కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు!
7వ వేతన సంఘం సిఫార్సులపై సీఓఎస్ నివేదిక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు! ఏడో వేతన సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదించే అవకాశముంది. దీంతో కోటి మందికిపైగా ఉద్యోగుల, పింఛనుదారుల జీతభత్యాలు దాదాపు 23.5 శాతం పెరగనున్నాయి. కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ(సీఓఎస్) వేతన సంఘం సిఫార్సులపై నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీన్ని ప్రభుత్వం ఆమోదించే అవకాశముందని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా సోమవారం చెప్పారు. సీఓఎస్ ఆధారంగా త్వరలో జరిగే కేబినెట్ భేటీకి సమర్పించేందుకు ఆర్థిక శాఖ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేస్తోందన్నారు.
జనవరి 1 నుంచి కమిషన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్ల జీతభత్యాలకు సంబంధించి ఏడో వేతన సంఘ సిఫార్సులను అమలు చేసేందుకు హైపవర్ కమిటీని నియమించడం తెలిసిందే. ఈ సిఫార్సులతో ప్రభుత్వంపై అదనంగా రూ. 1.02 లక్షల కోట్ల భారం పడనుంది. బేసిక్‌పై 14.27 పెంచాలని సంఘం సిఫార్సు చేసింది. ఆరో వేతన సంఘం 20% పెంపును సిఫార్సు చేసింది.
ఈసారి పెంపు 23.5%లో భత్యాలూ ఉన్నాయి. ప్రారంభ వేతనం నెలకు ప్రస్తుత రూ. 7 వేల నుంచి రూ. 18 వేలకు పెంచాలని, అత్యధిక వేతాన్ని రూ. 90 వేల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచాలని పే కమిషన్ సిఫార్సు చేసింది. అయితే కనీస వేతనం రూ. 23,500, అత్యధిక వేతనం రూ. 3.25 లక్షలు పెంచడానికి సెక్రటరీల కమిటీ సూచించి ఉండవచ్చని సమాచారం.