బాబు ముడుపులకు 'రోహిత్‌' వేషం! | Nara Rohith Movies With Black Money of TDP Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బాబు ముడుపులకు 'రోహిత్‌' వేషం!

Published Thu, Feb 15 2024 4:39 AM | Last Updated on Thu, Feb 15 2024 12:56 PM

Nara Rohith Movies With Black Money of TDP Chandrababu Govt - Sakshi

బహుశా.. ఇలాంటి ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ!! ఆయన ‘స్కిల్‌’ మామూలుదా!! ముడుపులు పుచ్చుకోవడంలో, తీసుకున్న వాటిని తెలివిగా దారి మళ్లించి తన జేబులోకి తెచ్చుకోవడంలో ఆయన ‘స్కిల్స్‌’ను బయటపెట్టే ‘సినిమా’ కథ తాజాగా బయటపడింది. ఈ కథకు హీరో ఒక్కడే. బాబు సోదరుడి కొడుకు నారా రోహిత్‌. నిర్మాతలుగా బయటకు వేరేవారు కనిపించినా... సహ నిర్మాతలుగా, ఫైనాన్షియర్లుగా వ్యవహరించింది మాత్రం బాబు హయాంలో వివిధ ప్రాజెక్టుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. తీసిందేమో ఫ్లాపు సినిమాలు. భారీగా నష్టం వచ్చిందంటూ ప్రకటనలు. చంద్రబాబుకు మాత్రం లాభాలే లాభాలు!. అదెలాగని ఆశ్చర్యపోతున్నారా? లంచాలు దిగమింగడంలో బాబు మాస్టర్‌మైండ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించే టాలీవుడ్‌ సినిమాల కథ ఇదిగో...  

సాక్షి, హైదరాబాద్‌: అరె! ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రూపాయి లాభం తెచ్చిన పాపాన పోలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం బ్రేక్‌ ఈవెన్‌ (లాభనష్టాలు లేని స్థితి) సాధించింది లేదు. ప్రతి సినిమాకూ పెట్టిన పెట్టుబడిలో కనీసం 80 శాతం తిరిగి రాలేదని నిర్మాతలే చెబుతున్నారు. అలాగని అవేవీ చిన్న సినిమాలు కావు. అన్నీ 30–40 కోట్ల రేంజి బడ్జెట్‌ సినిమాలేనట? మరి ఇలా నష్టాలొచ్చినా సరే వదలకుండా అదే హీరోను పెట్టి వరసగా ఏడాదిలో ఆరేడు సినిమాలు తీసేశారంటే ఏమనుకోవాలి? బ్లాక్‌ మనీ దండిగా ఉన్నవాళ్లు కూడా నేరుగా డబ్బును కాల్చేయటం ఎందుకన్న ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు తీయరు. కానీ నారా రోహిత్‌తో మాత్రం కొందరు నిర్మాతలు పదేపదే ఫ్లాప్‌ సినిమాలు తీశారు. ఫ్లాపు సినిమాలిచ్చిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ ఫ్లాపు సినిమాలు తీశారు.

ఒకసారి దర్శకత్వం వహించి ఫ్లాపు సినిమా ఇచ్చిన వ్యక్తి అదే హీరోతో మరో సినిమాకు నిర్మాతగా కూడా మారాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  ఇదీ... 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ‘సూపర్‌ స్టార్‌’గా మారిపోయిన ‘నారా రోహిత్‌’ కథ. విచిత్రమేంటంటే రోహిత్‌కు 2014కు ముందు పెద్దగా సినిమాలు లేవు. 2019లో చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయాక కూడా సినిమాలు లేవు. కానీ 2014–1019 మధ్య మాత్రం ఏకంగా 17 సినిమాలు వచ్చాయి. అంటే... చంద్రబాబు అధికారానికీ, నారా రోహిత్‌ సినిమాలకూ ఏదో సంబంధం ఉందనేగా అర్థం. అది ఏ సంబంధమంటే... ముడుపుల సంబంధం. బ్లాక్‌ మనీ సంబంధం.

బాబు ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు, సంస్థలు ఆయనకు నేరుగా ముడుపులివ్వటానికి ఇబ్బంది పడ్డారు. జీఎస్టీ వచ్చాక కాంట్రాక్టర్లకు మొత్తం బిల్లులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే చెల్లించాల్సి వచ్చింది. దీంతో వారు ఆ డబ్బుల్లో నుంచి ఎవరికి ఎంత చెల్లించినా ఐటీకి లెక్కలు చెప్పాల్సి వచ్చేది. మరి బాబుకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వడమెలా? దీనికోసం మాస్టర్‌ మైండ్‌ చంద్రబాబు ఒక మార్గం కనిపెట్టాడు. తన తమ్ముడు రామ్మూర్తి నాయుడి కొడుకు నారా రోహిత్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీయాల్సిందిగా తెలిసిన నిర్మాతలు, దర్శకులకు పురమాయించాడు.

