తెరమరుగవుతున్న గోదారి
సాక్షి డెస్్క, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఏదో ఒకచోట తరచుగా సినిమా షూటింగులు జరుగుతుండేవి. ఆ పరిసరాల ప్రజలకు కొన్నాళ్ల పాటు ఇదే ముచ్చటగా ఉండేది. కమెడియన్‌ను చూశామనో.. విలన్‌ను పలకరించామనో.. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.
ఇప్పుడిది గత వైభవంగా మిగిలిపోతోంది. వెండితెరపై నాడు విరిసిన జిల్లా అందాలు నేడు అంతగా కనిపించడం లేదు. సహజసిద్ధ స్టూడియోగా పేరు సంపాదించిన ఇక్కడి ప్రకృతి అందాలు ఇప్పుడు చిన్నబోతున్నాయి. వ్యయ ప్రయాసలకు భయపడి నిర్మాతలు ఔట్‌డోర్ షూటింగులకు చాప చుట్టేయడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది.
ఎందుకిలా అయిందంటే..
చాలా రంగాలను ప్రభావితం చేసిన ఆధునిక సాంకేతికత సినిమాను కూడా తాకింది. గతంలో మాదిరిగా ఆర్టిస్టులందరినీ లొకేషనుకు తీసుకువెళ్లే రోజులు పోయాయి. అందరినీ తీసుకుని వెళ్లాలంటే బస, రవాణా వంటి ఖర్చులతో చాలా బడ్జెట్ అయ్యేది. ఇప్పుడు నిర్మాతలు ఈ విషయంలో పొదుపు పాటిస్తున్నారు. పాత రోజుల్లో సినిమా తీస్తూంటే మొత్తం ఆరి్టస్టులందరూ వచ్చేవారు. ఈ వ్యయం నిర్మాతలకు చాలా భారమయ్యేది. దీనికి తోడు ఎక్కువ సినిమా కథల నేపథ్యం పట్టణాలతో, నగరాలతో ముడిపడి ఉంటోంది. పల్లె కథలు తగ్గిపోతున్నాయి.
90 ఏళ్ల క్రితమే స్టూడియో
సుమారు 90 ఏళ్ల క్రితమే జిల్లాలో సినిమా షూటింగులకు స్టూడియో ఏర్పాటైంది. 1936లో నిడమర్తి దుర్గయ్య ధవళేశ్వరం వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో దుర్గా మూవీ టోన్ స్టూడియో నిర్మించారు. చల్‌మోహన్‌రంగా వంటి చిత్రాలు ఇక్కడ తీశారు. ఆరేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఇది మూత పడింది. కానీ జిల్లాలో షూటింగులు మాత్రం కొనసాగాయి.
జిల్లా నుంచి ఎందరికో చాన్స్
జిల్లాలో సినిమా షూటింగుల ప్రభావం ఫలితంగా చాలామంది ఈ రంగానికి వెళ్లాలని ఉత్సాహపడేవారు. దర్శక నిర్మాతలు తరచూ వస్తూండటంతో ఉమ్మడి జిల్లాలోని ఎంతోమంది ఔత్సాహికులకు సినిమా చాన్సులు దక్కాయి. అంజలీదేవి, జయప్రద, సుకన్య, జరీనా వహాబ్, వహీదా రెహమాన్, లలితారాణి వంటి వారు హీరోయిన్లుగా వెలుగొందారు. ఈ జిల్లా నుంచే చెన్నై వెళ్లిన భానుప్రియ మీద కూడా జిల్లాలో జరిగిన సినిమా షూటింగుల ప్రభావమే ఉంది. బాల నటుడిగా ఆలీకి అవకాశమొస్తే ఇప్పుడు అగ్రశ్రేణి కామెడీ నటుడయ్యారు. ఆయనకు ముందు రాజబాబు కూడా కామెడీలో రాణించారు.
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్‌గా పని చేసిన రంగనాథ్ ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆదుర్తి సుబ్బారావు, క్రాంతికుమార్, వంశీ, కాశీ విశ్వనాథ్, బాపు, శోభన్, ఎస్వీ కృష్ణారెడ్డి, సుకుమార్ నుంచి మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్కా వరకూ ఎందరో ఈ ప్రాంత వాసులు దర్శకులయ్యారు. నట వర్గం గురించి చెప్పుకుంటే జిల్లాకు చెందిన చాలామంది వెండితెరపై బలమైన ముద్ర వేసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా షూటింగులు తగ్గిపోవడంతో సినిమాల్లో జిల్లా ప్రాతినిధ్యం కూడా పలుచబడిందనే చెప్పాలి.
ఆదుర్తి నుంచి వంశీ వరకూ..
గోదావరి అందాలను పూర్తి స్థాయిలో వెండితెరకెక్కించిన ఘనత రాజమహేంద్రవరానికి చెందిన ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు దక్కుతుంది. 1963లో ఆయన తీసిన మూగమనసులు గోదావరి నేపథ్యంలోనే సాగింది. ఈ సినిమా హిట్ కావడంతో తర్వాత ఏదో ఒక విధంగా వెండితెరపై గోదావరి కనువిందు చేస్తూ వచ్చింది. 1963లో దర్శకుడు బాపు సాక్షి సినిమాకు జిల్లాలో ఎక్కువ లొకేషన్లు ఎంపిక చేసుకున్నారు. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రమిది. 1969లో బుద్ధిమంతుడు, 1973లో అందాల రాముడు తీశారు.
మూగమనసులు సినిమాతో గోదావరితో పరిచయమేర్పడిన కె.విశ్వనాథ్‌కు ఈ నదీ తీర ప్రాంతాల్లో షూటింగ్ అంటే ఎంతో ఇష్టం. 1973లో శారద సినిమాను గోదావరి పరిసరాల్లోనే నిర్మించారు. అక్కడి నుంచి వరుసగా తన చిత్రాలన్నింటిలోనూ గోదావరి అందాలను విశ్వనాథ్ తెరకెక్కించారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, బాలచందర్ సహా ఎందరో దర్శకులు పోటీ పడి మరీ గోదావరి జిల్లాలో చిత్రాలను నిర్మించారు. దేశంలోని ఇతర భాషా చిత్రాల షూటింగులకు కూడా మన ఉమ్మడి జిల్లా వేదికగా నిలిచింది.
వంశీ కేరాఫ్ గోదావరి
రాయవరం మండలం పసలపూడికి చెందిన సుప్రసిద్ధ దర్శకుడు వంశీకి గోదావరి అంటే ప్రాణం. అందుకే ఆయన చిత్రాల్లో గోదావరి అందాలే కాదు భాష, యాస కూడా కనిపిస్తూ మనసును గిలిగింతలు పెడతాయి. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమా పూర్తిగా గోదావరి ప్రాంతంతో ముడిపడిన వినోదభరిత చిత్రం. గోదావరి లేకుండా ఆయన ఏ సినిమా తీయలేదేమో అనిపించేలా జిల్లా లొకేషన్లన్నీ చూపించారాయన.