉడాన్’ సీరియల్‌కి దర్శకత్వ ప్రతిభను అందించింది కవితా చౌదరి భట్టాచార్య. ఈ సీరియల్లో లింగవివక్ష, మహిళా సాధికారిత.. వంటి పాయింట్స్‌ను బేసిక్‌గా తీసుకున్నారు. ఇది మొట్టమొదటి మహిళా ఓరియెంటెడ్ టీవీ షోగా దూరదర్శన్ హిస్టరీలో చేరింది. ఒక మహిళా పోలీస్ అధికారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్ సీరియల్‌ని తీశారు. మహిళ ఎదగడానికి ఎలాంటి అడ్డంకులు లేవని, వారి కలలకు, ఆకాంక్షలకు అకాశమే హద్దు అని ఓ మహిళ ఈ సీరియల్‌ని డైరెక్ట్ చేసి చూపించారు. ఆ తర్వాత నేవీ అధికారిణిని పరిచయం చేస్తూ వచ్చిన ‘ఆరోహణ్’ సీరియల్ కూడా అదే బాటలో నడిచింది. ‘ఔరత్’ సీరియల్ ద్వారా కుటుంబంలో మహిళకు విద్య, సాధికారతతోపాటు పెళ్లి చేసుకోవడానికి వరుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మహిళకు ఇచ్చి తీరాలని లాయర్ పాత్ర ద్వారా చూపించారు. ఇలా మహిళా అభ్యున్నతి కోసం పాటు పడే స్త్రీ ఆధారిత కథలు రావడం శాంతి సీరియల్ నుంచే మొదలయ్యాయి. – ఎన్.ఆర్. చాలామందికి ఆమె శాంతిగానే పరిచయం. మందిరాబేడి అనగానే శాంతి పేరు కూడా స్ఫురణకు వస్తుంది. ప్రేక్షకుల మదిలో అంతగా నిలిచిపోయేలా దర్శకుడు ఆది పోచా శాంతి పాత్రను మలచిన తీరు అమోఘం. 1994లో వచ్చిన శాంతి సీరియల్ ద్వారా మందిరాబేడి దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలైంది. ఇండియన్ టెలివిజన్‌లో ఒక జర్నలిస్టు పాత్రను పరిచయం చేసిన మొట్టమొదటి సీరియల్ శాంతి. అప్పటికే అడ్వరై్టజింగ్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నారు మందిరాబేడి. ఆ క్రమంలో దర్శకుడు ఆది పోచా దృష్టిలో పడ్డారు ఆమె. ట్రౌజర్, టీ షర్ట్–జీన్స్, సల్వార్, కమీజ్‌లతో మందిరాబేడికి ఆడిషన్ టెస్ట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మందిరాబేడి మాట్లాడుతూ – ‘శాంతి సీరియల్ తర్వాత నా వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. శాంతిలో ఏదో చిన్న పాత్ర ఇస్తారు అనుకున్నాను. కానీ, నేనే ‘శాంతి’ అన్నారు డైరెక్టర్. నమ్మలేకపోయా. నాకు ఈ ఫీల్డ్‌లో విధమైన బ్యాక్‌గ్రౌండ్ లేదు. నటనలో ఎన్నో ఏళ్లు ఎంతో కష్టపడితే గాని ఇలాంటి పాత్రలు రావు. అలాంటిది శాంతి పాత్ర నన్ను వరించింది. శాంతి చాలా ౖస్రాంగ్ ఉమెన్. ఎన్నో సమస్యలను సాల్వ్ చేస్తుంది. శాంతి నన్ను శక్తిమంతురాలిని చేసింది’ అన్నారామె. -
చిత్ర నిర్మాణ రంగంలోకి ఏషియన్ గ్రూప్
యాభైఏళ్లుగా 600ల సినిమాలకు ఫైనాన్స్ అందించి, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సంస్థ ఓ చిత్రం నిర్మించనుంది. ఈ లవ్ స్టోరీకి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు (తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్) వ్యవహరించనున్నారు. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే ప్రాజెక్ట్‌పై అటు ఇండ్రస్టీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కంటెంట్‌ని తప్ప క్రేజ్‌ని నమ్ముకోని శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న ఈ ప్రేమకథకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: విజయ్ భాస్కర్. -
నిర్మాతలుగా ఒబామా దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ‘నెట్‌ఫ్లిక్స్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్ నిర్మించి నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఒబామా దంపతులు నిర్మించే డాక్యుమెంటరీల్లో ముందస్తు స్క్రిప్టు రాసుకున్నవి, స్క్రిప్టు అవసరంలేని డాక్యుమెంటరీలు ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల అనుభవాలను కూడా నెట్‌ఫ్లిక్స్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో ఒబామా దంపతులకు త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గత మార్చి నెలలోనే ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఒబామా దంపతులు ‘హయ్యర్ గ్రౌండ్ ప్రొడక్షన్స్’ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించబోతున్నామని, వారి విలువైన అభిప్రాయలను, అభిరుచులను తెలుసుకోవడంతోపాటు వాటిని ప్రపంచ ప్రజలతో పంచుకునేలా చేయడం కోసమే తాము ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ వర్గాల ప్రజల్లో నిగూఢంగా దాగున్న నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని కూడా వెలికితీసి ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. -
నిర్మాణ రంగంలోకి టాప్ మ్యూజిక్ కంపెనీ
ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎన్నో భారీ చిత్రాల ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న ఈ సంస్థ తొలిసారిగా ఓ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'తీరన్ అధిగరమ్ ఒండ్రు' సినిమాను ఆదిత్య సంస్థ తెలుగులో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జిబ్రన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిమన్యు సింగ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కార్తీ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు ఆదిత్య మ్యూజిక్ ఎండి ఉమేష్ గుప్తా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 30న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.