దానికి కావాల్సిన డబ్బులు మాత్రం ఈ కాంట్రాక్టర్లు, తన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్లు సహ నిర్మాతల రూపంలోనో, ఫైనాన్సియర్లగానో చెల్లిస్తారు. ఓ 5 కోట్లతో పూర్తయ్యే సినిమాకు ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్‌ కేటాయించటమే కాక... అంతా ఖర్చుపెట్టినట్లు చూపిస్తారు. వాస్తవంగా రూ.5 కోట్లు ఖర్చయితే.... మిగతా రూ.35 కోట్లు నేరుగా బాబు బంగళాకు చేరిపోతాయి. ఇక ఈ సినిమా ఎలాగూ ఐదారు కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేయదు. దీంతో తాము భారీగా నష్టపోయామని నిర్మాతలు ప్రకటిస్తారు. విచిత్రమేంటంటే ఇలా డిజాస్టర్‌ అయి నష్టపోయిన నిర్మాతలు... మళ్లీ అదే హీరోతో, మళ్లీ భారీ బడ్జెట్‌తో మరో సినిమా తీయటం. ఇలా ఏడాదిలోనే ఆరేడు సినిమాలు తీశారంటే పరిస్థితిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 

ఇదీ... రోహిత్‌ ఫ్లాపుల కథ 
నారా రోహిత్‌ యావరేజ్‌ నటుడు. 2009 నుంచి 2014 వరకు.. అంటే చంద్రబాబు సీఎం కుర్చిలో లేని ఆ ఐదేళ్లలో అతను నటించిన సినిమాలు నాలుగే,. బాణం (2009), సోలో (2011), సారొచ్చారు (2012), ఒక్కడినే (2013). మొదటి రెండూ యావరేజ్‌ కాగా, మిగిలిన రెండూ డిజాస్టర్లు. దాంతో రోహిత్‌కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏడాది తర్వాత చంద్రబాబు సీఎం కాగానే రోహిత్‌ ముఖ ‘చిత్రం’ మారిపోయింది. హిట్‌ హీరోలకు సైతం సాధ్యం కాని స్థాయిలో వరుస పెట్టి సినీ అవకాశాలొచ్చాయి. 2019లో బాబు దిగిపోయేనాటికి ఏకంగా 17 సినిమాలు. అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. నిజానికి వీటిలో చాలా సినిమాలు రిలీజ్‌ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలీదు. మళ్లీ 2019లో చంద్రబాబు దిగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రోహిత్‌ చేయలేదు.  

ఇలా, అలా తిప్పి.. కొడుకు చేతికి డబ్బులు 
ఒక ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టరుకు ప్రభుత్వం రూ.500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసిందనుకోండి. ఒప్పందం ప్రకారం దీన్లో 50 శాతం అంటే రూ.250 కోట్లు ముడుపులు బాబుకివ్వాలి. నగదు రూపంలో ఇవ్వటం సాధ్యం కాదు కదా? మరి ఎలా? దీంతో కొన్ని సినిమా నిర్మాణ సంస్థలను పుట్టించారు. ఆ సంస్థల పేరిట అనేక బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేశారు. ఒక్కో ఖాతాకు చిన్న చిన్న మొత్తాల్లో రూ.250 కోట్లు తరలించారు. ఇక ఆయా ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయటం కోసం సినిమా నిర్మాణం అనే పేరు పెట్టారు. రూ.2–3 కోట్లలో చుట్టేసిన చిన్న చిన్న సినిమాలకు కూడా రూ.30–40 కోట్లు అయిందని దొంగ లెక్కలు చూపించారు.

