ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు
చెన్నై(తమిళనాడు): తమిళనాడు వ్యాప్తంగా సినిమా షూటింగ్‌లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) చేపట్టిన ఆందోళనతో దాదాపు 20 సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది. షూటింగ్ నిలిచిపోయిన సినిమాల్లో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కాలా’ కూడా ఉంది. ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ నిరసనలో 24 సంఘాలకు చెందిన దాదాపు 25వేల మంది సినీ సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే, వీరి డిమాండ్‌లను తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(టీఎఫ్‌పీసీ) తోసిపుచ్చింది.
ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ నేతలకు టీఎఫ్‌పీసీ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు ముదిరిపోయాయి. ‘బిల్లా పాండి’ సినిమా షూటింగ్ సందర్భంగా వేతనాలు పెంచాలనే డిమాండ్‌పై ఆ చిత్ర నిర్మాత-నటుడు అయిన ఆర్‌కే సురేష్‌తో ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ముదిరి మంగళవారం సమ్మె దాకా వెళ్లింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న టీఎఫ్‌పీసీ ప్రెసిడెంట్ విశాల్.. ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ సభ్యులు కానివారితో షూటింగ్‌లు చేసుకోవాలని నిర్మాతలకు సలహాఇచ్చారు. అయితే, దీనిపై ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి మండిపడ్డారు.
ఇదివరలో కుదుర్చుకున్న వేతన ఒప్పందం జూలై 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే మరో వేతన ఒప్పందం తీసుకురావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. సినీ రంగ పనివారి డిమాండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని, ప్రత్యామ్నాయ మార్గాల్లో షూటింగ్‌లు కొనసాగించుకోవాలని టీఎఫ్‌పీసీ ప్రెసిడెంట్ విశాల్ సూచించారు. ఆయన నటిస్తున్న సినిమా ‘తుప్పరివాలన్’ షూటింగ్ మంగళవారం కొనసాగింది.