సినిమాలో రోజు వారీ ఖర్చులు కింద / ప్రొడక్షన్‌ ఖర్చుల కింద వాటికి దొంగ బిల్లులు పెట్టారు. ప్రతి సినిమాకు రూ.20 కోట్లు– రూ.30 కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేశారు. అలా ఎక్కడా టాక్స్‌ చెల్లించే సమస్య రాకుండా చూసుకున్నారు. ఇలా మొత్తం డబ్బును బ్లాక్‌గా మార్చి, అటుతిప్పి ఇటుతిప్పి ఆఖరుకు చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతికి భద్రంగా చేర్చారు. ఇలా గుంటూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ ఒక్కడి దగ్గరే రూ.250 కోట్లు చిన్న చిన్న మొత్తాల్లో ట్రాన్స్‌ఫర్‌ చేయించారని ఆయనే ఇటీవల వాపోయారు. ఇలా నారా రోహిత్‌ను వాడేసుకుని 17 సినిమాలు హడావుడిగా చుట్టేసి.. చాలా మంది కాంట్రాక్టర్ల నుంచి ముడుపుల డబ్బును నారా లోకేశ్‌కు అందించారు. కాంట్రాక్టర్‌లే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల నుంచి కూడా ఇదే తరహాలో డబ్బులు దండుకున్నారని తెలిసింది.  

దొంగ లెక్కలతో బురిడీ 
ఆయా సినిమాల అంచనా వ్యయం, లాభనష్టాలు, వాస్తవ బడ్జెట్‌ వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. హీరో రెమ్యునరేషన్‌తో సహా నారా రోహిత్‌  సినిమా బడ్జెట్‌ ప్రొడక్షన్‌ స్టార్‌ కాంబినేషన్‌ను బట్టి రూ.5–10 కోట్లు లోపు మాత్రమే. అయితే రోహిత్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు మాత్రం వీటి బడ్జెట్‌ రూ.30 నుంచి 40, 45 కోట్ల దాకా కూడా చెబుతూవచ్చారు.

అదే విధంగా వాళ్ల బంధు గణంతోనే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అవతారాలు ఎత్తించి థియేట్రికల్‌ రైట్స్‌ను రూ.30 కోట్లు నుంచి రూ.40 కోట్లకు కొనిపించినట్లు చూపారు. అంటే ఆ సినిమాలు తీసేవాడూ, వాటిని కొనేవాడూ ఇద్దరూ ఒకరేనని తెలుస్తోంది. సినిమా ఆడలేదు కాబట్టి.. తమకు ఇంత నష్ట్టం వచ్చిందని ప్రభుత్వానికి ఈ ముఠా దొంగ లెక్కలు చూపించింది. ఇలా రోహిత్‌ సినిమాల ద్వారా లంచాల రూపంలో వచ్చిన బ్లాక్‌ మనీ సుమారు రూ.300 నుంచి 400 కోట్ల వరకు దండుకున్నారని అంచనా.  

ఈ ప్రశ్నలకు బదులేదీ? 
► బడా స్టార్స్, క్రేజీ హీరోలకు తప్ప మరే హీరోదైనా ఒక సినిమా డిజాస్టర్‌ అయింది అంటే రెండో సినిమా అవకాశం కనాకష్టం. అలాంటిది వరుసగా ఇన్ని సినిమాల్లో రోహిత్‌ ఎలా చేయగలిగాడు? 
► ఆయన సినిమాల బిజినెస్, కలెక్షన్ల ప్రకారం.. ప్రతి సినిమా రూ.20, 30 కోట్లకు పైగా భారీ నష్టాలు మూటగట్టుకుంది. అయినా కూడా నిర్మాతలు వరుస కట్టి అదే హీరోతో పదే పదే సినిమాలు ఎందుకు తీశారు? 
► అతి కొద్ది మంది తప్ప నారా రోహిత్‌ సినిమాలు తీసిన వారిలో ఎవరూ అంతకుముందు భారీ చిత్రాలు తీసిన చరిత్ర ఉన్న నిర్మాతలు కాకపోవడం ఇక్కడ గమనార్హం. అలాంటప్పుడు వారు ఈయనతో మాత్రమే భారీ చిత్రాలు ఎందుకు తీశారు?  
► ఆయా నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో కొందరు.. నారా రోహిత్‌ సినిమాల కోసమే పుట్టినట్టుగా పుట్టి ఆ తర్వాత కనిపించక పోవడం వెనుక అంతరార్థం ఏమిటి? 
► నారా రోహిత్‌ సినిమా నిర్మాతల్లో పలువురికి తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉండడం వెనుక మతలబు ఏమిటి? 

బాబు హయాంలో ఏకంగా 17 సినిమాలు 
2014: ప్రతినిధి 
2015: రౌడీ ఫెలో, అసుర, తుంటరి, సావిత్రి, 
2016: రాజా చెయ్యి వేస్తే, జో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడుండేవాడు 
2017: శమంతకమణి, ఒక్కడు మిగిలాడు, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, మెంటల్‌ మదిలో
2018: నీది నాది ఒకే కథ, ఆటగాళ్లు, వీరభోగ వసంతరాయలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement